Karnataka New CM: కర్ణాటక 20వ సీఎంగా బొమ్మై నేడు ప్రమాణస్వీకారం.. ఇంజనీరు రిపేరు చేస్తారా..?

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (ఫైల్ ఫోటో)

2023 ఎన్నికలే టార్గెట్ గా బీజేపీ కర్ణాటకలో పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే సీఎంను మార్చింది. కొత్త సీఎంగా బాధ్యతలు చేపడుతున్న బొమ్మై.. అనుకున్న లక్ష్యాన్ని సాధించగలరా..?

 • Share this:
  గత కొన్ని రోజుల నుంచి తీవ్ర ఉత్కంఠ పెంచిన కన్నడ బీజేపీ రాజకీయానికి శుభం కార్డు పడింది. యడియూరప్ప రాజీనామా చేయడం.. కొన్ని గంటలకే ఆయన సూచించిన అభ్యర్థినే సీఎంగా అధిష్టానం ఎంపిక చేయడం చకచకా జరిగిపోయాయి. ఆయన ఇవాళ ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే అనూహ్యంగా... ఆశ్చర్యకరంగా... కాషాయ దళంలో సోషలిస్టు సిద్ధాంతకర్త కుటుంబసభ్యుడు ముఖ్యమంత్రి అవుతుండడం విశేషం. సోమవారం యడియూరప్ప తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మంగళవారం బి.ఎస్‌.యడియూరప్ప తర్వాత ముఖ్యమంత్రి పదవికి తాజా మాజీ హోంమంత్రి బసవరాజ బొమ్మై పేరును బీజేపీ శాసనసభా పక్షం ప్రతిపాదించింది. దీంతో కర్ణాటక 20వ ముఖ్యమంత్రిగా బొమ్మై నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన తండ్రి సోమప్ప రాచప్ప బొమ్మై (ఎస్‌.ఆర్‌.బొమ్మై) కూడా గతంలో కర్నాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన సోషలిస్టు ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎంపిక కోసం మంగళవారం సాయంత్రం నిర్వహించిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో అధిష్ఠానం నుంచి పరిశీలకులుగా వచ్చిన కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్‌ సంయుక్తంగా ఓ ప్రకటన చేశారు. యడియూరప్ప మంత్రివర్గంలో హోం, శాసనసభా వ్యవహారాల మంత్రిగా పనిచేసిన బసవరాజ బొమ్మై పేరు వెల్లడించారు. ఆపై మంగళవారం రాత్రి రాజ్‌భవన్‌కు వెళ్లిన బసవరాజ.. సర్కారు ఏర్పాటుకు అవకాశం కల్పించాలని గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌ను కోరారు. నేటి ఉదయం 11.00 గంటలకు ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. మంగళవారం శాసనసభాపక్ష సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు అరుణ్‌సింగ్‌, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, ధర్మేంద్రప్రధాన్‌, బీజేపీ నాయకురాలు డీకే అరుణ, మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్‌.యడియూరప్ప ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

  బసవరాజ బొమ్మై ఎంపికలో మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కీలకపాత్ర పోషించారు. అప్ప అత్యంత ఆప్తుల్లో ఒకరైన బసవరాజ బొమ్మై నాయకత్వాన్ని దాదాపు అందరూ ఆమోదించారు. శాసనసభాపక్ష సమావేశంలో ఆయన పేరును యడియూరప్ప ప్రతిపాదించగా మాజీ ఉపముఖ్యమంత్రి గోవింద కారజోళ ఆమోదించారు. తన పేరు ప్రకటించగానే బసవరాజ స్పందించి.. యడియూరప్ప పాదాలకు నమస్కరించారు. మంగళవారం వరకు దాదాపు పది మంది ఆశావహుల పేర్లు పరిశీలనలో ఉన్నా చివరకు ఈ పేరును అధిష్ఠానం ఖరారుచేసింది. ఇదే సందర్భంగా ముగ్గురు ఉపముఖ్యమంత్రులను నియమించారు. ఆర్‌.అశోక్‌, బి.శ్రీరాములు, గోవింద కారజోళ ఈ పదవులకు ఎంపికయ్యారు. బసవరాజతో పాటు ఆ ముగ్గురూ ప్రమాణస్వీకారం చేయనున్నారు. వీరిలో గోవింద కారజోళ యడియూరప్ప సర్కారులో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు.

  నూతన ముఖ్యమంత్రి నియామకంలో యడియూరప్ప సూచనలను అదిష్టానం ఆమోదించింది. పార్టీకి సంప్రదాయ ఓటుబ్యాంకుగా ఉన్న లింగాయత్‌లను సంతృప్తిపరుస్తూ అదే వర్గానికి చెందిన బసవరాజకు అవకాశం కల్పించింది. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి అత్యధిక స్థానాలు కట్టబెట్టే ఉత్తర కర్ణాటక ప్రాంతానికి (హావేరి) చెందిన నేతకు అవకాశం కల్పించింది. ఇప్పటికే వందలాది లింగాయత్‌ మఠాధిపతులు లింగాయేతర సముదాయం నుంచి నూతన సీఎంను ఎంపిక చేయరాదని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. బీజేపీ సీఎంలకు ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యం, పార్టీలో సుదీర్ఘ సభ్యత్వం ఉండాలన్న సంప్రదాయాన్ని బసవరాజ ఎంపికలో అధిష్ఠానం పక్కన బెట్టింది.

  కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎస్‌.ఆర్‌.బొమ్మై కుమారుడు. 1988- 1989లో ఎస్‌.ఆర్‌.బొమ్మై కర్ణాటక సీఎంగా పనిచేశారు. 1960 జనవరి 1న హుబ్బళ్లిలో జన్మించిన బసవరాజ కొన్నాళ్లు జేడీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా, 1996 నుంచి 1997 వరకు నాటి ముఖ్యమంత్రి జె.హెచ్‌.పటేల్‌కు రాజకీయ కార్యదర్శిగా పనిచేశారు. 2005 వరకు రెండుసార్లు విధాన పరిషత్తుకు ఎన్నికయ్యారు. 2006లో భాజపాలోకి చేరిన ఆయన హావేరి జిల్లా శిగ్గాం ఉంచి వరుసగా మూడుసార్లు విధానసభకు ఎన్నికయ్యారు. 61 ఏళ్ల బసవరాజ బసవరాజ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పట్టభద్రుడు. పుణె టెల్కో కంపెనీలో సాంకేతిక సలహాదారుడిగా, సీనియర్‌ కన్సల్టెంట్‌గా పనిచేశారు. నీటిపారుదల రంగంలో విశేష పరిజ్ఞానం ఉంది. 2008లో తొలిసారి విధానసభకు ఎన్నికైన ఆయన.. అదే ఏట ఏర్పాటైన భాజపా సర్కారులో జల వనరులు, 2019లో మళ్లీ ఏర్పాటైన సర్కారులో సహకార, హోం, శాసనసభా వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. ఇంజనీరైన బొమ్మ్మై మరి.. 2023 ఎన్నికల నాటికి పార్టీ మొత్తాన్ని రిపేరు చేయగలరా లేదా అన్నది చూడాలి.
  Published by:Nagesh Paina
  First published: