బెంగళూరులో(Bangalore) మొన్న వాలెంటైన్స్ డే రోజు జరిగిన ఓ పెళ్లి, వధూవరుల గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ పెళ్లికి(Marriage) ఒక ప్రత్యేకత ఉంది. తాజాగా ఒక్కటైన వధూవరులిద్దరూ కిడ్నీ గ్రహీతలు. ప్రాణాంతకమైన కిడ్నీ వ్యాధులతో పోరాడి చివరికి కిడ్నీ మార్పిడి ద్వారా తిరిగి సాధారణ జీవితాలను గడుపుతున్నారు. వీరిద్దరూ వాలెంటైన్స్ డే (Valentin's day) రోజున ఒకటయ్యారు. వరుడు అవినాష్ షెకర్ (30) తన కుటుంబంలోని దాతల సహాయంతో రెండుసార్లు కిడ్నీ మార్పిడి చేయించుకోగా, వధువు పవిత్రావాని(30) కూడా ఆర్గాన్ డొనేషన్ ద్వారా కిడ్నీ పొందారు. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిన ఇద్దరూ ఓ కొత్త జీవితాన్ని మొదలుపెట్టడం ఇప్పుడు ఎంతో మందికి ఇనిస్పిరేషన్ గా నిలుస్తోంది.
అవయవ మార్పిడి జరిగిన వారు ఇలా పెళ్లి చేసుకోవడం కొత్తేమీ కాదని, అలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయని వీరికి సర్జరీ చేసిన డాక్టర్ సంకరన్ సుందర్ అన్నారు. కానీ ఇద్దరు కిడ్నీ గ్రహీతలు ఇలా ఒకటవ్వడం చూడడానికి ఎంతో ప్రత్యేకంగా, ఆనందంగా ఉందన్నారు. ఆరోగ్యంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ అవినాష్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. పవిత్రా ఎంబీఏ(MBA) పూర్తి చేసింది. అవినాష్, పవిత్రలు ముందునుంచే ఫ్రెండ్స్. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటి నుంచి వారిద్దరికీ పరిచయం ఏర్పడింది. తర్వాత వారు ఒకే టెక్ పార్కులో పనిచేయడం మొదలుపెట్టినప్పటి నుంచి వారి మధ్య ప్రేమ చిగురించింది.
పెళ్లి సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ.. తన భావోద్వేగాలను వివరించడానికి పదాలు లేవని తెలిపారు. "మేము తిరిగి పొందిన జీవితాలను గౌరవిస్తున్నాం. మేము ఈ కొత్తజీవితాన్ని బహుమతిగా పరిగణించాలి. అవయవ దానం గురించి చాలామందిలో పెద్దగా అవగాహన లేదు. డొనేషన్ విషయంలో చాలామందికి భయాలు ఉన్నాయి. అలాంటి భయాలు వదిలి అవయవదానానికి అందరూ సహకరిస్తే.. ఎన్నో కొత్త జీవితాలకు ప్రాణం పోసిన వారవుతారు’’ అని అవినాష్ చెప్పారు.
అవినాష్ కుటుంబంలో కూడా కిడ్నీ గ్రహీతలు, కిడ్నీ దాతలు ఉన్నారు. అతని తల్లిదండ్రులు ఇద్దరూ కిడ్నీ దాతలు. అవినాష్ తండ్రి శేఖర్ 32 సంవత్సరాల క్రితం తన బావ చందర్ కు కిడ్నీని దానం చేశాడు. 2015 లో అవినాషన్ కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు అతని అత్త తన కిడ్నీని దానంగా ఇచ్చింది. దాంతో అవినాష్ కు జీవితంలో రెండో అవకాశం లభించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bangolure, Trending, Trending news