karnataka CM Change: సస్పెన్స్‌కు నేడే తెర.. సీఎం యడియూరప్ప మార్పుపై అధికారిక నిర్ణయం

yediyurappa

మరి కొన్ని గంటల్లో కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణమాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సీఎం యడియూరప్ప సీఎంగా కొనసాగుతారా..? తప్పుకుంటారా అన్నదానిపై క్లారిటీ రానుంది..

  • Share this:
    కర్ణాటక సీఎంగా యడియూరప్ప కొనసాగుతారా..? లేక పదవి నుంచి దిగిపోతారా.. గత కొన్ని రోజులుగా ఈ వ్యవహారం కర్నాటక రాజకీయాల్లో తీవ్ర ఉత్కంట పెంచుతోంది. అయితే ఆ ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. 78 ఏళ్ల సీఎం యడియూరప్పను పదవిలో కొనసాగిస్తారా? లేదా అనేదిపై నేడు క్లారిటీ వచ్చేస్తుంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. పదవి ఉన్నా లేకున్నా మరో 10–15 ఏళ్ల పాటు బీజేపీ కోసం రాత్రింబవళ్లూ కష్టపడి పని చేస్తానని, ఈ విషయంలో సందేహాలు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. యడియూరప్ప ఆదివారం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి మార్పుపై బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి తనకు ఇంకా ఎలాంటి సందేశం రాలేదని తెలిపారు. అర్థరాత్రిలోపు లేదా సోమవారం ఉదయంలోగా సందేశం అందుతుందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. అంటే మరికొన్ని గంటల్లోనే దీనిపై క్లారిటీ రానుంది. రెండు నెలల క్రితమే సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యానని ఆయన గుర్తుచేశారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే నడుచుకుంటానని, పదవి నుంచి దిగిపోవాలని ఆదేశిస్తే దిగిపోతా, కొనసాగాలని సూచిస్తే కొనసాగుతా అని పునరుద్ఘాటించారు. సోమవారం ఉదయం 11 గంటలకు జరిగే కార్యక్రమంలో రెండేళ్లలో తమ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి మాట్లాడుతానని, ఆ తరువాత జరిగే పరిణామాలు అందరికీ తెలుస్తాయి అన్నారు. అంటే ఆయనే దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

    ఒకవేళ బీజేపీ నాయకత్వం నుంచి సందేశం రాకపోతే ఏం చేస్తారని ప్రశ్నించగా.. అప్పటి నిర్ణయం అప్పుడే తీసుకుంటానని బదులిచ్చారు. మరోవైపు తదుపరి సీఎం ఎవరనే విషయంలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి ఆదివారం ధార్వాడ్‌ నుంచి బెంగళూరుకు చేరుకోవడం, ఢిల్లీకి వెళ్లేందుకు బుక్‌ చేసుకున్న విమాన టికెట్‌ను రద్దు చేసుకోవడం గమనార్హం. అలాగే సీఎం పదవి రేసులో ఉన్న గనుల మంత్రి మురుగేష్‌ నిరానీ ఆదివారం ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్ర హోంమంత్రి బస్వరాజ్‌ బొమ్మయ్, అసెంబ్లీ స్పీకర్‌ విశ్వేశ్వర హెగ్డేల పేర్లు కూడా ప్రముఖంగా వినపడుతున్నాయి.

    అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పార్టీ గీసిన గీతను దాటే ప్రసక్తే లేదని, క్రమశిక్షణ మీరబోనని యడియూరప్ప చెప్పారు. తనకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. పార్టీలో తనకు ఎన్నో పెద్ద పదవులు దక్కాయి. కర్ణాటక బీజేపీలో ఈ స్థాయిలో పదవులు పొందినవారు ఎవరూ లేరు. నాకు అవకాశాలు కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కర్ణాటకలో 2023లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని అన్నారు.
    మరోవైపు బీజేపీ నాయకత్వం మిశ్రమ సంకేతాలను ఇచ్చింది. యడియూరప్పపై జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా ప్రశంసల వర్షం కురిపించారు. ఆదివారం గోవాలోని పనాజీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. యడియూరప్ప ముఖ్యమంత్రిగా చక్కగా బాధ్యతలు నిర్వర్తించారని చెప్పారు. కర్టాటక సర్కారు ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఉందని తాను భావించడం లేదన్నారు. ఆయన్ను తప్పిస్తారనే వార్తల నేపథ్యంలో.. పదవి నుంచి దిగిపోయేందుకు మానసికంగా సిద్ధమైన యడియూరప్పకు సొంత సామాజికవర్గం వీరశైవ లింగాయత్‌ల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. యడ్డిని సీఎంగా కొనసాగించాల్సిందేనని 500 మందికిపైగా వీరశైవ–లింగాయత్‌ మఠాధిపతులు డిమాండ్‌ చేశారు.
    Published by:Nagesh Paina
    First published: