హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Breaking: కర్ణాటక సీఎం పదవికి జూలై 26న యడియూరప్ప రాజీనామా..? 25న వాళ్లందరికీ విందు అందుకేనా?

Breaking: కర్ణాటక సీఎం పదవికి జూలై 26న యడియూరప్ప రాజీనామా..? 25న వాళ్లందరికీ విందు అందుకేనా?

యడియూరప్ప

యడియూరప్ప

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప జూలై 26న రాజీనామా చేయబోతున్నారనే వార్తలొస్తున్నాయి. కర్ణాటకలో అధికార బీజేపీలో అనిశ్చితి ఏర్పడింది. నాయకత్వ మార్పుపై కన్నడ నాట జోరుగా చర్చ జరుగుతోంది. సీఎం బీఎస్ యడియూరప్ప నాయకత్వాన్ని సొంత పార్టీలోని కొందరే బేఖాతరు చేయడం లేదు. ముఖ్యమంత్రిగా యడియూరప్ప దిగిపోవాలన్న డిమాండ్ ఓ వర్గం నేతల నుంచి తీవ్రంగా వినిపిస్తోంది.

ఇంకా చదవండి ...

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప జూలై 26న రాజీనామా చేయబోతున్నారనే వార్తలొస్తున్నాయి. కర్ణాటకలో అధికార బీజేపీలో అనిశ్చితి ఏర్పడింది. నాయకత్వ మార్పుపై కన్నడ నాట జోరుగా చర్చ జరుగుతోంది. సీఎం బీఎస్ యడియూరప్ప నాయకత్వాన్ని సొంత పార్టీలోని కొందరే బేఖాతరు చేయడం లేదు. ముఖ్యమంత్రిగా యడియూరప్ప దిగిపోవాలన్న డిమాండ్ ఓ వర్గం నేతల నుంచి తీవ్రంగా వినిపిస్తోంది. ఈ మేరకు యడ్డీని వ్యతిరేకిస్తున్న కొందరు కేంద్ర నాయకత్వానికి ఇప్పటికే నాయకత్వ మార్పు జరిగి తీరాలని కోరుతూ పలుమార్లు వినతిపత్రాలు కూడా సమర్పించారు. ఈ నేపథ్యంలో.. సోమవారం నాడు సీఎం యడియూరప్ప మంత్రులతో అర్ధరాత్రి వరకూ చర్చలు జరపడం ఆసక్తికరంగా మారింది. అయితే.. ఈ చర్చల్లో ప్రధానంగా ఏఏ అంశాలపై చర్చ జరిగిందన్న విషయాన్ని గోప్యంగా ఉంచారు. నాయకత్వ మార్పుపైనే ప్రధానంగా చర్చ జరిగిందని.. మంత్రుల్లో మెజార్టీ మంత్రులు యడ్డీకే మద్దతు తెలిపినట్లు సమాచారం. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలి రెండేళ్లయింది. ఆ సమయంలో సీఎం అయిన యడియూరప్ప ఈ రెండేళ్ల కాలంలో ఇంటి పోరుతో సతమతమయ్యారు. ఆయనను వ్యతిరేకిస్తూ కొందరు మీడియా ముందుకెళ్లి వ్యాఖ్యలు చేస్తే.. మరికొందరైతే ఏకంగా కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదులు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. యడియూరప్ప వయసు ప్రస్తుతం 75 సంవత్సరాలు. బీజేపీ అధిష్ఠానం 75 ఏళ్ల వయసు దాటిని వారికి నాయకత్వ పగ్గాలు అప్పగించిన సందర్భాలు అరుదు. ఈ అంశాన్ని కూడా సాకుగా చూపి యడియూరప్ప వ్యతిరేక వర్గం ఆయనను సీఎం పదవి నుంచి తప్పించాలని అధిష్టానాన్ని కోరింది. ఇదిలా ఉంటే.. కర్ణాటకలో 2023లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో.. యడియూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడం పార్టీకి అంత శ్రేయస్కరం కాదనే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. యడియూరప్ప సొంత పార్టీ నేతల అసమ్మతిని భరించలేక ఆయనే స్వయంగా రాజీనామాకు సిద్ధపడుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. తన సొంత నియోజకవర్గంలో చివరిసారిగా సీఎం హోదాలో పర్యటించాలని ఆయన భావిస్తున్నారని.. అందుకే జులై 23, 24న శివమొగ్గ నియోజకవర్గంలో యడియూరప్ప పర్యటించబోతున్నారనే విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. అంతేకాదు.. ఈ నేపథ్యంలోనే.. సీఎం యడియూరప్ప జూలై 25న బీజేపీ ఎమ్మెల్యేలు, సచివాలయ ఉద్యోగులు, సిబ్బందితో చివరిసారిగా సమావేశమై వారందరికీ విందు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అనంతరం.. జూలై 26న ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప రాజీనామా చేయబోతున్నారనే వార్తలు వెలువడుతున్నాయి.

ఈ విషయాన్ని సీఎం యడియూరప్ప అధికారికంగా ప్రకటించక ముందే తానే కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రినంటూ పౌర, ఆహార సరఫరా శాఖ మంత్రి ఉమేష్ కత్తి బెళగావిలో వ్యాఖ్యానించడం కర్ణాటక బీజేపీలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతోంది. నాయకత్వ మార్పు కచ్చితంగా జరిగితే.. ముఖ్యమంత్రి పదవికి ఉండాల్సిన అన్ని అర్హతలు తనకు ఉన్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నాలుగు సార్లు మంత్రిగా పనిచేసిన తనకే తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని ఉమేశ్ కత్తి వ్యాఖ్యానించారు. ఏదేమైనా.. మొత్తం మీద కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. అయితే.. నాయకత్వ మార్పుపై ఒకవేళ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుని ఉంటే.. ఆ నిర్ణయమే తనకు శిరోధార్యమని యడియూరప్ప ప్రకటించడం గమనార్హం.

First published:

Tags: Karnataka, Karnataka bjp, Karnataka Politics, Yeddyurappa, Yediyurappa