Babri Masjid Demolition Case Verdict: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తీర్పు వెలువడింది. సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్ కే యాదవ్... 2000 పేజీల ఆర్డర్ కాపీ తీర్పును వెలువరించారు. ఈ కేసులో నిందితులంతా నిర్దోషులే అని తీర్పు వెలువరించారు. కూల్చివేత పథకం ప్రకారం జరగలేదని తేల్చారు. కూల్చివేత పథకం ప్రకారం జరిగింది అనేందుకు ఆధారాలు లేవని జడ్జి తెలిపారు. కూల్చివేతకు ఎవరూ రెచ్చగొట్టే ప్రసంగాలు చెయ్యలేదనీ, కుట్రపూరితంగా వ్యవహరించలేదని తెలిపారు. బాబ్రీ మసీదును కూల్చివేేసింది కరసేవకులు కాదనీ... సంఘ విద్రోహ శక్తులు ఆ పని చేశారని తెలిపారు. ఈ కూల్చివేత కేసును కొట్టివేశారు. దీంతో నిందితులందరికీ ఉపశమనం లభించినట్లైంది. ఈ కేసులో 48 మంది నిందితుల్లో 16 మంది చనిపోగా... ఆరోపణలు ఎదుర్కొన్న, బతికివున్న 32 మంది కోర్టుకు హాజరు కావాలని కోరగా... ఐదుగురు మాత్రమే కోర్టు రూం నెంబర్ 18లో ఉన్నారు. మిగతావారు బయట లాబీలో ఉన్నారు. ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జ్యోషితోపాటూ... కరోనాతో బాధపడుతున్న ఉమాభారతి... కోర్టుకు హాజరుకాలేదు. అద్వానీ, జ్యోషీ... వర్చువల్ రూపంలో... ఆన్‌లైన్‌లో హాజరయ్యేందుకు అనుమతి పొందారు.
All accused in Babri Masjid demolition case acquitted by Special CBI Court in Lucknow, Uttar Pradesh. pic.twitter.com/9jbFZAVstH
— ANI (@ANI) September 30, 2020
1992 డిసెంబర్ 6న కరసేవకులు... అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చేశారు. దాదాపు 28 ఏళ్లు గడిచిపోయాయి. ఎప్పుడో రావాల్సిన తీర్పు. దర్యాప్తు, విచారణ... నత్తలతో పోటీ పడుతూ సాగడంతో 28 ఏళ్లు గిడిచిపోయాయి. లక్నోలోని ఓల్డ్ హైకోర్టు బిల్డింగ్‌లో ఓ మూల ఈ కేసు విచారణ జరిగింది. 2017 ఏప్రిల్ 19న సుప్రీంకోర్టు... ఈ కేసు విచారణను రోజువారీ చేపట్టాలని ఆదేశించింది. ఈ కేసును విచారిస్తున్న జడ్జిని ట్రాన్స్‌ఫర్ చేయవద్దని ఆదేశించింది. ఇప్పటికి విచారణ పూర్తై... తీర్పు వెలువడింది.
బాబ్రీ మసీదు కూల్చివేత కేసు పూర్వాపరాలు:
అయోధ్యలో రామాలయం ఉన్న ప్రదేశంలో... దాన్ని కూల్చి... బాబ్రీమసీదును నిర్మించారనే అంశంతో... ఆ మసీదును కూల్చేయాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. 1992లో దేశవ్యాప్తంగా కరసేవకులు అయోధ్యకు తరలివచ్చారు. ఒక్కసారిగా బాబ్రీ మసీదును చేరారు. డిసెంబర్ 6న మసీదు ధ్వంసమైంది. దేశం మొత్తం ఆశ్చర్యంగా చూసింది. ఆ సమయంలో... పెద్ద ఎత్తున దేశమంతా మత ఘర్షణలు జరిగాయి. వాటిలో 1800 మంది చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
2019 నవంబర్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన అయోధ్య రామ జన్మభూమి స్థలం కేసూ... ఈ బాబ్రీ మసీదు కూల్చివేత కేసూ... రెండూ వేర్వేరు. ఆ కేసులో రామజన్మభూమిలో రామాలయం కట్టుకోవచ్చనే తీర్పు రావడం... దానికి ఈ ఏడాది ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్రమోదీ భూమిపూజ చేయడం అన్నీ జరిగాయి.
