Air Pollution: వాయు కాలుష్యాన్ని తగ్గించే నయా టెక్నిక్స్ ఇవే

ప్రతీకాత్మక చిత్రం

సహజసిద్ధమైన, ప్రకృతిలో ఉచితంగా లభించే ఎయిర్ ఫిల్టర్లు అయిన చెట్లను పరిరక్షించడం, మొక్కల్ను పెంచడం మానేసి కాసుల కోసం కృత్రిమ ఎయిర్ ఫిల్టర్లను ఆశ్రయించడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని పర్యావరణ ఉద్యమకారుడు జగదీశ్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు.

 • Share this:
  ఈ రోజుల్లో వాటర్ ప్యూరిఫైయర్స్ లేని ఇళ్లను ఊహించగలమా? చిన్న పట్టణాలు మొదలుకొని మైదాన ప్రాంతాల్లోని అన్ని గ్రామ పంచాయతీలకు సైతం వాటర్ ప్యూరిఫైయర్స్ విస్తరించాయి. ఇంకా పెద్ద పట్టణాల్లో అయితే అన్ని ఇళ్లలో కూడా ఇవి తప్పనిసరిగా మారిపోయాయి. ఇప్పుడు అదే కోవలోకి ఎయిర్ ప్యూరిఫైయర్స్ కూడా రాబోతున్నాయి. అంతేకాదు.. వాటర్ ప్యూరిఫైయర్ అయితే ఇంటికోటి సరిపోతుంది. కానీ ఎయిర్ ప్యూరిఫైయర్ అలా కాదు కదా. ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఫిల్టర్స్ కావాల్సిందే. కాలుష్యం విసురుతున్న సవాళ్లను సొమ్ము చేసుకునేందుకు దేశంలోని పలు స్టార్టప్ కంపెనీలు ఎయిర్ ప్యూరిఫైయర్స్ మీద కన్నేశాయి.

  కాలుష్యంలో కాసుల వేట
  బెంగళూరులోని యాంబీ (Ambee) అనే స్టార్టప్ కంపెనీ వినూత్నమైన ఆలోచనతో ముందుకొచ్చింది. గాల్లో నాణ్యత ఎంతుందో తెలపడమే ఈ స్టార్టప్ కంపెనీ బిజినెస్ రహస్యం. నగరంలో ఏ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఎంతుందనే డాటాను ప్రిపేర్ చేసి రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కి, కన్స్యూమర్స్ కి, హెల్త్ రీసెర్చర్స్ కి, మీడియా కంపెనీలకు డాటా అందజేస్తుంది. ఇలా ఎయిర్ క్వాలిటీ డాటాను అమ్మడమే వీళ్ల వ్యాపారం. దీనివల్ల ఎయిర్ ప్యూరిఫైయింగ్ కంపెనీల మధ్య నాణ్యత కోసం పోటీ పెరుగుతుందని, ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకునే వీలుంటుందని, అటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, డెవలపర్స్ సరైన నిర్ణయం తీసుకునే వీలు చిక్కుతుందని, వినియోగదారులు కూడా ఓ అవగాహనతో వ్యవహరించే అవకాశం ఉంటుందని యాంబీ మేనేజ్ మెంట్ చెబుతోంది. మొత్తానికి వీరి ప్రయత్నం వల్ల ఆఫీసుల్లో, కర్మాగారాల్లో, ఇతర పని ప్రదేశాల్లో వాయు నాణ్యత పెరిగేలా చూడడం, ఫలితంగా వ్యక్తుల ఆరోగ్యం బాగుంటుందని వారంటున్నారు. అంతేకాదు.. వాయు నాణ్యత కోసం వినియోగదారులు ఓ హక్కుగా పోరాడే అవకాశం ఉంటుందని కూడా యాంబీ స్టార్టప్ ఫౌండర్లలో ఒకరైన మధుసూదన్ ఆనంద్ అభిప్రాయపడుతున్నారు.

