భారత్‌లో కరోనా వైరస్ విచ్చలవిడిగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య వేలకు వేలు పెరగుతుండటంతో రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూలు (Weekend curfew)అమలు చేస్తున్నాయి. అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రావడానికి వీల్లేదని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాయి. ప్రస్తుతం అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది కర్నాటక(Karnataka). ఇక్కడ గడిచిన 24గంటల్లో వైరస్ వేరియంట్ కేసులు (Virus variant cases)గణనీయంగా పెరగడంతో వీకెండ్ కర్ఫ్యూని అమలు చేస్తోంది ప్రభుత్వం. శుక్రవారం (Friday) నుంచి జనవరి (January)19వ తేది వరకూ ఈ వీకెండ్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రకటించింది. శుక్రవారం రాత్రి 10గంటల నుంచి సోమవారం తెల్లవారు జామున 5గంటల మధ్యలో ఎలాంటి వాహనాలు రోడ్లపైకి రావడానికి అనుమతి లేదని హెచ్చరించింది. అత్యవసర సర్వీసుల(Essential services)ను మాత్రమే కొనసాగిస్తామని తెలిపింది. అలాంటి వాహనాలు సైతం అందుకు తగిన ప్రయాణ పత్రాలను చూపిస్తేనే అనుమతిస్తామని స్పష్టం చేసింది. అలాంటి పత్రాలు ఉన్న బస్సులు(Buses), ఆటోలు(Auto), ట్యాక్సీ(Taxi)లకు అనుమతిచ్చి మిగిలిన వాహనాలను చెక్‌పోస్టు(Check post)ల వద్ద నిలిపివేసింది. కర్నాటక ప్రభుత్వం తీసుకున్న ఈ వారాంతపు కర్ఫ్యూతో బెంగుళూరు వంటి మహానగరాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కర్నాటకలో వీకెండ్ కర్ఫ్యూ..
శుక్రవారం రాత్రి నుంచి పలు ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు లేకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్సులు, ఆటోలు, కార్లు వంటి ప్రైవేటు వాహనాలు సైతం తిరగకపోవడంతో చాలా మంది చాలా చోట్ల చిక్కుకుపోయారు. ఇలాగైతే గమ్యస్థానాలకు చేరేది ఎలా అంటూ చెక్‌పోస్ట్‌లు, నగరంలోని రోడ్లపై ఆందోళనకు దిగడంతో అధికారులు వారిపై చర్యలు తీసుకున్నారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ అనేక వాహనాల్ని సీజ్ చేశారు కర్నాటక పోలీసులు.
లాక్డౌన్ దిశగా రాష్ట్రాలు..
కర్నాటకలో గడిచిన 24గంటల్లో కొత్తగా 8906 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో మహమ్మారి బారినపడి ఒక్కరోజులో నలుగురు మృతి చెందారు. ఇందులో బెంగుళూరు మాత్రమే వైరస్ వ్యాప్తి అధికంగా జరుగుతున్న ప్రాంతంగా గుర్తించారు. ఒక్క బెంగుళూరులోనే 7113 కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మృత్యువాతపడ్డట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అటు దేశరాజధాని ఢిల్లీలో సైతం కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఒక్కరోజులో ఇక్కడ 20181 పాజిటివ్ కేసులు నమోదైనట్లుగా ఆరాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ స్పష్టం చేశారు. గత మే నెల నుంచి ఇక్కడ ఈ స్థాయిలో కేసులు పెరగడం ఇదే మొదటిసారి అని మంత్రి చెప్పారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఢిల్లీలో కూడా వీకెండ్ కర్ఫ్యూ అమలు చేయాల్సిన పరిస్థితి తప్పదని చెప్పకనే చెబుతున్నారు. ముంబైలో కూడా 24గంటల్లో 20318 పాజిటివ్ కేసులు నమోదైనట్లుగా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.
Tags: Corona alert, Karnataka, Night curfew