ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అయోధ్య కేసు విచారణ... నిమిషం పాటు జరిగింది. కేవలం 60 సెకన్లలోపే కేసు విచారణను పదో తేదికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. అయోధ్య కేసుకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై చీఫ్ జస్టీస్ రంజన్ గగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. అయితే ఎలాంటి వాదనలు చేపట్టకుండానే కేసు విచారణను జనవరి 10కి వాయిదా వేసింది.
ఈ కేసు విచారణ కోసం ఈ నెల 10న కొత్త బెంచ్ ఏర్పాటు చేయనున్నట్టు జస్టిస్ రంజన్ గొగోయ్ పేర్కొన్నారు. విచారణ ప్రక్రియపై నూతన ధర్మాసనమే నిర్ణయం తీసుకుంటుందన్నారు. తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. దీంతోపాటు అయోధ్య కేసుపై అత్యవసర విచారణ చేపట్టాలని హరినాథ్ అనే న్యాయవాది నవంబర్ 2018లో వేసిన పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించింది. అయోధ్య కేసుపై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు ఇంతకు ముందే తిరస్కరించిన సంగతి అందరికీ తెలిసిందే.
అయోధ్య కేసుకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై జనవరి మొదటివారంలో విచారణ చేపడతామని. ఏ బెంచ్ విచారణ చేస్తుందో అప్పుడు చెబుతామని గతేడాది అక్టోబర్ 29న సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే కేసు ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ముందుగా విచారణ చేపట్టాలని అఖిల భారత హిందూ మహాసభ (ఏబీహెచ్ఎం) కోరినా కోర్టు అందుకు తిరస్కరించింది. అలాగే కేసును ఐదుగురు జడ్జీల విస్తృత ధర్మసనానికి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్‌ను ముగ్గురు జడ్జీల ధర్మాసనం 2:1 మెజార్టీతో సెప్టెంబర్ 27న తిరస్కరించింది.
అయోధ్య రామమందిర నిర్మానం, బాబ్రీ మసీదుకు దాఖలైన కేసులకు సంబంధించి 2001ల అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. వివాదాస్పద 2.7 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్‌బోర్డ్, నిర్మోహి అఖారా, రామలల్లా సంస్థలకు సమానంగా పంచాలని తీర్పులో పేర్కొంది. అయితే అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే కేసు విచారణను మాత్రం జనవరి మొదటివారంలో ప్రారంభిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బెంచ్‌ను కూడా అప్పుడే నిర్ణయిస్తామని పేర్కొంది
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.