దేశమంతటా బరావాఫత్ (మిలాద్ ఉన్ నబీ) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముస్లింలు భక్తి శ్రద్ధలతో పండగను జరుపుకుంటున్నారు. ఐతే పండగ వేళ యూపీ (Uttar Pradesh)లో ఘోర ప్రమాదం జరిగింది. బహ్రెయిచ్ (Bahraich) జిల్లాలో విషాదం నెలకొంది. బరావాఫత్ (milad un nabi) ఊరేగింపులో.. హైటెన్షన్ విద్యుత్ లైన్ తగిలి.. ఆరుగురు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో లక్నోకు రెఫర్ చేశారు. ఆరుగురు మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటన నాన్పరా పోలీస్ స్టేషన్ పరిధిలోని భగ్గద్వా గ్రామంలో చోటుచేసుకుంది.
స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఊరేగింపు జరుగుతోంది. ఈ సమయంలో ఊరేగింపు బండిపై ఉన్న ఇనుప రాడ్.. 11 వేల వోల్ట్ల హైటెన్షన్ విద్యుత్ వైర్లను తాకింది. విద్యుత్ షాక్ కొట్టడంతో.. ఊరేగింపులో పాల్గొన్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. చనిపోయిన వారి మృతదేహాలతో పాటు గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రికి షిఫ్ట్ చేశారు. క్షతగాత్రుల పరిస్థితిపై ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనతో భగ్గద్వా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పండగ పూట తమ వారు చనిపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
బహ్రెయిచ్ జిల్లాలో మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు సందర్భంగా జరిగిన ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం పట్ల ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Up news, Uttar pradesh, Yogi adityanath