Bharat Bandh: నేడు భారత్ బంద్‌.. వ్యవసాయ బిల్లులపై రైతుల ఆగ్రహం

‘సెప్టెంబర్ 25న రైతుల కర్ఫ్యూ పాటిస్తాం. ఎక్కడికక్కడ బ్లాక్ చేస్తాం. చట్టంలో కనీస మద్దతు ధర పెట్టే వరకు మా ఆందోళనలు కొనసాగుతాయి.’ అని భారతీయ కిసాన్ యూనియన్ ప్రకటించింది.

news18-telugu
Updated: September 25, 2020, 7:37 AM IST
Bharat Bandh: నేడు భారత్ బంద్‌.. వ్యవసాయ బిల్లులపై రైతుల ఆగ్రహం
రైతుల ధర్నా (Image:@ians_india/Twitter)
  • Share this:
నేడు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా రైతు సంఘాలు, యూనియన్లు దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చాయి. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే, కేంద్రం మాత్రం ముందుకే వెళ్లింది. బిల్లును పార్లమెంట్‌లో పాస్ చేసింది. ఈ క్రమంలో కేంద్రం తీరుకు నిరసనగా దేశంలోని సుమారు 25కి పైగా రైతు సంఘాలు భారత్ బంద్ నిర్వహించాలని పిలుపునిచ్చాయి. ఇప్పటికే పంజాబ్, హర్యానాలోని 31 రైతు సంఘాలు పార్టీలకు అతీతంగా భారీ ఎత్తున నిరసనలు తెలుపుతున్నాయి.

ఆల్ ఇండియా ఫార్మర్స్ యూనియన్, భారతీయ కిసాన్ యూనియన్, ఆల్ ఇండియా కిసాన్ మహాసంఘ్, ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ సంయుక్తంగా ఇవాళ భారత్ బంద్‌ నిర్వహించాలని పిలుపునిచ్చాయి. అంతేకాదు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలోని రైతు సంఘాలు కూడా బంద్‌కు మద్దతు పలికాయి. ఈనెల 25న షట్ డౌన్ చేయాలని సూచించాయి. వీరికి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, నేషనల్ డ్రేడ్స్ యూనియన్ కాంగ్రెస్, సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్, హింద్ మజ్దూర్ సభ, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ సెంటర్, ట్రేడ్ యూనియన్ కోఆర్డినేషన్ సెంటర్ కూడా రైతుల భారత్ బంద్‌కు మద్దతు పలికాయి.

ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్, ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన వీఎం సింగ్ మాట్లాడుతూ వ్యవసాయాన్ని మల్టీ నేషనల్స్, కార్పొరేట్ల చేతికి అప్పగిస్తే, రైతుల ఉత్పత్తులకు కనీస మద్దతు ధర హామీ ఇవ్వకపోతే పేదల ఆహార భద్రత ప్రమాదంలో పడుతుందని, దేశవ్యాప్తంగా అనిశ్చితి తలెత్తుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఈ బిల్లులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలపకూడదని విజ్ఞప్తి చేశారు.

మరోవైపు 18 రాజకీయ పార్టీలు బుధవారం నాడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను కలసి వ్యవసాయ బిల్లుల మీద తమ అభ్యంతరాలను వివరిచాయి. ఆ బిల్లులకు ఆమోదం తెలపొద్దని విజ్ఞప్తి చేశాయి. ఆ బిల్లులను మరోసారి పార్లమెంట్ పరిశీలన నిమిత్తం రాష్ట్రపతి తిరిగి వెనక్కి పంపాలని కోరాయి. ఇక జైకిసాన్ ఆందోళన్ అవిక్ సాహా మాట్లాడుతూ ‘ మేం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వంతో చర్చించాలనుకుంటున్నాం. ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత దాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీకి మేం కొన్ని వందల లేఖలు రాశాం. అయినా పట్టించుకోలేదు. కనీసం పార్లమెంట్‌లో కూడా ఈ ప్రభుత్వం మా డిమాండ్లను పెడచెవిన పెట్టింది.

‘సెప్టెంబర్ 25న రైతుల కర్ఫ్యూ పాటిస్తాం. ఎక్కడికక్కడ బ్లాక్ చేస్తాం. చట్టంలో కనీస మద్దతు ధర పెట్టే వరకు మా ఆందోళనలు కొనసాగుతాయి.’ అని భారతీయ కిసాన్ యూనియన్ ప్రకటించింది. సభ్యులు భారీ ఎత్తున ఈ భారత్ బంద్‌లో పాల్గొనాలని బీకేయూ నాయకుడు రాకేష్ టికాయత్ పిలుపునిచ్చారు.

ఈ బిల్లులతో వ్యవసాయ రంగంలో భారీ సంస్కరణలు చేపట్టినట్లవుతుందని బీజేపీ చెబుతుండగా విపక్షాలు సహా ఆ పార్టీ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ కూడా ఆ వాదనను వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లుల వల్ల చిన్న, సన్నకారు రైతులు చితికిపోతారని పార్టీలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్, తృణ‌మూల్ కాంగ్రెస్, డీఎంకె, బీఎస్పీ స‌హా కొన్ని పార్టీలు ఈ బిల్లులను వ్యతిరేకించాయి.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 25, 2020, 7:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading