ప్రమాదంలో(Accident) అవయవాలు కోల్పోయి జీవితాంతం దుర్భరంగా గడుపుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. వారికి ఆసరా కల్పించడం కోసం ఎంతో మంది చనిపోయిన తర్వాత తమ అవయవాలను దానం చేస్తూ మరొకరికి జీవితాన్ని ప్రసాదిస్తుంటారు. ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. తాజాగా 2011లో విద్యుత్ ప్రమాదంలో(Electric shock) రెండు చేతులు కోల్పోయిన 34 ఏళ్ల వ్యక్తికి అవయవ దానం(Organ Donate) వల్ల కొత్త జీవితం లభించింది. కేరళకు చెందిన ఓ వ్యక్తి బ్రెయిన్ డెడ్(Brain dead) చెందడంతో అతని చేతులను స్వీకర్తకు అమర్చారు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన బసవన్న గౌడ 2011లో జరిగిన విద్యుత్ ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయాడు.
అప్పటి నుంచి అతడు చికిత్స తీసుకుంటూ ఉన్నాడు. గతేడాది సెప్టెంబరులో అతడికి కొచ్చి అమృత ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIMS) ఆసుపత్రి వైద్యులు సంక్లిష్టమైన సర్జరీ చేసి కొత్త చేతులను అమర్చారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన సదరు ఆసుపత్రి వైద్యులు ఈ విషయాన్ని తెలియజేశారు. కేరళలో బ్రెయిడ్ డెడ్ అయిన నెవిస్ సజన్ మ్యాథ్యూ అనే వ్యక్తి అవయవాలను దానం చేయాలని అతని కుటుంబ సభ్యులు భావించారు. దీంతో తాజా ట్రాన్స్‌ప్లాంటేషన్ సాధ్యమైందని వైద్యులు తెలిపారు. అతని కుటుంబం తీసుకున్న ఈ గొప్ప నిర్ణయంతో మరొకరికి జీవనదానం లభించిందని స్పష్టం చేశారు.
కేరళలోని కొట్టాయంకు చెందిన సజన్ మ్యాథ్యూ అనారోగ్యం బారిన పడి 2021 సెప్టెంబరు 24న హాస్పిటల్‌లో చేరాడు. ఫ్రాన్స్‌లో మాస్టర్స్ చదువుకుంటున్న అతను సెలవుల్లో కేరళకు రాగా.. ఆరోగ్యం విషమించి బ్రెయిడ్ డెడ్ చెందాడు. మ్యాథ్యూ తల్లిదండ్రులు అతడి చేతులను దానం చేయడానికి అంగీకరించడంతో ఆ మరుసటి రోజు బసవన్నకు 14 గంటల పాటు క్లిష్టమైన సర్జరీని చేసి చేతుల మార్పిడి చేశారు.
చేతుల మార్పిడి శస్త్రచికిత్సకు పేరుగాంచిన అమృత ఆసుపత్రిలో బసవన్న 2016లో చేరారు. అయితే గతేడాది చేతి మార్పిడి సర్జరీ చేయించుకోవాలని దరఖాస్తు చేయించుకున్నాడు. అతను అప్లై చేసుకున్న ఆరు నెలల్లో ఈ శస్త్రచికిత్స జరిగింది. చేతి మార్పిడి శస్త్రచికిత్స చేయాలంటే దాత, గ్రహీత ఇద్దరి బ్లడ్ గ్రూపులు సరిపోలాలని వైద్యులు తెలిపారు. విలేకరుల సమావేశంలో మ్యాథ్యూ తండ్రి మాట్లాడుతూ తన కుమారుని అవయవ దానం చేసినందుకు గర్వపడుతున్నామని అన్నారు. ఎనిమిది రోజుల పాటు ఐసీయూలో పోరాడిన మ్యాథ్యూ బ్రెయిన్ డెడ్ చెందాడని ఆయన తెలిపారు. ఇది చాలా క్లిష్టమైన శస్త్రచికిత్స అని, ఈ స్థాయిలో అవయవ మార్పిడిలో చేతి కండరాల సహజ పొడవులో మూడింట ఓ వంతు మాత్రమే గ్రహీతలో ఉంటుందని అమృత ఆసుపత్రి వైద్యులు డాక్టర్ మోహిత్ శర్మ స్పష్టం చేశారు.
బసవన్నకు అమర్చిన ఈ చేతులు సరైన పనితీరుకు మరో ఏడాది సమయం పడుతుందని, అంతవరకు పర్యవేక్షిస్తామని వారు తెలిపారు. రోజువారీ కార్యకలాపాలను సులభంగా చేయడానికి ఫంక్షనల్ స్ప్లింట్లను ఉపయోగించాల్సి ఉంటుందని, కండరాలను బలపరిచే వ్యాయామాలు చేయాల్సి ఉంటుందని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karnataka, Organs, Trending news