బెంగళూరు (Bengaluru)లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు అక్కడి అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, పరిష్కారం మాత్రం దొరకలేదు. అయితే బెంగళూరు సబర్బన్ (Bengaluru Suburban) లేదా బెంగళూరు కమ్యూటర్ రైలుతో నగరంలో ట్రాఫిక్ ప్రాబ్లమ్‌కు చెక్ పడుతుందని అక్కడి ప్రజలు ఆశిస్తున్నారు. 40 ఏళ్లుగా నగర ప్రజలు ఎదురుచూస్తున్న సబర్బన్ రైలు ప్రాజెక్టు లేదా బెంగళూరు కమ్యూటర్ రైలు ప్రాజెక్టులో కదలిక వచ్చింది. తాజాగా రూ. 15,767 కోట్లతో ప్రాజెక్ట్‌లో మరో కారిడార్ కోసం రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కంపెనీ (కర్ణాటక) లిమిటెడ్ (KRIDE) టెండర్లను ఆహ్వానించింది. లోకోమోటివ్స్ సరఫరా చేసేందుకు కూడా బిడ్లు కూడా ప్రారంభమయ్యాయి.
ఈ ప్రాజెక్ట్ ప్లాన్ అమలులోనే ఆలస్యం కాగా పనులు కూడా చాలా నెమ్మదిగా పుంజుకుంటున్నాయి. నాలుగు కారిడార్‌లలో ఒకదానిలో ప్రాథమిక పనులు ఇటీవలే ప్రారంభమయ్యాయి. 148 కి.మీ ప్రాజెక్ట్‌లో భాగమైన హీలలిగె-రాజనకుంట మధ్య 46.8 కి.మీ పొడవున్న కనక లైన్ (కారిడార్-4) నిర్మాణం, సివిల్ పనులకు గత వారం టెండర్ ఆహ్వానించారు.
బిడ్‌ల సమర్పణకు చివరి తేదీ ఏప్రిల్ 27. 25 కిలోమీటర్ల పొడవు గల మల్లిగే లైన్ (బైప్పనహళ్లి-యశ్వంత్‌పూర్-చిక్కబాణవర) కోసం టెండర్‌ను లార్సెన్ & టూబ్రోకు అప్పగించారు. వర్క్ ఆర్డర్‌ను 2022 ఆగస్టులో జారీ చేశారు. అయితే భూమి లభ్యత ఈ కారిడార్‌కు ప్రధాన అడ్డంకిగా ఉంది. మొదటి దశ నిర్మాణానికి 157 ఎకరాల భూమిని రైల్వే ఇటీవలే అప్పగించింది.
* రోజూ 10 లక్షల మంది ప్రయాణం
బెంగళూరు సబర్బన్ రైలు కోచ్‌ల ఎంపికలో ఆధునికంగా ఆలోచిస్తోంది. మెట్రో తరహా కోచ్‌ల కోసం బిడ్‌ను ఆహ్వానించింది. రోజువారీగా 10 లక్షల మంది నగరంలో ప్రయాణించే అవకాశముంది కాబట్టి ఆ సామర్థ్యానికి తగ్గట్లు కోచ్‌లు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించింది.
* వేగవంతమైన రవాణా వ్యవస్థ
నగరంలోని ప్రాంతాలతోపాటు, సబర్బ్‌లు, శాటిలైట్ టౌన్‌షిప్‌లకు, చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలకు వేగవంతమైన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలని రైల్వే భావిస్తోంది. తక్కువ ధరలోనే ఆధునిక కోచ్‌లతో ప్రపంచ స్థాయి సబర్బన్ సిస్టమ్ అవుతుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. సబర్బన్ రైలు నాలుగు కారిడార్లలో 148.17 కిలోమీటర్లు, 57 స్టేషన్లను కలిగి ఉంటుంది.
ఇది కూడా చదవండి : ChatGPTను అలా వాడేస్తున్న స్టూడెండ్స్.. AI టూల్‌ను బ్యాన్ చేస్తున్న విద్యాసంస్థలు
* జాయింట్ ప్రాజెక్టు
ఈ ప్రాజెక్టును కర్ణాటక ప్రభుత్వం-కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. K-RIDE ఇచ్చిన సమాచారం ప్రకారం ఇది భారతదేశంలోనే అత్యంత సమగ్ర రైలు ప్రాజెక్ట్. అన్ని లైన్లకు సంబంధించిన పనులు ప్రారంభమైనట్లు అధికారులు చెబుతున్నప్పటికీ సంపిగే, పారిజాత లైన్‌ల టెండర్ ప్రక్రియలకు సంబంధించిన సమాచారాన్ని ఇంకా K-RIDE అధికారికంగా వెల్లడించలేదు. ప్రజలకు ఈ ప్రజారవాణా అందుబాటులోకి వస్తే ఐటి నగరంలో ట్రాఫిక్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గుతుంది. చాలా మంది ఇందులో ప్రయాణించే అవకాశముంది కాబట్టి రోడ్లపైకి వచ్చే వాహనాలు గణనీయంగా తగ్గుతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Auto, Bengaluru, National News