ఈ కేసులో పోలీసులు 2 FIRలు రాశారు. ఒక దాంట్లో లక్షల మంది కరసేవకులకు వ్యతిరేకంగా కేసు రాశారు. రెండో దాంట్లో... 8 మంది రాజకీయ నేతలకు వ్యతిరేకంగా కేసు రాశారు. ఆ 8 మంది ఎవరంటే... బీజేపీకి చెందిన ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జ్యోషీ, ఉమా భారతి, వినయ్ కటియార్... విశ్వ హిందూ పరిషత్‌కి చెందిన అశోక్ సింఘాల్, గిరిరాజ్ కిషోర్, విష్ణు హరి దాల్మియా, సాథ్వీ రితంభర. వీరిలో దాల్మియా, గిరిరాజ్ కిషోర్, సింఘాల్ చనిపోయారు. ఉమా భారతికి కరోనా రావడంతో... రుషికేష్ ఎయిమ్స్‌లో చేరారు. మిగతా వారు రేపు కోర్టుకు హాజరయ్యే ఛాన్సుంది.
ఈ కూల్చివేత అంశంపై మరో 47 FIRలు కూడా నమోదయ్యాయి. కొంత మంది జర్నలిస్టులపై దాడులు జరిగిన కేసులు కూడా వీటిలో ఉన్నాయి. కరసేవకులకు సంబంధించిన కేసును సీబీఐకి అప్పగించారు. నేతలకు సంబంధించిన కేసును సీఐడీకి అప్పగించారు. ఈ గందరగోళమంతా ఏంటని... 1993 ఆగస్టు 27న అన్ని కేసుల్నీ యూపీ ప్రభుత్వం సీబీఐ చేతిలో పెట్టింది.
1993 అక్టోబర్ 5న సీబీఐ... మొదటి ఛార్జిషీట్ ఫైల్ చేసింది 40 మందికి వ్యతిరేకంగా. వాళ్లలో ఆ 8 మంది నేతలూ ఉన్నారు. రెండేళ్ల దర్యాప్తు తర్వాత మరో చార్జిషీట్‌ని 1996 జనవరి 10న దాఖలు చేసింది. బాబ్రీమసీదు కూల్చివేతు ఓ భారీ ప్లాన్, ఓ కుట్ర జరిగిందని చెప్పింది. ఆ తర్వాత సీబీఐ... క్రిమినల్ నేరపూరిత కుట్ర జరిగిందంటూ... మరో 9 మంది పేర్లను ఇందులో చేర్చింది. వారిలో శివసేన నేతలు బాల్ థాక్రే, మోరేశ్వర్ సావే కూడా ఉన్నారు.
1997లో లక్నో మేజిస్ట్రేట్... 48 మంది కుట్రకు పాల్పడినట్లు తెలిపింది. వారిలో 34 మంది అలహాబాద్ హైకోర్టుకు వెళ్లి... కింది కోర్టు తీర్పుపై స్టే తెచ్చుకున్నారు. ఈ స్టే కారణంగా... ఈ కేసు ముందుకు సాగలేదు. 2001 ఫిబ్రవరి 12న అలహాబాద్ హైకోర్టు... అద్వానీ, జ్యోషి, ఉమా భారతి, యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్, ఇతరులపై ఉన్న క్రిమినల్ కుట్ర అభియోగాలను కొట్టేసింది. అంతే సీబీఐ గాలి తీసిన బుడగలా అయిపోయింది.
మూడు నెలల తర్వాత... మే 4న... లక్నో ప్రత్యేక కోర్టు... రెండు కేసుల్నీ వేర్వేరుగా చేసి... 21 మంది నిందితుల్ని రాయ్ బరేలీలో, 27 మంది నిందితుల్ని లక్నోలో విచారించాలని డిసైడైంది. 2010 వరకూ రెండు కేసులపై... రెండు వేర్వేరు కోర్టుల్లో విచారణ జరిగింది. దీనిపై 2011లో సీబీఐ... సుప్రీంకోర్టుకు వెళ్లడంతో... సుప్రీంకోర్టు... రెండు కేసుల్నీ... లక్నో ప్రత్యేక కోర్టులోనే విచారించాలని చెప్పింది.
2017 ఏప్రిల్ 19న సుప్రీంకోర్టు... అద్వానితోపాటూ... మిగతా వారిపైనా నేరపూరిత కుట్ర కోణంలో విచారణ జరపాలని చెప్పింది. దాంతో గాలిపోయిన బుడగలా మారిన సీబీఐ మళ్లీ గాలి నింపిన బెలూన్ లా మారింది. దాదాపు 40వేల మంది ప్రత్యక్ష సాక్షుల్ని కోర్టు విచారించింది. వాళ్లు చెప్పిన మాటలే సాక్ష్యాలుగా తీసుకుంది. పోలీసులు ఇచ్చినవీ ఉన్నాయి. ఛానెళ్లు 100కు పైగా క్యాసెట్లను సమర్పించాయి. ఇంతలా దర్యాప్తు జరిగిన తర్వాత తీర్పు ఇప్పుడు వెలువడింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Babri masjid