Indian Railways: గత కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ రైల్వేస్(Indian railways) విభాగం వేగంగా అభివృద్ది చెందింది. అత్యాధునిక రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రయాణికులకు మెరుగైన భద్రత లభిస్తోంది. రైల్వే ప్రాజెక్టులు(Railway projects) కూడా వేగంగా పూర్తవుతున్నాయి. కొత్తగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి, రైల్వే మంత్రిత్వ శాఖ(Railway ministry) 7,000 కి.మీ, అంటే రోజుకు దాదాపు 20 కి.మీ దూరం కొత్త రైల్వే ట్రాక్‌లను వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో 4,500 కిలోమీటర్ల దూరం, అంటే రోజుకు దాదాపు 12 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్‌లు వేయాలనే లక్ష్యాన్ని సాధించినట్లు గత నెలలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇది 2014 లేదా 2015లో సాధించిన దానికంటే మూడు రెట్లు ఎక్కువ. అయితే భారతీయ రైల్వే ఈ భారీ లక్ష్యాన్ని అందుకోవడంలో సహాయపడిన కీలక సంస్కరణలను ఒక సీనియర్ అధికారి న్యూస్18కి వివరించారు. ఆ విషయాలు..
* ప్రాజెక్ట్‌లకు సకాలంలో చెల్లింపులు
ప్రాజెక్ట్‌లు ఆలస్యం కావడానికి ప్రధాన కారణాలుగా చెల్లింపులు ఆలస్యమవడంగా చెప్పవచ్చు. ఇప్పటివరకు నిబంధనల ప్రకారం, ఒక ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఏవైనా బిల్లుల చెల్లింపులను 50 రోజులలోపు మంజూరు చేయకూడదు. కానీ ఇప్పుడు, అన్ని కొత్త టెండర్లలో బిల్లును సమర్పించిన 30 రోజులలో చెల్లింపులు చేయాలని నిబంధన తీసుకొచ్చారు. అలా జరగకపోతే అప్పటి బ్యాంక్ రేటుకు సమానమైన వడ్డీని, 3% అదనంగా చెల్లించాలి. అంటే ప్రస్తుతం, బిల్లు చెల్లింపు ఆలస్యం అయితే 9% వడ్డీ చెల్లించాలి. దీంతో పేమెంట్‌లు 30 రోజుల్లోగా పూర్తవుతాయి.
* EPC మోడ్‌లో ఒప్పందం
EPC అంటే ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్. ఇందులో కాంట్రాక్టర్ అన్ని అంశాలను నిర్ణయించుకోవాలి, కానీ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి పొందాలి. ఇంతకుముందు, రైల్వే అధికారులే కాంట్రాక్టర్‌లకు సిమెంట్ వంటి సామగ్రిని అందజేసేవారు. ఆ సిమెంట్ పొందడానికి, మరొక టెండర్, కాంట్రాక్ట్ జారీ చేయాల్సి ఉండేది. ఈ పనులన్నింటికీ సమయం పట్టేది. కొన్న సామగ్రిని భద్రపరచుకోవడం అదనపు బాధ్యత. ఇప్పుడు ఈ సమస్యలు లేవు. స్టాండర్డ్ EPC బిడ్ డాక్యుమెంట్ కూడా పనులను వేగవంతం చేసింది. ఇంతకుముందు, ప్రతి ప్రాజెక్ట్ కోసం బిడ్ డాక్యుమెంట్‌ను రూపొందించాలి, దీనికి చాలా సమయం పట్టేది.
UPI: రూ.2,000 కంటే ఎక్కువ UPI పేమెంట్స్‌పై ఛార్జీలు..కొత్త రూల్ లో బిగ్ ట్విస్ట్ ఇదే!
* గతి శక్తి డైరెక్టరేట్, గతి శక్తి యూనిట్లు
మంత్రిత్వ శాఖ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడిన మొదటి రెండు సంస్కరణలు గతి శక్తి డైరెక్టరేట్, గతి శక్తి యూనిట్ల ఏర్పాటు. రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే బోర్డులో మల్టీ డిసిప్లినరీ గతి శక్తి డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో వివిధ శాఖల సభ్యులు ఉంటారు, ఇది నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. గతంలో ఫైళ్లు వివిధ శాఖలకు వెళ్లేవి, ఇప్పుడు ఆ అవసరం లేకుండా గతి శక్తి డైరెక్టరేట్‌కు వెళ్తాయి. డైరెక్టరేట్‌లో వెరీ సీనియర్ అధికారులు ఉండరు. కానీ వివిధ శాఖలకు చెందిన హయ్యర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ (HAG) లెవల్ అధికారులు ఉంటారు. ఈ అధికారులు డైరెక్టరేట్ కోసం వారి విభాగాలకు ఇన్‌ఛార్జ్‌గా ఉంటారు. ప్రాజెక్ట్‌కు అవసరమైన అన్ని ఆమోదాలను పొందుతారు.
మంత్రిత్వ శాఖ మొత్తం 68 డివిజన్లలో గతి శక్తి యూనిట్లను ఏర్పాటు చేసింది. ఇవి స్టేషన్ రీడెవలప్‌మెంట్, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్, ఆల్ సైడింగ్ వర్క్స్, డిపాజిట్ వర్క్, ఎస్కలేటర్, లిఫ్ట్‌ల ఏర్పాటు పనులకు బాధ్యత వహిస్తాయి. అంతే కాకుండా రోడ్ సేఫ్టీ అండ్ లెవెల్ క్రాసింగ్, రోడ్ అండర్ బ్రిడ్జ్ (RUB), రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (ROB), ప్రయాణీకుల సౌకర్యాలు, ట్రాఫిక్ సౌకర్యాలు, ఇతర పనుల ప్రణాళిక, అమలును పర్యవేక్షిస్తాయి.
ఈ యూనిట్లతో, DRMకి ఎక్కువ పరిపాలనా అధికారాలు ఉన్నాయి. బోర్డ్ ఆమోదం పొందాల్సిన ప్రణాళికలను మంజూరు చేయవచ్చు. అవసరమైతే రైళ్లను రద్దు చేయవచ్చు, దారి మళ్లించవచ్చు. ఇంతకుముందు ఈ అన్ని పనులకు బోర్డు అనుమతి అవసరం. ఇది చాలా పెద్ద స్థాయిలో పనులను వేగవంతం చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Railway, Indian Railways