పొడవాటి చారలు, గంభీరమైన చూపులు, నడిస్తే రాచ ఠీవీ... రాజసానికి పెట్టింది పేరు బెంగాల్ టైగర్. పులుల విషయంలో భారత్కు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది ఈ సుందర్బన్ అడవుల్లో బెంగాల్ పులులే. ఇవి జీవనం సాగించాలన్నా, ప్రశాంతంగా బతకాలన్నా సుందర్బన్ మాంగ్రూవ్ అడవులు సస్యశ్యామలంగా ఉండాలి. ఐతే... పర్యావరణం పాడవుతుండటం వల్ల నానాటికీ ఈ అడవులు అంతరించిపోతున్నాయి. సముద్ర మట్టం ఎత్తు పెరుగుతుండటంతో... ఇక్కడి బంకమట్టి నేలలు... సముద్రంలో కలిసిపోతున్నాయి. ఫలితంగా ఇక్కడ తిరిగే బెంగాల్ టైగర్లకు కష్టకాలం వచ్చి పడింది. తినడానికి ఆహారం లేక, నివసించేందుకు దట్టమైన అడవులు తగ్గిపోతుండటంతో... అవి దిక్కులేనివవుతున్నాయి.
ఇండియా-బంగ్లాదేశ్ మధ్య 10వేల చదరపు కిలోమీటర్లలో విస్తరించిన మాంగ్రూవ్ అడవులు ప్రపంచంలోనే అతిపెద్దవి. బెంగాల్ టైగర్కు ఇవి చక్కగా ఆవాసం కల్పిస్తున్నాయి. ప్రస్తుతం 4వేల పులులు మాత్రమే ఇక్కడున్నాయి. ప్రపంచంలో అతి పెద్ద పులులు ఇంత తక్కువ సంఖ్యలో ఉండటం విచారకరం. మాంగ్రూవ్ అడవుల్లో ఇవి అక్కడక్కడా మాత్రమే కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా సైంటిస్టులు, బంగ్లాదేశ్ ఇండిపెండెంట్ యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ షరీఫ్ ముకుల్ అంచనా ప్రకారం... 2070 నాటికి సుందర్బన్ అడవులు పూర్తిగా అంతరిస్తాయి.
కంప్యూటర్ సిమ్యూలేటర్ల ద్వారా సైంటిస్టులు సుందర్బన్ అడవులు ఎలా అంతరిస్తాయో లెక్కలు వేశారు. అడవులు అంతరిస్తే, వాటిలో తిరిగే జంతువుల సంఖ్య తగ్గిపోతుంది. అందువల్ల ఆ జంతువుల్ని వేటాడి తినే బెంగాల్ టైగర్ల సంఖ్య కూడా తగ్గిపోతుందని తేలింది. అడవుల దగ్గర్లో వేస్తున్న కొత్త రోడ్లు, పెరుగుతున్న వేటగాళ్ల దాడుల వల్ల అటు అడవులు, ఇటు పులుల సంఖ్యా తగ్గిపోతున్నాయి.
ఇప్పటికీ ఆశలున్నాయి. చట్టవ్యతిరేక వేటను అడ్డుకోవాలి. అడవుల నరికివేతను పూర్తిగా నిషేధించాలి. సముద్ర మట్టాలు పెరగకుండా పర్యావరణాన్ని రక్షించాలి. సుందర్బన్స్ లాంటి ప్రదేశం ప్రపంచంలో మరొకటి లేదు. బెంగాల్ టైగర్ లాంటివి బతకాలంటే అలాంటి అడవులు ఉండి తీరాలి.
Photos: దీపికా పదుకొనే లేటెస్ట్ హాట్ ఫోటోస్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tiger Attack, West Bengal