Bengal Assembly Elections 2021: బెంగాల్ దంగల్‌లో ఏడో దశ మొదలైంది. ఇవాళ 5 జిల్లాల్లోని 34 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. వీటిలో 6 నియోజకవర్గాలు దినజ్‌పూర్‌లో, 6 మాల్డాలో, 9 ముష్రీదాబాద్‌లో, 9 పశ్చిమ బర్దమాన్‌లో, 4 కోల్‌కతాలో ఉన్నాయి. నిజానికి కరోనా ఉంది కాబట్టి... 6, 7, 8 దశలను కలిపేసి ఒకే దశలో ఎన్నికలు జరపాలని ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ ఎన్నికల సంఘాన్ని కోరారు. కానీ ఈసీ అందుకు ఒప్పుకోలేదు. కరోనా ఉంది కాబట్టే... ఒకేసారి జరపట్లేదని తెలిపింది. ఐతే... ఇటు తృణమూల్ గానీ, అటు బీజేపీ గానీ... 6, 7 దశల్లో పెద్దగా ప్రచారం చెయ్యలేదు. మమతా బెనర్జీ ప్రచారం చెయ్యబోనని ముందే ప్రకటించారు. దానికి బదులుగా ఆమె మొన్న తారామాత ఆలయానికి వెళ్లి పూజలు చేసి... కరోనా వదిలిపోవాలని కోరారు. నేటి పోలింగ్‌లో 81.88 లక్షల మంది ఓటర్లు ఓటు వేస్తున్నారు. వీరిలో 39.87 లక్షల మంది మహిళలు ఉన్నారు. 11,376 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. 268 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో 37 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.
TMC, బీజేపీలు 34 సీట్లలో పోటీ పడుతుంటే, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, ఇండియన్ సెక్యులరిస్ట్ ఫ్రంట్ కూటమి... 'సంయుక్త మోర్చా' పేరుతో బరిలో ఉన్నాయి. ఈ రౌండ్‌లో 34 సీట్లలో కాంగ్రెస్ 18 సీట్లలో, సీపీఎం 12 సీట్లలో, ISF 4 సీట్లలో, RSP 3సీట్లలో, AIFB ఒక సీటులో పోటీ చేస్తున్నాయి. బహుజన సమాజ్ పార్టీ (BSP) నుంచి 25 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండటం విశేషం.
ముర్షీదాబాద్, దక్షిణ్ దినజ్‌పూర్, మాల్టా జిల్లాలో ముస్లిం జనాభా ఎక్కువ. బెంగాల్‌లో అంతగా అభివృద్ధి లేని ప్రాంతాలుగా ఇవి ఉన్నాయి. ఇవి కాంగ్రెస్ కంచుకోటలుగా ఉన్నాయి. ఐతే, అక్కడ ఈసారి అసదుద్దీన్ ఒవైసీ పార్టీ AIMIM, ఇండియన్ సెక్యులర్ ఫోర్స్ బరిలో ఉన్నాయి. అందువల్ల ఈ పార్టీలకు కొన్ని ఓట్లు వెళ్లేలా కనిపిస్తున్నాయి. ఈసారి ఉద్యోగాల కోసం యువత పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడానికి బీజేపీ గట్టిగానే ప్రయత్నించింది.
లూటీలు, కమిషన్లు, సిండికేట్ రాజ్ వంటి వాటికి తృణమూల్ కాంగ్రెస్ కేరాఫ్‌గా ఉందని బీజేపీ ఆరోపించింది. ప్రతి దశలోనూ ఆ పార్టీ ఇలాంటి ఆరోపణలతోనే ముందుకు వెళ్తోంది. ఈసారి బీజేపీ గెలిస్తే... బెంగాల్‌లో అవినీతే తృణమూల్‌ని ఓడించిందని అనుకోవచ్చు. ఇప్పటివరకూ సర్వేలు మాత్రం మరోసారి మమతా బెనర్జీయే గెలుస్తుందని అంటున్నాయి. అదే జరిగితే... బీజేపీ చేసిన ఆరోపణలు... ఊహాజనితాలే అనుకోవాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: Horoscope today 26-4-2021: నేటి రాశి ఫలాలు... ఏ రాశుల వారికి ఎలా ఉందంటే...
బెంగాల్‌లో ఈనెల 29న చివరిదైన 8వ విడత పోలింగ్ జరుగుతుంది. దాంతో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. మే 2న ఓట్లు లెక్కింపు ఉంటుంది. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5 State Elections, Mamata Banerjee, West Bengal Assembly Elections 2021