‘సార్ డబ్బుల్లేవ్’ అనే చాన్స్ లేదు... అక్కడ ట్రాఫిక్ పోలీసుల కొత్త ఐడియా..

ప్రతీకాత్మక చిత్రం

బెంగళూరులో ఎప్పటికప్పుడూ ట్రాఫిక్‌ పెరిగిపోతోంది. దీంతో ట్రాఫిక్ నిర్వహణ కోసం పోలీసులు కఠిన నియమ, నిబంధనలు విధిస్తున్నారు.

  • Share this:
ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్‌ఫాం పేటీఎంను వివిధ రకాల అవసరాల కోసం వినియోగిస్తుంటారు. తాజాగా ఈ సంస్థ ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలకు విధించే జరిమానా సైతం చెల్లించవచ్చని ప్రకటించారు బెంగళూరు పోలీసులు. ఈ మేరకు సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించారు. ట్రాఫిక్ జరిమానాల విషయంలో అపోహలను తొలగించడానికి, లావాదేవీల్లో పారదర్శకతను పెంచడానికి, క్యాష్‌లెస్ పేమెంట్లను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇప్పుడు పేటీఎం ఇ-వాలెట్ ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనులు జరిమానా చెల్లించవచ్చని ప్రకటించారు. ఈ కొత్త సదుపాయాన్ని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ కమల్ పంత్  కొత్తగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా బెంగళూరు జాయింట్ పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) బి.ఆర్. రవికాంతే గౌడ విలేకరులతో మాట్లాడారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారికి జరిమానా విషయంలో ఇబ్బంది లేకుండా, వేగంగా చెల్లింపులు చేసేందుకు ఈ ఆప్షన్ ఉపయోగపడుతుందని తెలిపారు. ‘వివిధ బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ట్రాఫిక్ చలానాలు చెల్లించే సదుపాయాన్ని 2017లో ప్రారంభించాం. అయితే ఇందుకు బ్యాంకులు వినియోగదారుల నుంచి ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. అందువల్ల మరొక ప్రత్యామ్నాయంగా పేటీఎంతో ఒప్పందం చేసుకున్నాం’ అని వివరించారు.

బెంగళూరులో ఎప్పటికప్పుడూ ట్రాఫిక్‌ పెరిగిపోతోంది. దీంతో ట్రాఫిక్ నిర్వహణ కోసం పోలీసులు కఠిన నియమ, నిబంధనలు విధిస్తున్నారు. వీటిని ఉల్లంఘించిన వారు బెంగళూరు-వన్, నగర ట్రాఫిక్ పోలీసు విభాగానికి చెందిన అధికారిక బీటీపీ వెబ్‌సైట్, పీడీఏ యంత్రాల ద్వారా జరిమానా చెల్లించే అవకాశాలు ఉన్నాయి. అయితే పేటీఎం ఆప్షన్ ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో వాడుకలో ఉన్నందున, బెంగళూరులో సైతం ఈ సేవలను ప్రవేశపెట్టాలని బీటీపీ నిర్ణయించింది. ఈ సేవలను పేటీఎం ఉచితంగా అందించనుంది. దీనికి సంబంధించిన టెక్నాలజీ అప్‌గ్రేడ్‌ కోసం నగరానికి చెందిన ఐటీ సంస్థ టెలీ బ్రహ్మ సర్వీసెస్ సేవలను వినియోగించుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Published by:Ashok Kumar Bonepalli
First published: