వ్యతిరేకంగా కార్మిక, రైతు, ఉద్యోగ సంఘాలు ఇచ్చిన రెండు రోజుల భారత్ బంద్ పిలుపు చాలా చోట్ల విజయవంతంగా మొదలైంది. బ్యాంకు ఉద్యోగులు కూడా సమ్మెలో చేరగా సోమ, మంగళవారాల్లో సర్వీసులకు అంతరాయం ఏర్పడనుంది.
కేంద్రంలోని బీజేపీ సర్కారు విధానాలకు వ్యతిరేకంగా కార్మిక, రైతు, ఉద్యోగ సంఘాలు ఇచ్చిన రెండు రోజుల భారత్ బంద్ పిలుపు చాలా చోట్ల విజయవంతంగా మొదలైంది. బ్యాంకు ఉద్యోగులు కూడా సమ్మెలో చేరగా రెండురోజుల పాటు సర్వీసులకు అంతరాయం ఏర్పడనుంది. ఇతర కీలక రంగాలూ ప్రభావితం కానున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోనూ భారత్ బంద్ కు అనుకూల వాతావరణం ఉన్నా, జనజీవనం స్తంభించిపోయే స్థాయిలో ప్రభావం కనిపించడంలేదు.
కేంద్రం తీరుకు నిరసనగా సోమ, మంగళవారాల్లో భారత్ బంద్ ఉంటుందని సంఘాలు ప్రకటించగా, ఇవాళ ఉదయం పలు రాష్ట్రాల్లో కార్మికులు, ఉద్యోగులు సమ్మెలో పాల్గొని ప్రదర్శనలు చేశారు. బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా ఈ బంద్‌కు మద్దతు ప్రకటించింది. ఫలితంగా రెండు రోజులు బ్యాంకుల సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండవు. ‘సోమ, మంగళవారాల్లో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడవచ్చు’ అని ఎస్బీఐ సహా అనేక బ్యాంకులు ఇప్పటికే కస్టమర్లకు సందేశాలు పంపాయి.
బ్యాంకింగ్ రంగంలోనేకాదు, ఉక్కు, చమురు, టెలికం, బొగ్గు, పోస్టల్, ఇన్సూరెన్స్ కంపెనీల ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. సంఘటిత, అసంఘటిత రంగాల్లో కలిపి మొత్తం 20 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారని అంచనా. బంద్ కారణంగా బ్యాంకింగ్, రవాణా, రైల్వే, విద్యుత్తు సర్వీసులపై ప్రభావం పడనున్నది.
కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు మద్దతు తెలుపుతున్నట్టు టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధానకార్యదర్శి రాయకంటి ప్రతాప్ తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. రెండు రోజుల భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ కార్మిక విభాగం నిర్ణయించింది. బీఎంఎస్ మినహా రాష్ట్రంలోని అన్ని కార్మిక సంఘాలు, బ్యాంకు ఉద్యోగ సంఘాలన్నీ ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. కాగా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు మాత్రం ఉద్యోగులు భారత్ బంద్ లో పాల్గొనరాదంటూ కండిషన్లు పెట్టింది.
కార్మిక చట్టాలకు సవరించిన ప్రతిపాదనలను ఉపసంహరించుకోవడం, ప్రభుత్వరంగ సంస్థల అమ్మకాలు వెంటనే నిలిపేయాలనేవి కార్మిక, ఉద్యోగ సంఘాల భారత్ బంద్ ప్రధాన ఉద్దేశం. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు పెంపు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, ఈపీఎఫ్ పై వడ్డీ కోత తదితర అంశాలు కూడా సంఘాల డిమాండ్లుగా ఉన్నాయి.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.