ఆయువు తీసే వాయువు.. బెంగళూరు గాలిలో మోతాదుకు మించిన విషం

ప్రతీకాత్మక చిత్రం

బెంగళూరులో ఆస్తమా రోగుల సంఖ్య గణీయంగా పెరగడానికి ఈ బ్లాక్ కార్బన్స్ పెరగడమేనని ప్రొఫెసర్ సతీశ్ కుండబద్దలు కొడుతున్నారు. దీనికి తక్షణ పరిష్కారం బెంగళూరులో వాహనాల వాడకాన్ని తగ్గించడం ఒక్కటే మార్గమని ఆయన సూచిస్తున్నారు

 • Share this:

  బెంగళూరు గాలి బెంగటిల్లే వార్తలు మోసుకొస్తోంది. అందమైన నగరంగా, అభివృద్ధి చెందిన నగరంగా, ఐటీ నగరంగా పేరు తెచ్చుకున్న బెంగళూరులో ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారుతోంది. ఆస్త్మా రోగుల సంఖ్య అనూహ్యంగా పెరగడం వెనకాల అనేక పర్యావరణ కోణాలు బయటపడుతున్నాయి. రోజూ ఆఫీసుకు వెళ్లేవారు, యువతరం వాడే పర్ఫ్యూమ్స్, డియోడరెంట్స్... టొబాకో కన్నా ప్రమాదకారులని తాజా అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి. మనం వాడే స్ప్రేలు, వాహనాల ఉద్గారాలు వెదజల్లే ఏరోసోల్స్ లో బ్లాక్ కార్బన్స్ స్థాయికి మించిపోయి మానవుణ్ని అర్ధాయుషుకు పరిమితం చేస్తున్నాయి. అంతేకాదు.. కంటికి కనపడని ఏరోసోల్స్ (గాలి తుంపర్లు) భూ మండల ఉష్ణోగ్రతలను కూడా తారుమారు చేసే స్థాయికి చేరాయని తాజా అధ్యయనాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.


  ఇప్పటికే బెంగళూరు వాతావరణంలో కర్బన ఉద్గారాల స్థాయి అమితంగా ఉండగా... తాజాగా వాటి ఉనికి పరిమితికి మించిపోయి ఉన్నట్టు తేలింది. కార్బన్, నైట్రోజన్, సల్ఫర్ వంటి కణాలు గాల్లో విపరీతంగా పెరిగిపోయాయని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా వాహనాల ద్వారా వెలువడే ఉద్గారాలే ఈ కాలుష్యానికి ప్రధాన కారకాలుగా తేలింది. వాతావరణంలో దుమ్ము-ధూళి, పొగ, పొగమంచు వంటి కంటికి కనపడని సహజమైన ఉద్గారాలు గాలిని తీవ్రంగా కలుషితం చేస్తుండగా.. వాహనాల నుంచి వచ్చే కర్బన ఉద్గారాలతో పాటు మనం తరచుగా వాడే లిక్విడ్ ఉద్గారాలు కూడా గాలిని తీవ్రంగా కలుషితం చేస్తున్నాయని పుణేలోని ఉష్ణమండల వాతావరణ కేంద్రం చెబుతోంది. ఇలా గాలి తుంపర్ల (ఏరో సోల్స్) రూపంలో వాతావరణంలోకి ప్రవేశించి కాలుష్యాన్ని పెంచుతున్నవి బ్లాక్ కార్బన్స్ గా పుణే పరిశోధకులు తేల్చేశారు.

  విష తుంపరలు ఎలా వస్తున్నాయి?
  గాల్లో వ్యాపిస్తున్న ఈ ఏరోసోల్స్ ప్రధానంగా థర్మల్ పవర్ ప్లాంట్స్ ద్వారా వస్తున్నాయి. అలాగే పరిశ్రమలు వెదజల్లే పొగ నుంచి పెద్దమొత్తంలో ఏరోసోల్స్ గాల్లో చేరిపోతన్నాయి. ఈ ఏరోసోల్స్ సూర్యుని నుంచి వచ్చే రేడియేషన్ కి వాహకాలుగా పనిచేస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. రేడియేషన్ ని సంగ్రహించడమే గాక ఆ రేడియేషన్ ని వాటితోపాటే మోసుకుపోతూ ఏరోసోల్స్ విస్తరింపజేస్తాయన్నమాట. ఫలితంగా భూ మండల ఉష్ణోగ్రతల్ని కూడా ఈ గాలితుంపర్లు తల్లకిందులు చేస్తున్నట్టు చెబుతున్నారు. అంటే వాతావరణంలో ఉష్ణోగ్రతల సమతౌల్యం దెబ్బతినడానికి కంటికి కనపడని ఈ ఏరోసోల్స్ ఎంతగా కారణమవుతున్నాయో ఊహించవచ్చు.

