గంగా నదిలో కొట్టుకొచ్చిన చెక్క పెట్టె.. తెరిచి చూస్తే అమ్మవారితో పాటు చిన్నారి.. అచ్చం సీతమ్మలాగే..

గంగానదిలో లభ్యమైన పెట్టె, అందులో చిన్నారి

చెక్క పెట్టెలో కనక దుర్గ అమ్మవారితో పాటు చాలా మంది ఇతర దేవతల ఫొటోలు ఉన్నాయి. అంతేకాదు ఓ కాగితంలో చిన్నారి జాతక చక్రం కూడా లభ్యమయింది. దాని ప్రకారం.. ఆ పాప వయసు 21 రోజులు. మే 25న జన్మించింది. చిన్నారి జనన చార్టులో ఆమె పేరు 'గంగా' అని రాసి ఉంది

 • Share this:
  హిందూ పురాణాల ప్రకారం... గంగమ్మ ఒడిలో కర్ణుడు దొరికారు. సీతమ్మ కథ కూడా ఇలానే ఉంటుంది. మిథిల రాజ్యంలో రైతులు పొలం దున్నుతుండగా ఓ పెట్టెలో పాప కనిపిస్తుంది. జనక మహారాజు ఆమెనే సీతగా పెంచుకున్నాడని కొందరు చరిత్ర కారులు చెబుతున్నారు. ఐతే ఇప్పుడు అచ్చం ఇలాంటి ఘటన యూపీలో జరిగింది. గంగా నదిలో ఓ చెక్క పెట్టె కొట్టుకొచ్చింది. ఆ పెట్టె గంగా నదిలో పడవ నడుపుకునే ఓ వ్యక్తి కంటపడింది. దానిని తెరిచి చూస్తే అందులో ఓ చిన్నారి ఉంది. సినిమాలు..పురాణాలను.. తలపిస్తున్న ఈ ఘటన యూపీలోని ఘాజిపూర్‌లో చోటుచేసుకుంది. దాద్రి ఘాట్ సమీపంలలో గంగానదిలో పడవ నడిపే వ్యక్తికి  బాక్స్ కనిపించింది. అందులో నుంచి ఏడుపు శబ్ధాలు వినిపించడంతో.. అతడు దగ్గరకు వెళ్లి ఆ పెట్టెను తీసుకున్నాడు. అనంతరం ఒడ్డుకు వచ్చి తెరి చూడగా..ఎర్రని వస్త్రం, అమ్మవారి ఫొటోలు ఉన్నాయి. ఐతే వాటితో పాటు ఓ చిన్నారి కూడా ఉండడంతో అతడు షాక్ తిన్నాడు.

  చెక్క పెట్టెలో కనక దుర్గ అమ్మవారితో పాటు చాలా మంది ఇతర దేవతల ఫొటోలు ఉన్నాయి. అంతేకాదు ఓ కాగితంలో చిన్నారి జాతక చక్రం కూడా లభ్యమయింది. దాని ప్రకారం.. ఆ పాప వయసు 21 రోజులు. మే 25న జన్మించింది. చిన్నారి జనన చార్టులో ఆమె పేరు 'గంగా' అని రాసి ఉంది. మూడు వారాల క్రితం పుట్టిన పాపను.. అమ్మవారి ఫొటోలతో పాటు బాక్స్‌లో పెట్టి నదిలో విసిరేయడం.. అది ఓ పడవ నడుపుకునే వ్యక్తికి దొరకడం.. చర్చనీయాంశమయింది. ఐతే గంగమ్మ తల్లే తనకు ఈ బిడ్డను ఇచ్చిందని పడవ నడుపుకునే వ్యక్తి మురిసిపోయాడు. తానే బిడ్డను పెంచుకుంటానని చెప్పాడు. కానీ స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. అతడి ఇంటికి వెళ్లి ఆరాతీశారు. అనంతరం చిన్నారిని ప్రభుత్వ ఆశాజ్యోతి కేంద్రానికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. పాప ఆరోగ్యంగానే ఉందని చెప్పారు. ఐతే పాప తల్లిదండ్రులు ఎవరు? పెట్టెలో పెట్టి నదిలో ఎందుకు వదిలివేశారు? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఆమె కుటుంబ సభ్యులను వెతికే పనిలో ఉన్నారు.

  చెట్టే అతని నివాసం.. వీడియో చూడండి

  మూడ‌నమ్మకాలు లేదా తాంత్రిక కర్మల కోసమే ఇలా చేసి ఉండవచ్చన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఐతే చిన్నారి తల్లిదండ్రులు దొరికితే తప్ప.. ఈ చిన్నారి వ్యవహారంపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. మరోవైపు ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. చిన్నారిని పెంచి పెద్ద చేసే బాధ్యతతో ప్రభుత్వమే తీసుకుంటుందని చెప్పారు. గంగమ్మ ఒడిలో పాపను కాపాడిన వ్యక్తికి ఆర్థిక సాయం చేస్తామని.. ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. మొత్తంగా ఈ వ్యవహారం మాత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయింది. నవజాత శిశువును అంత కర్కశంగా పెట్టెలో పెట్టి నదిలో వదిలేస్తారా? అని చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published: