హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Puneeth Rajkumar: అనూహ్య ఘటనలు -అంత్యక్రియలు మరింత ఆలస్యం -ఆ దారిలో రక్తపాతం

Puneeth Rajkumar: అనూహ్య ఘటనలు -అంత్యక్రియలు మరింత ఆలస్యం -ఆ దారిలో రక్తపాతం

పునీత్ అంత్యక్రియలు ఆలస్యం

పునీత్ అంత్యక్రియలు ఆలస్యం

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని తట్టుకోలేక కర్ణాటక వ్యాప్తంగా ఆయన అభిమానులు బలవన్మరణాలకు పాల్పడుతుండటం కలకలం రేపుతున్నది. అమెరికా నుంచి కూతురు రావాల్సి ఉండగా పునీత్ అంత్యక్రియలు ఆలస్యంగా, ఆదివారమే జరుగనున్నాయి. గత అనుభవాల నేపథ్యంలో అంతిమయాత్ర జరిగే దారి వెంబడి భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు..

ఇంకా చదవండి ...

కన్నడ సినీ రంగంలో పవర్ స్టార్ గా వెలుగొందిన పునీత్‌ రాజ్‌కుమార్‌ (Puneeth Rajkumar) గుండెపోటుతో హఠాన్మరణం చెందడం అందరినీ షాక్ కు గురించేసింది. నటుడిగానే కాకుండా సామాజిక సేవలోనూ ముందుండిన ఆయనకు ప్రాంతీయ, భాషా భేదాలు లేకుండా జనం నివాళులు అర్పిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మొదలు కర్ణాటక పల్లె ప్రజల దాకా పవర్ స్టార్ మృతికి సంతాపాలు తెలిపారు. పునీత్‌ మరణం నేపథ్యంలో కొన్ని అనూహ్య సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. పునీత్ మరణాన్ని తట్టుకోలేక ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో బలవన్మరణాలకు యత్నిస్తున్నారు. ఇంకొందరు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. రాజ్‌కుమార్‌ కుటుంబానికి సంబంధించి గతంలో అంతిమయాత్రల్లో రక్తపాతం చోటుచేసుకున్న దరిమిలా పునీత్ మరణం తర్వాత శాంతిభద్రతల కోణంలో కర్ణాటక ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. కాగా, పునీత్ అంత్యక్రియలు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి. శనివారం జరుగుతోందనుకున్న అంతిమయాత్ర, ఆదివారానికి వాయిదాపడొచ్చని తెలుస్తోంది. పూర్తి వివరాలివి..


అనూహ్య ఘటనలు..

పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని తట్టుకోలేక రాష్ట్రవ్యాప్తంగా ఆయన అభిమానులు అనూహ్య చర్యలకు పాల్పడుతోన్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. పవర్ స్టార్ పునీత్ శుక్రవారం ఉదయం జిమ్ చేస్తుండగా గుండెపోటుకు గురై ప్రాణాలుకోల్పోవడం తెలిసిందే. బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రిలో చేర్పించే సమయానికే ఆయన తుదిశ్వాస విడిచారు. పునీత్ మరణవార్తను తట్టుకోలేక పలువురు అభిమానులు గుండెపోటుకు గురికాగా, ఇంకొందరు బలవన్మరణాకలు పాల్పడుతున్నారు. చామరాజనగర్ జిల్లాకు చెందిన మునియప్ప అనే అభిమాని.. పునీత్ మరణవార్తలను టీవీలో చూస్తూ ఒక్కసారే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. బెలగావి జిల్లాలో రాహుల్ అనే అభిమాని పునీత్ మరణవార్త విని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉడుపి జిల్లాలో సతీశ్ అనే రిక్షా పుల్లర్ తన అభిమాన హీరో చిత్రపటానికి పూలమాలవేసి రిక్షాలోనే కుప్పకూలిపోగా, అతణ్ని ఆస్పత్రికి తరలించారు. రాయచూర్ జిల్లాలో బసవ గౌడ్, మహ్మద్ రఫీ అనే మరో ఇద్దరు పునీత్ అభిమానులు విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు. పునీత్ అంత్యక్రియలు మరింత ఆలస్యంకానుండగా, ఆయన అభిమానుల చర్యలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. గతంలో పెద్ద రాజ్ కుమార్ చనిపోయినప్పుడూ ఏడుగురు అభిమానులు చనిపోయారు.

అంత్యక్రియలు ఆలస్యం..

విక్రమ్ ఆస్పత్రిలో మరణ ధృవీకణ తర్వాత అభిమానుల సందర్శనార్థం పునీత్ మృతదేహాన్నికంఠీరవ స్టేడియంలో ఉంచారు. రాజ్‌కుమార్‌ కుటుంబానికే చెందిన కంఠీరవ స్టుడియో ప్రాంగణంలో.. తండ్రి సమాధి పక్కనే పునీత్ నూ ఖననం చేయనున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో శనివారం నాడే పునీత్ అంత్యక్రియలు జరుపుతామని కర్ణాటక మంత్రి రెవెన్యూ మంత్రి ఆర్. అశోక్ మీడియాకు తెలిపారు. కానీ ఆ ప్రక్రియ మరికొంత ఆలస్యంగా జరుగనుంది. పునీత్ కూతురు వందితా రాజ్ కుమార్ అమెరికా నుంచి తిరిగిరావడంలో ఆలస్యం నెలకొనడమే ఇందుకు కారణం. వందితా అమెరికా నుంచి తిరిగొచ్చిన తర్వాతే అంత్యక్రియల ప్రక్రియ మొదలుపెడతామని రాజ్ కుమార్ కుటుంబీకులు స్పష్టం చేశారు. దీంతో ఒక రోజు ఆలస్యంగా, అంటే ఆదివారం నాడు పునీత్ అంత్యక్రియలు జరుగనున్నాయి. మరోవైపు..

నాటి అంతిమయాత్ర రక్తసిక్తం..

కుల, సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణాల్లో రాజ్‌కుమార్‌ కుటుంబం కర్ణాటకలోని శక్తిమతమైన కుటుంబాల్లో ఒకటిగా కొనసాగుతుండటం తెలిసిందే. గతంలో రాజ్ కుమార్ మృతదేహానికి జరిగిన రీతిలోనే ఆయన కొడుకు పునీత్ అంత్యక్రియలకు రంగం సిద్ధమైంది. కంఠీరవ స్టేడియం నుంచి కంఠీరవ స్టుడియో వరకు.. మొత్తం 14 కిలోమీటర్లపాటు పునీత్ అంతిమయాత్ర సాగనుంది. అయితే, ఈ మార్గంలో (2006లో) రాజ్ కుమార్ అంతిమయాత్ర సందర్భంలో రక్తపాతం చోటుచేసుకుంది. రాజ్ కుమార్ అంతిమయాత్రకు లక్షల సంఖ్యలో జనం పోటెత్తగా, వారిలో అసాంఘిక శక్తులు చొరబడి.. దారి వెంట ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయడంతో పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం చేశారు. నాటి చేదు అనుభవం నేపథ్యంలో ఇప్పుడు పునీత్ అంత్యక్రియల్లో ఎలాంటి అలజడికి తావు లేకుండా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. బెంగళూరు సహా సున్నితప్రాంతాల్లో అలర్ట్ జారీ చేసిన కర్ణాటక ప్రభుత్వం భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేసింది.

First published:

Tags: Bengaluru, Kannada Cinema, Karnataka, Puneeth RajKumar