ఈశాన్య రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదాలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో ఇటీవల పశ్చిమ బెంగాల్, త్రిపుర మధ్య చెలరేగిన రాజకీయ ఘర్షణలు, వాటిపై మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాల్లో అల్లర్లు చోటుచేసుకోవడాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలో కీలక పరిణామం జరిగింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) బుధవారం నాడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)ని కలిశారు. త్రిపుర హింస, బెంగాల్ లో బీఎస్ఎఫ్ దళాల పరిధి పెంపు ఉపసంహరణ తదితర కీలక అంశాలను వారు చర్చించారు. అదే సమయంలో బెంగాల్ కు కేంద్రం ఇస్తానన్న రూ.1లక్ష కోట్ల విపత్తు నిధులనూ వెంటనే విడుదల చేయాల్సిందిగా మమత డిమాండ్ చేశారు. ప్రధానితో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడుతూ మమతా బెనర్జీ ఈ విషయాలను వెల్లడించారు.
బెంగాల్-త్రిపుర మధ్య ఘర్షణలకు బెంగాల్ అధికార బీజేపీనే కారణమని, తృణమూల్ కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ సాయోని ఘోష్‌ను త్రిపుర పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, టీఎంసీ నేతలను టార్గెట్ చేసుకుని మరీ త్రిపుర పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తుండటం వల్లే ఉద్రిక్తతలు పెరిగాయని ప్రధాని మోదీకి బెంగాల్ సీఎం మమత వివరించారు. దేశ సరిహద్దుల్ని కాపాడే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) అంటే టీఎంసీకి గౌరవం ఉందంటూనే, బీఎస్ఎఫ్ పరిధిని విస్తరించడం ద్వారా రాష్ట్రం హక్కులు కోల్పోతుందని, ఎన్నికల సమయంలో కూచ్ బెహార్ లో జరిగిన కాల్పుల ఉదంతంలో కేంద్ర బలగాల తప్పిదం ఉందని మమత వాదించారు. శాంతి భద్రతలు అనేవి రాష్ట్రాల పరిధిలోని అంశమని, బీఎస్ఎఫ్ పరిధిని పెంచడం సరికాదని ప్రధానికి వివరించినట్లు ఆమె చెప్పారు.
గతంలో బెంగాల్ భారీ వరదలను ఎదుర్కొని తీవ్రంగా నష్టపోయిందని, ఆ సమయంలో కేంద్రం వివిధ రూపాల్లో ప్రకటించిన రూ.96,605 కోట్లను తక్షణమే విడుదల చేయాలని మమత డిమాండ్ చేశారు. కాగా, తన ఢిల్లీ పర్యటనలో దీదీ.. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామిని కలవడం రాజకీయంగా కలకలం రేపింది. అయితే, ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎవరినైనా కలవొచ్చని, ఒక వేళ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కలిసి పనిచేయడానికి అఖిలేశ్ యాదవ్ ఆహ్వానిస్తే గనుక తప్పక వెళతాననీ మమత పేర్కొన్నారు. కాగా, తెలంగాణ సీఎం కేసీఆర్ కు అపాయింట్మెంట్ ఇవ్వని ప్రధాని నరేంద్ర మోదీ.. బెంగాల్ సీఎం మమతకు మాత్రం టైమివ్వడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mamata Banarjee, Pm modi, West Bengal