కౌన్ బనేగా కర్నాటక సీఎం అన్నదానిపై ఉత్కంఠ పెరుగుతోంది. ఇప్పటికే కొన్ని పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది. మొత్తానికి గత కొంతకాలంగా కొనసాగుతున్న సస్సెన్స్‌కు 78 ఏళ్ల బి.ఎస్.యడియూరప్ప తెరదించారు. కర్ణాటక సీఎం పదవికి సోమవారం రాజీనామా చేశారు. సీఎంగా సరిగ్గా రెండేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న రోజే తన రాజీనామాను బెంగళూరులోని రాజ్‌భవన్‌లో గవర్నర్ గెహ్లాత్‌కు అందజేశారు. స్వచ్ఛందంగానే పదవి నుంచి దిగిపోతున్నానని పేర్కొన్నారు. యడియురప్ప రాజీనామాతో కర్ణాటక తదుపరి సీఎం ఎవరన్న దానిపై ఉత్కంఠ మొదలయ్యింది. కానీ బీజేపీ అధిష్టానం ఇప్పటికే కొత్త సీఎంగా ఎవరిని నియమించాలి అన్నదానిపై కసర్తుత ప్రారంభించింది. మరోవైపు యడియూరప్ప రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్లు గవర్నర్ కార్యాలయం పేర్కొంది. యడియూరప్ప మంత్రివర్గాన్ని గవర్నర్ రద్దు చేశారని, ఇది వెంటనే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేదాకా ముఖ్యమంత్రిగా యడియూరప్ప కొనసాగుతారని పేర్కొంది. గవర్నర్‌కు రాజీనామాను సమర్పించిన తరువాత మాట్లాడిన ఆయన తాను సీఎం పదవి నుంచి తప్పుకోవాలని రెండు నెలల క్రితమే నిర్ణయించుకున్నానని చెప్పారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సేవ చేసే అవకాశం కల్పించిన ప్రజలకు, నాయకులకు, సహకరించిన అధికారులకు యడియూరప్ప కృతజ్ఞతలు తెలియజేశారు. రాజీనామా విషయంలో బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి తనపై ఎలాంటి ఒత్తిడి రాలేదని, స్వచ్ఛందంగానే తప్పుకున్నానని, సీఎంగా ప్రజలకు సేవ చేసేందుకు ఇతరులకు మార్గం సుగమం చేయాలన్నదే తన ఉద్దేశమని వివరించారు. ఎవరిని సీఎంగా ఎంపిక చేసినా పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు.
2023లో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను దృష్టి పెట్టుకుని బీజేపీ హైకమాండ్ కొత్త సీఎంని ఎంపిక చేస్తారనే చర్చ జరుగుతోంది. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి కోసం బీజేపీ నాయకత్వం 8 మంది నేతల పేర్లను పరిశీలిస్తోందని తెలుస్తోంది. యడియూరప్ప కర్ణాటకలోని బలమైన లింగాయత్ సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో.. అదే వర్గానికి చెందిన ధర్వాడ్ పశ్చిమ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్, విజయపుర ఎమ్మెల్యే బసన్నగౌడ పాటిల్ యత్నల్, కర్ణాటక మంత్రులు మురుగేశ్ నిరానీ, బసవరాజు బొమ్మాయ్ పేర్లను పరిశీలిస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
వీరిలో యత్నల్‌కు ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ ఉండటం కలిసొచ్చే అంశమని భావిస్తున్నారు. మరోవైపు సీఎంగా ఎవరు ఉండాలని యడియూరప్పను అడిగితే ఆయన బసవరాజ్ బొమ్మాయ్ పేరును చెబుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు ప్రహ్లాద్ జోషి, బీఎల్ సంతోష్, సీఎన్ అశ్వనాథ్ నారాయణ్, లక్ష్మణ్ సవడి, గోవింద్ కర్జోల్, విశ్వేశ్వర హెగ్డే కగేరి, సీటీ రవి పేర్లను కూడా పరిశీలిస్తున్నారని సమాచారం. బీజేపీ జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా తాము గౌరవిస్తామని నిరానీ తెలిపారు.
కర్నాటక సీఎంపై త్వరగా నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది అదిష్టానం. 2023లో జరగబోయే శానసభ ఎన్నికల్లో బీజేపీని మళ్లీ గెలుపు తీరానికి చేర్చే నాయకుడు ఎవరన్న చర్చ మొదలయ్యింది. కొత్త ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతను పార్టీ పార్లమెంటరీ బోర్డుకు, పార్టీ శాసనసభా పక్షానికి కట్టబెట్టినట్లు బీజేపీ నేషనల్ జనరల్ సెక్రెటరీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి అరుణ్ సింగ్ వెల్లడించారు. శాసనసభా పక్షం భేటీ ఎప్పుడు జరుగుతుందో ఇప్పుడే చెప్పలేనని అన్నారు. యడియూరప్ప రాజీనామాకు గల కారణాలను ఆయనే వివరిస్తారని స్పష్టం చేశారు. కొత్త సీఎం ఎంపిక కోసం నిర్వహించే బీజేపీ శాసనసభా పక్ష సమావేశానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర పరిశీలకుడిగా వ్యవహరించనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karnataka, Karnataka bjp, Karnataka Politics