  బెంగళూరులో మోతాదుకు మించి..
  ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఒక క్యూబిక్ మీటరు గాల్లో 20 మైక్రో గ్రాములకు మించి ఏరోసోల్స్ ఉండరాదు. అందుకు విరుద్ధంగా బెంగళూరు హైవే మీద 67 మైక్రోగ్రాములు నమోదవగా, బెంగళూరు వీధుల్లో 15 మైక్రో గ్రాములుగా నమోదైంది. ఒక మైక్రో గ్రాము అంటే క్యూబిక్ మీటర్ గాలిలో ఒక మిలియన్ వంతు అన్నమాట. దీన్నిబట్టి వాహనాలు వెదజల్లే పొగ బెంగళూరు హైవేపై ఎంత ప్రమాదకరంగా పరచుకుంటుందో ఊహించుకోవచ్చు. దీనివల్ల మానవ ఆరోగ్యం తీవ్రమైన దుష్ప్రభావానికి గురవుతోందని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కు చెందిన శాస్త్రవేత్త కె.సతీశ్ చెబుతున్నారు. బెంగళూరులో వాహనాల నుంచి వచ్చే పొగతో పాటు జంతువుల కళేబరాలు, మానవ మృతదేహాలు కాల్చడం ద్వారా, చెత్త-చెదారాలను తగులబెట్టడం ద్వారా నగర పరిసరాల్లో బ్లాక్ కార్బన్ విపరీతంగా వ్యాపిస్తోందని సతీశ్ అభిప్రాయపడుతున్నారు.
  బెంగళూరులో వాయు కాలుష్యం

  బ్లాక్ కార్బన్ ఏం చేస్తుంది?
  వాతావరణంలో పరిమితికి మించిన బ్లాక్ కార్బనే మానవ ఆరోగ్యాన్ని, గ్లోబల్ ఉష్ణోగ్రతను కుదిపేస్తోంది. స్వయంగా అమెరికాలోని ఎన్విరాన్ మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఈ విషయాన్ని వెల్లడించింది. బ్లాక్ కార్బన్ శ్వాసనాళాల గుండా శరీరాల్లోకి చేరి శ్వాసకోశ సమస్యలు తెచ్చిపెడుతుంది. అంతేకాదు అనేక గుండెజబ్బులకు, క్యాన్సర్ కు, పుట్టుకతోనే వచ్చే లోపాలకు బ్లాక్ కార్బన్ కారణమవుతుంది.

  ఇక ఫ్రాన్స్ లోని ఓ యూనివర్సిటీ అయితే మరో అనూహ్యమైన బాంబు పేల్చింది. నాగరికతలో భాగంగా రోజువారీ వాడుకునే డియోడరెంట్లు, సెంట్లు, పూజలో వాడే అగరుబత్తులు కూడా బ్లాక్ కార్బన్ పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఈ ఘాటైన సువాసనల మాటున బెంజీన్, నాప్తలీన్, టెర్పీన్ వంటి విషతుల్యాలు గాల్లో చేరిపోతున్నాయి. ఇలాంటి సింథటిక్ పెర్ఫ్యూమ్స్ చర్మం గుండా, శ్వాస ద్వారా లోపలికి వెళ్లి ఆస్త్మాకు దారి తీస్తున్నాయి. గృహ కాలుష్యాల్లో మనం ఇప్పటివరకు బీడీ, సిగరెట్ వంటివాటినే చెప్పుకుంటున్నాం. కానీ.. తాజా అధ్యయనాల ప్రకారం ఇలాంటి సువాసనలు కూడా పొగాాకుతో సమానంగా మానవారోగ్యాన్ని నాశనం చేస్తున్నట్టు గుర్తించారు.

  సెలబ్రిటీల అడ్వర్టయిజ్ మెంట్ల కారణంగానే ఘాటైన డియోడరెంట్లను యూత్ ఎక్కువగా వాడుతున్నారని, ఈ వాడకం నానాటికీ పెరగడం వల్ల బ్లాక్ కార్బన్ పరిమితి అవాంఛనీయంగా పెరిగిందని ఫౌండేషన్ ఫర్ ఎకలాజికల్ సెక్యూరిటీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ యెల్లపరెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు బెంగళూరులో ఆస్తమా రోగుల సంఖ్య గణీయంగా పెరగడానికి ఈ బ్లాక్ కార్బన్స్ పెరగడమేనని ప్రొఫెసర్ సతీశ్ కుండబద్దలు కొడుతున్నారు. దీనికి తక్షణ పరిష్కారం బెంగళూరులో వాహనాల వాడకాన్ని తగ్గించడం ఒక్కటే మార్గమని ఆయన సూచిస్తున్నారు. మరి ఈ ప్రమాద తీవ్రతను గుర్తించి వెంటనే ఓ మంచి నిర్ణయం తీసుకుంటారా? చూద్దాం.

  - కపిల్ కాజల్, 101 రిపోర్టర్స్

  (Author is freelance writer and a member of 101Reporters.com)
  First published: