Ayodhya Verdict Review : మన దేశంలో న్యాయవ్యవస్థలో స్వేచ్ఛ ఎక్కువ. ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు కూడా ఒక్కోసారి రివ్యూకి వెళ్లగలదు. ముస్లిం పర్సనల్ లా బోర్డు రివ్యూకి వెళ్తే ఏమవుతుందో తెలుసుకుందాం.
Ayodhya Verdict Review :అయోధ్య కేసులో ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు స్పష్టంగా లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB). తీర్పు 1000 పేజీలకు పైగా ఉండటంతో... అది క్లియర్గా లేదంటోంది ముస్లిం పర్సనల్ లా బోర్డు. దీనిపై సమీక్ష (రివ్యూ)కి వెళ్తామని తెలిపింది. ఐతే... ఎప్పుడు వెళ్లేదీ డేట్ మాత్రం చెప్పలేదు. ఐతే... డిసెంబర్ 9న రివ్యూ పిటిషన్ వేస్తారని సమాచారం. లక్నోలో దీనిపై సమావేశం జరిగింది. ముస్లిం పెద్దలు చర్చించుకున్నారు. ఆ తర్వాత రివ్యూకి వెళ్లబోతున్నట్లు జమైత్ ఉలేమా ఎ హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ తెలిపారు. రివ్యూకి వెళ్తే... తీర్పు తమకు అనుకూలంగా వస్తుందనే ఆలోచన లేకపోయినా... మసీదు నిర్మాణానికి 5 ఎకరాల స్థలాన్ని కేటాయించడాన్ని వ్యతిరేకించాలనుకుంటున్నట్లు వివరించారు.
రివ్యూ పిటిషన్ వేస్తే :రివ్యూ పిటిషన్ వేస్తే... దాన్ని సుప్రీంకోర్టు సమర్థించవచ్చు లేదా... కొట్టిపారేసే అవకాశాలూ ఉన్నాయి. సమర్థిస్తే మాత్రం... ఏడుగురు సభ్యుల అత్యున్నత ధర్మాసనం అయోధ్య కేసును విచారించే అవకాశాలుంటాయి. అదే జరిగితే... ఐదుగుగు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై ఏడుగురు సభ్యుల ధర్మాసనం స్టే విధించే అవకాశాలుంటాయి. అదే జరిగితే... రామాలయం నిర్మాణం చేపట్టాలనుకుంటున్న ట్రస్టులకు అది ఇబ్బందికర నిర్ణయమే అవుతుంది. పనులన్నీ ఆగిపోయి... యథాతథ స్థితి కొనసాగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏడుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు ఎప్పుడిస్తుందన్నది మరో తేలాల్సిన అంశం. ఆ తీర్పు నెలల్లోనే వస్తుందా, ఏళ్లు పడుతుందా అన్నది ఇప్పుడే చర్చించుకోవడం కరెక్టు కాకపోవచ్చు.
ఈ కేసులో సుప్రీంకోర్టు నవంబర్ 9న ఇచ్చిన తీర్పును ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు స్వాగతించింది. తాము రివ్యూ పిటిషన్ వెయ్యట్లేదని చెప్పింది. తాజాగా ముస్లిం లా బోర్డు రివ్యూ పిటిషన్ అంశాన్ని సీనియర్ అడ్వకేట్ రాజీవ్ ధవన్ చూసుకోబోతున్నారు. సమస్యేంటంటే... షరియా చట్టం ప్రకారం మసీదు భూమి అల్లాకు చెందినది అని, దానిని ఎవరూ మరొకరికి ఇవ్వలేరన్నది ముస్లిం లా బోర్డు అభిప్రాయంగా తెలుస్తోంది. మసీదు నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే ఐదు ఎకరాల స్థలాన్ని ముస్లిం లా బోర్డు తిరస్కరించబోతోంది. ఒకవేళ రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేస్తే... అప్పుడు ముస్లిం లా బోర్డు ఐదు ఎకరాల స్థలాన్ని తీసుకున్నా, తీసుకోకపోయినా... చేసేదేమీ ఉండదన్నది న్యాయనిపుణుల మాట. ఓవరాల్గా రివ్యూకి వెళ్లాలనే నిర్ణయంపై మాత్రం మళ్లీ దేశమంతా చర్చ జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.