  యాంబీ ద్వారా గాలి, నీరు, నేలల్లో నాణ్యతను మదింపు వేస్తారు. ఒక ప్రదేశంలోని వాతావరణ పరిస్థితులపై పూర్తి వివరాలు అధ్యయనం చేస్తారు. ఫలానా ప్రదేశంలో వాయుకాలుష్యం ఏ స్థాయిలో ఉందో అలర్ట్ చేస్తారు. ఫలితంగా ఎయిర్ ప్యూరిఫైయర్స్ తయారీదారుల సేవల్లో , వ్యాపారాల్లో మెరుగుదలకు దోహదం చేస్తారు.

  ఇక ఢిల్లీ బేస్డ్ స్టార్టప్.. చక్ర్ ఇన్నోవేషన్స్ (Chakr Innovations) నిజంగానే చాలా ఇన్నోవేటివ్ గా ఆలోచించారు. ఐఐటీలో చదువుకున్న ఈ స్టూడెంట్స్ గ్రూప్ చక్ర్ షీల్డ్ అనే ప్రోడక్ట్ ను తయారు చేస్తుంది. ఇది జనరేటర్ల నుంచి, కన్వర్టర్ల నుంచి వెలువడే 90 శాతం బ్లాక్ కార్బన్స్ ని పీల్చుకుంటుంది. ఆ తరువాత ఆ వ్యర్థాలను ఇంక్, పెయింట్స్ రూపంలోకి మార్చి అనుబంధ ఉత్పత్తులను సైతం తయారు చేస్తోంది. ఢిల్లీలోని నానో క్లీన్ (Nano Clean) అనే మరో స్టార్టప్ కంపెనీ.. నాసో ఫిల్టర్స్ ని తయారు చేస్తోంది. ఈ ఫిల్టర్ ఎయిర్ పొల్యూటెంట్స్ ని మానవ శరీరం లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటుంది. అలాగే ఈ కంపెనీ ఏసీ ఫిల్టర్ ని కూడా తయారు చేయడం విశేషం. ఏసీని ఎయిర్ ప్యూరిఫైయర్ గా మార్చడం ఈ ఫిల్టర్ ప్రత్యేకత.

  ఇలాంటి కొత్త ఆవిష్కరణలకుతోడు గాలిని శుద్ధి చేసే చాలా ప్యూరిఫైయర్స్ వచ్చాయి. చాలా ప్యూరిఫైయర్ కంపెెనీలు 99 శాతం పొల్యూటెంట్స్ ని, ప్రమాదకరమైన వాయువులను, బ్యాక్టీరియా, వైరస్ వంటి వాటిని తొలగిస్తాయని.. అవసరమైన తేమ శాతాన్ని కూడా మెయిన్ టెయిన్ చేస్తాయని... అలర్జీకి కారణమయ్యే పూలు, మొక్కల నుంచి గాల్లోకి వ్యాపించే పుప్పొడి, పెంపుడు జంతువుల నుంచి వచ్చే స్రావాలను, బ్యాక్టీరియాను తమ ప్రోడక్ట్స్ విజయవంతంగా అడ్డుకుంటాయని, అలా తమ కంపెనీలు కలుషితం కానీ స్వచ్ఛమైన గాలిని అందజేస్తాయని ప్రచారం చేసుకోవచ్చు. మరికొన్ని కంపెనీలైతే తమ ప్యూరిఫైయర్స్ అలర్జిక్ రియాక్షన్స్, ఆస్త్మా అటాక్స్ నుంచి ప్రజల్ని కాపాడతాయని కూడా ప్రచారం చేసుకోవచ్చని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  టెక్నాలజీని విపరీతంగా వాడితే ప్రమాదమే
  స్టార్టప్ ల పేరుతో టెక్నాలజీని మరీ విస్తృతంగా వాడితే అది చెడు ఫలితాలే ఇస్తుందంటున్నారు ఫౌండేషన్ ఫర్ ఎకలాజికల్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా కు చెందిన గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ యెల్లపరెడ్డి. ఎయిర్ ఫిల్టర్ల తయారీ ఎక్కడికి వెళ్తుందంటే.. మరి కొద్దిరోజుల్లో మరో కంపెనీ వచ్చి మినీ సిలిండర్లు తయారుచేసి, తాము పరిశుభ్రమైన గాలి అందజేస్తామని, ప్రజలు దీన్ని వాడితే పూర్తి ఆరోగ్యంతో నిండునూరేళ్లు హాయిగా జీవించవచ్చని ఊదరగొట్టే అవకాశం ఉందని.. ఇలాంటి ప్రయోగాలు పర్యావరణానికి ఏమాత్రం మంచిది కాదని యెల్లపరెడ్డి అంటున్నారు. ఇలాంటి టెక్నాలజీ తాత్కాలికంగానే పనిచేస్తుంది తప్ప శాశ్వత పరిష్కారాలు చూపదని ఆయన అంటున్నారు. ఎయిర్ క్వాలిటీ డాటా ఇచ్చే స్టార్టప్ వల్ల ఉపయోగం ఉండొచ్చు.. ఎందుకంటే అలాంటి సమాచారం ప్రభుత్వం ఇవ్వడం లేదు కాబట్టి. అయితే మనం ప్రభుత్వ అలవాట్లను మార్చాలి తప్ప కొత్త వ్యాపార మార్గాలు కనుక్కోవడం కాదని ఆయన ఘంటాపథంగా చెబుతున్నారు.

