Bhabanipur By-election: పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల ఫలితాలు అక్టోబరు 3న వెల్లడిస్తారు. భవానీపూర్‌లో మమతా బెనర్జీ గెలిస్తేనే సీఎం పదవిలో కొనసాగుతారు. ఓడిపోతే మాత్రం రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉపఎన్నికలపై పశ్చిమ బెంగాల్‌తో పాటు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
పశ్చిమ బెంగాల్ (West Bengal)తో పాటు దేశవ్యాప్తంగా పలు అసెంబ్లీ స్థానాలకు నేడు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. కానీ అందరి దృష్టి భవానీపూర్ (Bhabanipur) నియోజకవర్గంపైనే ఉంది. ఎందుకంటే అక్కడి నుంచి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) పోటీ చేస్తున్నారు. ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓడిపోయారు. ఐనప్పటికీ సీఎం బాధ్యతలు చేపట్టారు. ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా ఎన్నికవకుంటే సీఎం పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే భవానీపూర్ నియోజకవర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు మమత. పశ్చిమ బెంగాల్లో భవానీపూర్‌తో పాటు ముర్షీదాబాద్ జిల్లాలోని జంగీపూర్ (Jangipur), సంషేర్ గంజ్ (Samserganj) స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటలు పోలింగ్ ప్రారంభమయింది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది.
భవానీపూర్‌లో సీఎం మమతా బెనర్జీపై బీజేపీ నుంచి ప్రియాంక టిబ్రేవాల్ (Priyanka Tibrewal), సీపీఎం నుంచి శ్రీజిబ్ బిశ్వాస్ (Srijib Bishwas) పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం లేదు. భవానీపూర్‌లో 2 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీ గతంలో రెండు సార్లు (2011, 2016) గెలిచారు. మూడోసారి కూడా గెలుస్తానని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి సోవన్ దేబ్ ఛటర్జీ విజయం సాధించారు. కానీ నందిగ్రామ్‌లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతితో మమతా బెనర్జీ ఓడిపోవడంతో.. ఆమె ఉపఎన్నికల్లో పోటీచేసేందుకు వీలుగా ఆయన రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు.
ఉపఎన్నికల నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల సంఘం గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత చెలరేగిన హింసను దృష్టిలో ఉంచుకొని ఈసారి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 20 కంపెనీల పారా మిలటరీ బలగాలు భద్రతా విధులు నిర్వర్తిస్తున్నాయి. ఐతే టీఎంసీ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ.. పోలింగ్ బూత్‌లను తమ ఆధీనంలోకి తీసుకుందని బీజేపీ అభ్యర్థి ప్రియాంక ఆరోపిస్తున్నారు. తృణమూల్ శ్రేణులు పెద్ద ఎత్తున రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని ఆమె విమర్శించారు.
Madan Mitra (TMC MLA) has purposely shut the voting machine here as he wants to capture the booth: Priyanka Tibrewal, BJP candidate for Bhabanipur by-poll at polling booth of ward number 72 pic.twitter.com/lFB5hQytTY
కాగా, ఏప్రిల్‌లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 294 అసెంబ్లీ సీట్లుండగా.. తృణమూల కాంగ్రెస్ పార్టీ 214 సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ 76 స్థానాలకే పరిమితమయింది. ఇతర పార్టీలు పెద్దగా ప్రభావం చూపలేదు. ఇక పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల ఫలితాలు అక్టోబరు 3న వెల్లడిస్తారు. భవానీపూర్‌లో మమతా బెనర్జీ గెలిస్తేనే సీఎం పదవిలో కొనసాగుతారు. ఓడిపోతే మాత్రం రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉపఎన్నికలపై పశ్చిమ బెంగాల్‌తో పాటు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.