Lockdown: హృదయవిదారకం.. కూతురిని భుజాలపై ఎత్తుకుని 8 కి.మీ నడిచిన తండ్రి.. Video

కూతురిని భుజంపై ఎత్తుకుని నడుస్తున్న తండ్రి

ఓ వ్యక్తి జ్వరంతో బాధపడుతున్న తన కూతురిని ఆస్పత్రిలో చూపించడానికి ఎనిమిది కిలో మీటర్లు ఆమెను భుజంపై ఎత్తుకుని నడిచాడు.

  • Share this:
    లాక్‌డౌన్ వేళ కర్ణాటక రాష్ట్రంలో ఓ హృదయవిదారక దృశ్యం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి జ్వరంతో బాధపడుతున్న తన కూతురిని ఆస్పత్రిలో చూపించడానికి ఎనిమిది కిలో మీటర్లు ఆమెను భుజంపై ఎత్తుకుని నడిచాడు. లాక్‌డౌన్ సమయంలో వాహనంపై వెళ్తే పోలీసులు ఏమైనా అంటారేమోనన్న భయంతో అతడు ఈ విధంగా చేశాడు. వివరాలు.. కరోనా కట్టడిలో భాగంగా కర్ణాటక ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. యాదగిరి జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో.. జిల్లా కలెక్టర్ అక్కడ మూడు రోజుల పాటు కఠిన లాక్‌డౌన్ అమలు చేయాలని ఆదేశాలు జారీచేశారు. దీంతో పోలీసులు యాదగిరి జిల్లా వ్యాప్తంగా కఠిన చర్యలు చేపట్టారు. ప్రజలు యాదగిరి నగరంలోకి ప్రవేశించకుండా ఆంక్షలు విధించారు. ఎమర్జెన్సీ పనులు, ఒంటరిగా ఆస్పత్రికి వెళ్లేందుకు మాత్రమే అనుమతులు ఇచ్చారు.

    అయితే యాదగిరి తాలుకాలోని పగలాపూర గ్రామానికి చెందిన మారెప్ప అనే వ్యక్తి కూతురికి జ్వరంగా ఉండటంతో.. అతడు ఆస్పత్రిలో చూపించేందుకు యాదగిరి నగరానికి బయలుదేరాడు. అయితే లాక్‌డౌన్ కఠినంగా అమలు చేస్తుండటంతో.. బైక్‌పై కూతురిని తీసుకెళ్లడానికి భయపడ్డాడు. బైక్‌పై వెళ్తే పోలీసులు బైక్‌ను పట్టుకుంటారేమోనన్న భయంతో.. 8 కి.మీ దూరంలో ఉన్న యాదగిరి పట్టణానికి కాలినడకన ప్రయాణం ప్రారంభించాడు. కూతురిని భుజంపై ఎత్తుకుని.. 8 కి.మీ ప్రయాణించి చివరకు యాదగిరిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కూతురికి చికిత్స చేయించాడు. అనంతరం అక్కడి నుంచి తిరిగి పగలాపూరకు బయలుదేరాడు.



    అయితే తిరుగు ప్రయాణంలో.. ఒక ఆటోలో కొంత దూరం ప్రయాణించి.. అక్కడి నుంచి కూతురిని భుజాలపై మోసుకుంటూ కాలినడకన ఇంటికి చేరాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
    Published by:Sumanth Kanukula
    First published: