హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Transgenders Reservations: ట్రాన్స్‌ జెండర్లకు రిజర్వేషన్లు.., ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

Transgenders Reservations: ట్రాన్స్‌ జెండర్లకు రిజర్వేషన్లు.., ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

స‌మాజంలో తీవ్ర వివ‌క్ష ఎదుర్కొంటున్న ట్రాన్స్ జెండ‌ర్ల విష‌యంలో ఓ పెద్ద ముంద‌డుగు ప‌డింది.

    స‌మాజంలో తీవ్ర వివ‌క్ష ఎదుర్కొంటున్న ట్రాన్స్ జెండ‌ర్ల విష‌యంలో ఓ పెద్ద ముంద‌డుగు ప‌డింది. వారి విషయంలో అసమానతలను రూపు మాపేందుకు తొలిసారిగా ఓ రాష్ట్ర‌ం కీలక ప్రకటన చేసింది. ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు ప్ర‌భుత్వ ఉద్యోగాల‌లో ఒక శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తూ కర్ణాటక ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈమేర‌కు క‌ర్ణాట‌క హైకోర్టుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ఒక నివేదిక‌ను కూడా స‌మ‌ర్పించింది. ఇందుకోసం కర్ణాటక సివిల్‌ స‌ర్వీసెస్ (జ‌న‌ర‌ల్ రిక్రూట్‌మెంట్‌) రూల్- 1977కు స‌వ‌ర‌ణ‌లు చేసిన‌ట్టు ఆ నివేదిక‌లో పేర్కొంది. దీంతో దేశంలో ట్రాన్స్ జెండ‌ర్ల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించిన తొలి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది.

    సంగ‌మా అనే స్వ‌చ్ఛంద సంస్థ ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు ఉద్యోగాల‌ను నిరాక‌రించ‌డాన్ని స‌వాలు చేస్తూ కర్ణాటక హైకోర్టులో ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌లు చేసింది. స్టేట్ స్పెష‌ల్ రిజ‌ర్వ్ కానిస్టేబుల్ ఫోర్స్ అండ్ బ్యాండ్‌మెన్ పోస్టింగుల‌లో ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు అవ‌కాశం లేక‌పోవ‌డాన్ని ప్ర‌శ్నిస్తూ ఆ సంస్థ ధ‌ర్మాస‌నాన్ని ఆశ్ర‌యించింది. జ‌స్టిస్ ఏఎస్ ఓఖా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం ఈ కేసును విచారించింది. విచార‌ణ‌ సంద‌ర్భంగా కర్ణాటక ప్ర‌భుత్వం త‌ర‌పున ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ విజ‌య‌కుమార్ పాటిల్ ట్రాన్స్‌జెండ‌ర్ల ఒక‌శాతం రిజ‌ర్వేష‌న్‌కు ప్ర‌భుత్వం ఆమోద‌ముద్ర వేసింద‌ని చెప్పారు. ఇందుకోసం ప్ర‌స్తుతం ఉన్న నిబంధ‌న‌ల‌కు స‌వ‌ర‌ణ‌లు చేసింద‌ని కోర్టు దృష్టికి తీసుకువ‌చ్చారు.

    జీవా అనే స్వ‌చ్ఛంద సంస్థ త‌ర‌పున పిటిష‌న్ వేసిన జ‌య‌నా కొఠారి త‌న వాద‌న‌లు వినిపిస్తూ.. ప్ర‌భుత్వ స‌ర్వీసుల‌తోపాటు, బోర్డులు, కార్పొరేష‌న్ల‌లోనూ ఈ రిజ‌ర్వేష‌న్ వ‌ర్తించేలా ఆదేశాలు ఇవ్వాల‌ని కోర్టును అభ్య‌ర్థించారు. అయితే దీనిపై ప్ర‌త్యేకంగా పిటిష‌న్ దాఖ‌లు చేస్తే ఆదేశాలు జారీ చేస్తామ‌ని కోర్టు తెలిపింది. అలాగే కేంద్ర‌ ప్ర‌భుత్వం కూడా ఈ విష‌య‌మై త‌న విధాన‌మేమిటో తెల‌పాల‌ని ప్రాసిక్యూట‌ర్‌ను కోర్టు కోరింది. ట్రాన్స్ జెండ‌ర్ల‌కు ఒక శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించ‌డాన్ని హైకోర్టు కూడా స్వాగ‌తించింది. ఈ నిర్ణయం తీసుకున్న ప్ర‌భుత్వాన్ని ప్ర‌శంసించింది.

    ఇదీ నోటిఫికేష‌న్

    ఈ విషయంపై కర్ణాటక ప్ర‌భుత్వం జులై 6వ తేదీనే తుది నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. జ‌న‌ర‌ల్ స‌ర్వీసుల‌తోపాటు రిజ‌ర్వ్ కేట‌గిరీల‌లోనూ ట్రాన్స్ జెండ‌ర్ల‌కూ అవ‌కాశం క‌ల్పిస్తున్నట్లు అందులో పేర్కొంది. ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానించేట‌ప్పుడు ద‌రఖాస్తు ఫారాల‌లో ఆడ‌, మ‌గ‌తో పాటు ఇత‌రులు అనే కాల‌మ్‌ను కూడా జోడించాల‌ని స్ప‌ష్టం చేసింది. ఇక ఎంపిక ప్ర‌క్రియ‌లో ట్రాన్స్‌జెండ‌ర్ల విష‌య‌మై ఎటువంటి వివ‌క్ష చూప‌రాద‌ని కూడా ప్ర‌త్యేకించి నొక్కి చెప్పింది. ఒక‌వేళ ట్రాన్స్‌జెండ‌ర్ అభ్య‌ర్థులు ఎవ‌రూ లేని ప‌క్షంలో ఆ కేట‌గిరిలోనే మ‌హిళ‌లు, లేదా పురుషుల‌కు ఆ ఉద్యోగాన్ని కేటాయించాల‌ని నోటిఫికేష‌న్‌లో పేర్కొన్నారు.

    First published:

    Tags: Karnataka, Transgender

    ఉత్తమ కథలు