  వాయు కాలుష్యం


  ఇక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ లోని సెంటర్ ఫర్ ఎకలాజికల్ సైన్సెస్ కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ టీవీ రామచంద్ర ఏమంటారంటే... అసలు ఎయిర్ ప్యూరిఫైయర్స్ అనే కాన్సెప్టే సరైంది కాదంటారు. విద్యుత్తును ఉపయోగించి పనిచేసే ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ అయినా గాలి కాలుష్యాన్ని తగ్గించడంలో సరైన పరిష్కారం కాదంటారు. ఈ ఎక్విప్ మెంట్స్ అన్నీ కూడా విద్యుత్తుతో పని చేస్తాయి కాబట్టి అవి ఇంట్లో గాలిని శుభ్రం చేస్తూ అదే స్థాయిలో కార్బన్ డయాక్సైడ్ ని కూడా తయారుచేసి బయటికి పంపిస్తాయి కదాని రామచంద్ర అంటారు. బెంగళూరులో విద్యుత్తు పరికరాల వాడకం ద్వారా ఇప్పటికే 14 శాతం కార్బన్ డయాక్సైడ్ అదనంగా ఉత్పత్తవుతోంది. ఇప్పుడీ స్టార్టప్ లు తయారు చేసే ఎయిర్ ప్యూరిఫైయర్స్ ద్వారా మరింత పెద్దమొత్తంలో కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలో చేరుతుంది. అందువల్ల కాలుష్యాన్ని అరికట్టే లక్ష్యాల సాధనలో ఇది సరితూగే పరిష్కారం కాదంటారు రామచంద్ర.

  చెట్లను మించిన పరిష్కారం లేదు
  సహజసిద్ధమైన, ప్రకృతిలో ఉచితంగా లభించే ఎయిర్ ఫిల్టర్లు అయిన చెట్లను పరిరక్షించడం, మొక్కల్ను పెంచడం మానేసి కాసుల కోసం కృత్రిమ ఎయిర్ ఫిల్టర్లను ఆశ్రయించడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని పర్యావరణ ఉద్యమకారుడు జగదీశ్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఈ విషయంలో సంప్రదాయ పద్ధతిని మించింది లేదని, ఎట్టిపరిస్థితుల్లో కూడా టెక్నాలజీ అనేది దానికి ప్రత్యామ్నాయం కానేకాదంటారు జగదీశ్ రెడ్డి. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద మార్కెట్ గా అవతరిస్తోంది. దీంతో మార్కెట్ వాటాపై కన్నేసిన అనేక వ్యాపార సంస్థలు, నూతన స్టార్టప్ లు.. ప్రజల్లో ఉండే భయాలను సొమ్ము చేసుకునేందుకు కొత్త మార్గాల్లో బిజినెస్ అవకాశాలను సృష్టించుకునేందుకు వెంపర్లాడుతున్నాయి. దీన్ని తక్షణమే ఆపాల్సిన అవసరాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.

  - కపిల్ కాజల్, 101 రిపోర్టర్స్

  (Author is freelance writer and a member of 101Reporters.com)
  First published: