Puttur Temple: ఇతర మతస్థులకు అక్కడ నో పార్కింగ్... హిందూ ఆలయ కమిటీ వివాదాస్పద నిర్ణయం..

మహాలింగేశ్వర ఆలయం (ఫైల్)

Hindu Temples: ఇటీవల హిందూ ఆలయాల్లో అన్యమత ప్రచారం అనే మాట తరచూ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో హిందూ ఆలయాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఆలయ కమిటీ చేసిన తీర్మానం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

  • Share this:
ఇటీవల హిందూ ఆలయాల్లో అన్యమత ప్రచారం అనే మాట తరచూ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో హిందూ ఆలయాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఆలయ కమిటీ చేసిన తీర్మానం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. వివరాల్లోకి వెళ్తే.., కర్ణాటకలోని మంగళూరులో ఉన్న పుత్తూరు మహాలింగేశ్వర దేవాలయ కమిటీ తాజా నిర్ణయం వార్తల్లోకి ఎక్కింది. ఆలయ పార్కింగ్ విషయంలో కమిటీ నిర్ణయం వివాదాస్పదమవుతోంది. హిందువులు కానివారు ఆలయ ఆవరణలో పార్కింగ్ చేయరాదని పుత్తూరు దేవస్థాన కమిటీ నిర్ణయించింది. ఈ ప్రాంతంలో హిందూయేతరులు తమ వాహనాలను పార్క్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ఆలయ అధికారులు నోటీసు బోర్డు కూడా పెట్టారు. దీంతో ఈ నోటీస్ బోర్డ్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ నిర్ణయంపై భక్తుల నుంచి వ్యతిరేకత రావడంతో ఆలయ కమిటీ స్పష్టతనిచ్చింది.

వివాదంపై ఆలయ కమిటీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మలియా మాట్లాడుతూ ‘‘క్షేత్రానికి ఎక్కడా ప్రహరీ గోడ లేదు. అందుకే ఆలయానికి వచ్చే భక్తులు కాకుండా, మిగతా వారు కూడా తమ వాహనాలను ఇక్కడే పార్క్ చేస్తున్నారు. దీని వల్ల ఆలయ ప్రాంగణంలో అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంది. అనేక మంది భక్తులు కూడా ఈ పార్కింగ్ విషయంలో మాకు ఫిర్యాదులు చేశారు. అందువల్ల, పార్కింగ్ స్థలాన్ని చూసుకునే అధికారం ముజ్రాయ్ డిపార్ట్‌మెంట్‌కు కట్టబెట్టాం. ఆలయ కమిటీ నియమ నిబంధనలను భక్తులంతా పాటించాలి’’ అని తెలిపారు.

ఇది చదవండి: తోకపై నిల్చొని ఈలేస్తున్న కోబ్రాలు.. ఏపీలో అరుదైన జీవుల సంచారం.. ఎక్కడంటే..!


ఒకవేళ ఎవరైనా హిందూయేతరులు పార్కింగ్ అభ్యర్థనతో ముందుకు వస్తే, కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేశవ్ చెప్పారు. ఆలయ ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా భక్తులు దైవ దర్శనం చేసుకోవాలనేదే తమ ఉద్దేశం అన్నారు. అంతేకానీ, మతాల మధ్య అంతరాలు చూపాలనుకోవట్లేదని చెబుతూ.. కమిటీ నిర్ణయాన్ని సమర్థించే ప్రయత్నం చేశారు.

ఇది చదవండి: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. త్వరలోనే సర్వదర్శనం


నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్లు..
ఈ నిర్ణయాన్ని పలువురు సామాజిక వేత్తలు, రాజకీయ నాయకులు తప్పుబడుతున్నారు. ఆలయ కమిటీ నిర్ణయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే శకుంతల శెట్టి విమర్శించారు. "విభిన్న మత విశ్వాసాలకు చెందిన వ్యక్తులు పుత్తూరు మహాలింగేశ్వరుడిని ప్రార్థిస్తారు. ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ నిబంధన వారిని కట్టడి చేసేలా ఉంది. మరోవైపు పుత్తూరు పట్టణంలో తగినంత పార్కింగ్ స్థలం లేదు. బ్యాంకులు, మార్కెట్లు, ఇతర ప్రదేశాలకు వెళ్లే ప్రజలు తమ వాహనాలను ఆలయ పరిసరాల్లోనే పార్క్ చేస్తుంటారు. వారి సౌలభ్యం కోసం కమిటీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి” అని ఆమె కోరారు.

ఇది కూడా చదవండి: ప్రియుడి కోసం దేశంకాని దేశం వచ్చిన యువతి... ఇంతలోనే ఊహించని కష్టం.. పోలీసులే ఆమె పాలిట దేవుళ్లు..పుత్తూరు శ్రీ మహాలింగేశ్వర దేవాలయాన్ని 12వ శతాబ్దంలో నిర్మించారు. దక్షిణ కన్నడ జిల్లాలోని పుత్తూరులో ఈ దేవాలయం ఉంది. ఇక్కడ కొలువైన శివుడిని పుత్తూరు మహాలింగేశ్వర అని పిలుస్తారు. పది రోజుల క్రితం, భజరంగ్ దళ్, హిందూ జాగరణ వేదిక, ఇతర హిందూ అనుకూల సంస్థలు హిందూయేతరులు ఇక్కడి ఆలయ పార్కింగ్ స్థలాన్ని ఉపయోగించడాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. వారి డిమాండ్లకు తలొగ్గి ఆలయ కమిటీ తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Published by:Purna Chandra
First published: