హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Rotavac 5D: భారత్‌ బయోటెక్‌ రోటావ్యాక్‌ 5డీకి డబ్ల్యూహెచ్‌ఓ ప్రీక్వాలిఫికేషన్‌.. మరింత రక్షణ కల్పిస్తుందన్న సంస్థ

Rotavac 5D: భారత్‌ బయోటెక్‌ రోటావ్యాక్‌ 5డీకి డబ్ల్యూహెచ్‌ఓ ప్రీక్వాలిఫికేషన్‌.. మరింత రక్షణ కల్పిస్తుందన్న సంస్థ

భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్లా

భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్లా

భారత్‌ బయోటెక్‌ మరో ఘనతను సొంతం చేసుకుంది. ఆ సంస్థ అభివృద్ది చేసిన రోటా వైరస్‌ వ్యాక్సిన్‌ రోటావ్యాక్‌- 5డీకి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రీక్వాలిఫికేషన్‌ మంజూరు చేసింది.

భారత్‌ బయోటెక్‌ మరో ఘనతను సొంతం చేసుకుంది. ఆ సంస్థ అభివృద్ది చేసిన రోటా వైరస్‌ వ్యాక్సిన్‌ రోటావ్యాక్‌- 5డీకి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రీక్వాలిఫికేషన్‌ మంజూరు చేసింది. ఈ విషయాన్ని భారత్ బయోటెక్ సోమవారం ప్రకటించింది. పిల్లల్లో రోటా వైరస్ నుంచి రక్షణకు.. భారత్ బయోటెక్ సంస్థ రోటావ్యాక్‌ వ్యాక్సిన్​ను అభివృద్ధి చేసింది. ఆ వ్యాక్సిన్​ను మరింత అభివృద్ధి చేసి రోటావాక్ 5డిని రూపొందించింది. బఫర్ సొల్యూషన్ అవసరం లేకుండా నిల్వ చేయడం, తక్కువ మోతాదు(0.5 మి.లీ) డోసేజ్​లో రోటావ్యాక్‌-5డీ టీకాను తీసుకువచ్చినట్టు భారత్ బయోటెక్ తెలిపింది. ప్రీక్వాలిఫికేషన్‌ లభించడంతో యునిసెఫ్‌, పీఏహెచ్‌ఓ వంటి యునైటెడ్‌ నేషన్స్‌ (యూఎన్‌) ఏజెన్సీలు తమ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాలకు రోటా వ్యాక్‌ 5డీ వ్యాక్సిన్‌ను కొనుగోలు చేస్తాయి. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ సరఫరా మరింత వేగవంతం అవుతుందని భారత్ బయోటెక్ పేర్కొంది.

ఐదేళ్లలోపు వయసున్న పిల్లల్లో ప్రాణాంతక డయేరియా వ్యాధికి రోటా వైరస్ కారణమవుతుందని.. అలాంటి రోటా వైరస్ నుంచి ఈ వ్యాక్సిన్ మరింత రక్షణ కల్పిస్తుందని భారత్ బయోటెక్ పేర్కొంది. అంతేకాకుండా వ్యాక్సిన్ నిల్వ, సరఫరాకు తక్కువ ఖర్చు అవుతుందని సంస్థ తెలిపింది. రోటావ్యాక్-5డీ వ్యాక్సిన్ తక్కువ ధరలో, తక్కువ పరిమాణంలో అందుబాటులో ఉంటుందని భారత్ బయోటెక్ వెల్లడించింది. ఇది డయేరియా నివారణలో సురక్షితమైనది, ప్రభావవంతమైనదని తెలిపింది. ఐదు చుక్కల 0.5 ఎంఎల్​ డోసేజ్​తో నోటి ద్వారా ఇచ్చే ఈ మోనోవాలెంట్ టీకాను నాలుగు వారాల తేడాతో మూడు డోసుల్లో చిన్నారులకు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. 8 నెలలలోపు వయసున్న పిల్లలకు మాత్రమే ఈ వ్యాక్సిన్ ఇవ్వాలి. ఈ వ్యాక్సిన్‌ను 2-8 డిగ్రీ సెంటీగ్రేడ్‌ల వద్ద నిల్వచేయవచ్చని తెలిపింది.

‘రోటావ్యాక్ వ్యాక్సిన్​కు 2018 జనవరిలో డబ్ల్యూహెచ్​ఓ ప్రీక్వాలిఫికేషన్‌ పొందింది. 1986-1988 కాలంలో దిల్లీలోని ఎయిమ్స్​లో మొదటగా వైరస్ సోకిన పిల్లల నుంచి ఈ రోటా వైరస్​ను గుర్తించి వేరుచేశారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఈ వైరస్ నుంచి పిల్లలను రక్షించే సోషల్ ఇన్నోవేషన్ ప్రాజెక్టుకు భారత్ బయోటెక్ అంకురార్పణ చేసింది. 2013లో ఈ వ్యాక్సిన్​కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్​ను పూర్తి చేసింది. ఇందుకు సంబంధించిన డేటా.. ప్రఖ్యాత లాన్సెట్ జర్నల్​లో ప్రచురితమైంది’అని భారత్ బయోటెక్ పేర్కొంది.

భారత్‌ బయోటెక్‌ సంయుక్త మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్రా ఎల్లా మాట్లాడుతూ.. అంతర్జాతీయ నాణ్యత, భద్రత ప్రమాణాలకు అనుగుణంగా వ్యాక్సిన్‌ ఉందని ప్రీక్వాలిఫికేషన్‌ గుర్తింపు నిర్ధారిస్తుందని తెలిపారు. భారత్‌, విదేశీ భాగస్వాములతో కలిసి దేశీయంగా రోటావ్యాక్‌, రోటావ్యాక్‌ 5డీ వ్యాక్సిన్లను భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిందని అన్నారు. ఇది భారత్ బయోటెక్ భారత్ బయోటెక్ 30 ఏళ్ల కృషి అని చెప్పారు. రోటా వైరస్ నివారణలో పెద్ద పురోగతి ఏర్పడిందన్నారు.

First published:

Tags: Bharat Biotech, Children, WHO

ఉత్తమ కథలు