తనపై నిందలు వేసినవారు క్షమాపణ చెప్పాలని మైసూరు జిల్లా కలెక్టర్ రోహిణి సింధూరి డిమాండ్ చేశారు. కర్ణాటకలోని చామరాజనగర్‌లోని ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఆక్సిజన్ కొరతకు తానే కారణమని ఆరోపించే ప్రయత్నం జరిగిందని అన్నారు. చామరాజనగర్ జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 24 మంది రోగులు మృతిచెందిన సంగతి తెలిసిందే. మృతుల్లో కోవిడ్ రోగులతో పాటు సాధారణ పేషెంట్లు కూడా ఉన్నారు. ఈ ఘటన కర్ణాటక వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఆక్సిజన్ సరఫరాలో జాప్యం వల్లే ఇలా జరిగిందని.. ఈ ఘటన చోటుచేసుకోవడానికి రోహిణి సింధూరి కారణమనే ఆరోపణలు వచ్చాయి. మైసూరు నుంచి అక్కడికి ఆక్సిజన్ సరఫరా జరగకుండా రోహిణి అడ్డుకున్నారని ప్రధానంగా ఆరోపించారు. ఈ మేరకు కొందరు ఆమెపై తీవ్రమైన విమర్శలు కూడా చేశారు.
ఇక, ఈ ఘటనకు సంబంధించి విచారణ చేపట్టేందుకు హైకోర్టును ఓ బెంచ్‌ను ఏర్పాటు చేసింది. తాజాగా ఆ బెంబ్ కోర్టుకు రిపోర్ట్ సమర్పించింది. అందులో రోహిణిని నిర్దోషిగా పేర్కొన్నారు. ఆమెకు హైకోర్టు ఏర్పాటు చేసిన బృందం క్లీన్ చీట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణలపై కలెక్టర్ రోహిణి సింధూరి స్పందించారు. ‘కొందరు గత 7 నెలలుగా నాపై పర్సనల్‌గా నిందలు వేస్తున్నారు. ఆ ఘటన జరిగినప్పటి నుంచి నాపై నిరాధరమైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అయినా మేము వాటన్నింటికి రియాక్ట్ కాలేదు. ఎందుకంటే అది నా జాబ్ కాదు. ఇలా ఆరోపణలు చేసిన ప్రతి ఒక్కరు మైసూరు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే వారు మైసూరు ఖ్యాతి దెబ్బతినేలా ప్రవర్తించారు’అని రోహిణి పేర్కొన్నారు.
‘నేను ప్రజలకు సేవ చేయాలని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో జాయిన్ అయ్యాను. చామరాజనగర్ల ఘటనకు సంబంధించి మా తప్పేమీ లేకున్నా.. కొందరు కావాలనే మా పేర్లను లాగారు. ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేటర్లు తరుచూ కామెంట్స్ చేసేవారు.. వీటన్నింటికి సమాధానం చెప్పడం చాలా కష్టంగా మారింది.
ఈ ఘటనపై ప్రభుత్వం కోరిన పూర్తి సమాచారం అందజేశాను. తాజాగా నాపై వచ్చిన ఆరోపణలు నిరాధరమైనవని రుజువైంది’అని రోహిణి అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.