అయోధ్యంలో రామ మందిర నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్న వేళ.. బాబ్రీ మసీదు కూల్చివేత కేసు తెరపైకి వచ్చింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రక్రియ జరిగింది. జోషి వాంగూల్మాన్ని సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎస్‌కే యాదవ్ తీసుకున్నారు. ఇక బాబ్రీ కేసులో బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ వాంగ్మూలాన్ని కూడా శుక్రవారం నమోదు చేసే అవకాశముంది.
బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో మొత్తం 32 మంది నిందితులుగా ఉన్నారు. సీఆర్‌పీసీలోని 313 సెక్షన్ కింద ప్రస్తుతం నిందితుల వాంగ్మూల నమోదు ప్రక్రియ జరుగుతోంది. ఆగస్టు 31 లోపు కేసు విచారణను పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రత్యేక కోర్టు ప్రతిరోజు విచారణ జరుపుతోంది.
మరోవైపు అయోధ్యలో రామమందిర నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఆగస్టు 5న ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం జరగనుంది. అందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో ఎక్కువ మందిని ఆహ్వానించకూడదని శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నిర్ణయించింది.కేవలం 150 మంది అతిథులు సహా 200 మంది మాత్రమే కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించింది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కార్యక్రమానికి ఆహ్వానించినట్లు ట్రస్టు కోశాధికారి స్వామి గోవింద్ దేవ్‌గిరి తెలిపారు.
భూమిపూజకు ముందు మందిరంలోని రాముడి విగ్రహానికి ప్రధాని మోదీ పూజ చేస్తారు. హనుమాన్ గిరి ఆలయంలోని హనుమంతుని పూజలోనూ పాలుపంచుకుంటారు. ఇక అయోధ్య రామమందిరం ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి, వినయ్ కతియార్‌లకు ఆహ్వానం పంపుతామని గతంలో ఓ ట్రస్టు అధికారి ఒకరు తెలిపారు. ఐతే వారి రాకపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఇక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆరెస్సెస్ చీఫ్ మహేష్ భగవత్‌ను ఆహ్వానిస్తున్నట్లు మరో అధికారి వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ayodhya, Babri masjid, LK Advani