ఇండియాలోని మెట్రో నగరాల ఊసెత్తితే అందరికీ గుర్తు వచ్చేది ట్రాఫిక్. ఈ జాబితాలో ఉద్యాన నగరం బెంగళూరు కూడా ఉంది. రద్దీ వేళల్లో బెంగళూరు ట్రాఫిక్‌లో చిక్కుకుంటే అంతే సంగతులు. సమయానికి చేరుకోవాలంటే కొన్ని గంటల ముందుగానే బయలుదేరడం ఒక్కటే మార్గం. ఇంతటి ఘనత ఉన్న బెంగళూరు ట్రాఫిక్‌లో ఇటీవల ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వాహనాలను ఎటూ కదలనీయని ట్రాఫిక్, ఓ నూతన వరుడు భార్యను వదిలి పారిపోవడానికి మార్గం చూపింది. అతని కోసం వెంటపడే ప్రయత్నం చేసిన భార్యకు ట్రాఫిక్ సహకరించలేదు. అసలు ఏం జరిగిందని ఆలోచిస్తున్నారా? అయితే ఈ పూర్తి వివరాలను చదివేయండి.
* పెళ్లైన మరుసటి రోజే పరారీ
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. ఈ సంఘటన బెంగళూరులోని మహదేవ్‌పురా టెక్ కారిడార్‌లో ఫిబ్రవరి 16న చోటు చేసుకుంది. పారిపోయిన వరుడు జార్జ్‌కి(పేరు మార్చాం) పెళ్లికి ముందు, గోవాలో పని చేస్తున్నప్పుడు ఓ అక్రమ సంబంధం ఉండేది. ఈ విషయం పెళ్లి చేసుకోబోతున్న యువతికి తెలిసింది. ఏదో రకంగా ఈ జంట ఫిబ్రవరి 15న పెళ్లి పీటలు ఎక్కింది. అయితే పెళ్లి జరిగిన మరుసటి రోజే జార్జ్ పారిపోయాడు.
నూతన జంట తమ పెళ్లి తర్వాత రోజు చర్చికి వెళ్లి తిరిగి వస్తుండగా కారు ట్రాఫిక్‌లో చిక్కుకుంది. ఈ సమయాన్ని అవకాశంగా తీసుకున్న జార్జ్.. కార్ డోర్ తీసి పారిపోయాడు. భార్య అతన్ని వెంబడించడానికి ప్రయత్నించింది, కానీ ట్రాఫిక్ రద్దీలో ఆమెకు సాధ్యం కాలేదు.
ఈ విషయంపై వధువు మార్చి 5న పోలీసులకు ఫిర్యాదు అందింది. జార్జ్ పెళ్లి గురించి, అతనితో అక్రమ సంబంధం ఉన్న యువతికి తెలిసింది. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని ఆమె జార్జ్‌ని బెదిరించింది. దీంతో భయపడిన జార్జ్ పారిపోయాడని, రెండు వారాలు గడుస్తున్నా అతని ఆచూకీ తెలియడం లేదని పోలీసులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి : మొదటి రాత్రికి ముందే ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోండి..లేకుంటే..
* హామీ ఇస్తేనే అంగీకరించా
22 ఏళ్ల వధువు మాట్లాడుతూ.. ‘జార్జ్‌ది చిక్కబళ్లాపూర్ జిల్లా చింతామణి గ్రామం. అతను మా నాన్నకు కర్ణాటక , గోవాలో కంపెనీ నిర్వహించడంలో సహకరించాడు. గోవాలో కంపెనీ పనులు చూస్తున్నప్పుడు అతడు ఓ యువతితో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు. ఈ విషయం నాకు తెలిసింది. ఆ రిలేషన్ ముగించుకుంటానని జార్జ్ హామీ ఇవ్వడంతోనే పెళ్లికి నేను అంగీకరించాను. కానీ అతను మారలేదు. తనతో సంబంధం ఉన్న అమ్మాయి బ్లాక్ మెయిల్ చేయడంతో జార్జ్ భయపడ్డాడు. ఆ తర్వాత పారిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ధోరణి కూడా కనిపించింది. అతను క్షేమంగా ఉన్నాడని, త్వరలో తిరిగి వస్తాడని ఆశిస్తున్నాను.’ అని చెప్పింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bengaluru, Marriage, National News, Trending news, VIRAL NEWS