ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)కు చెందిన ఓ రైతు రెవెన్యూ అధికారులకు వింత కంప్లైంట్ ఇచ్చాడు. ఈసారి వర్షాలు పడకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, ఇందుకు వరుణ దేవుడైన ఇంద్రుడిపై చర్యలు తీసుకోవాలంటూ లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశాడు. దీంతో అధికారులు ఆశ్చర్యపోయారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రెవెన్యూ(Revenu) అధికారులు సంపూర్ణ సమాధాన్ దివస్ (Sampurna Samadhan Divas) కార్యక్రమంలో భాగంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటారు. ఇది ఎప్పుడూ జరిగేదే. మూడు రోజుల క్రితం అంటే శనివారం గోండా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా కల్నల్‌గంజ్ (Colonelganj) తహసిల్దార్ నరసింహ నారాయణ్ వర్మకు ఝాల గ్రామానికి చెందిన సుమిత్ కుమార్ యాదవ్ అనే రైతు ఇంద్ర దేవుడిపై ఫిర్యాదు చేశాడు.
"అయ్యా, కొన్ని నెలలుగా మా జిల్లాలో వానలు కురవడం లేదు. కరువు తాండవించడం వల్ల ప్రజలు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు, జంతువులు, రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. నెలల పాటు వానలు కురిపించని ఇంద్రదేవుడిపై తగిన చర్య తీసుకోవాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను" అని సుమిత్ రాశాడు.
ఫిర్యాదు అందుకున్న తహసిల్దార్ దానిని చదవకుండానే తగిన చర్యలు తీసుకోవాలంటూ ‘అగ్రాసరిత్’ (Forwarded) అనే ఓ ముద్ర వేసి జిల్లా మెజిస్ట్రేట్‌కి పంపించేశారు. ఈ విషయం కాస్త బయటికి పొక్కడంతో పాలక యంత్రాంగం కనీసం ఫిర్యాదు కూడా చదవకుండా ఈ స్థాయిలో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడం సిగ్గుచేటు అని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ఈ ఫిర్యాదు ఏంటి? ఇందులో ఏం రాశారు? ఇది ఏ విభాగానికి పంపించాలని? అనే విషయాలను కూడా తెలుసుకోకుండా తహసిల్దార్ ప్రవర్తించడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. ఈ కంప్లైంట్‌కు సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ కంప్లైంట్‌లో తహశీల్దార్ సంతకం, స్టాంపు కూడా ఉన్నాయి.
ఈ వ్యవహారం మొత్తం స్థానికంగా ప్రభుత్వ అధికారులను నవ్వుల పాలు చేసింది. దీంతో ఆగ్రహించిన కలెక్టర్ డా.ఉజ్వల్ కుమార్ తహసిల్దార్‌పై విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నామని కలెక్టర్ అన్నారు. కేసు విచారణ నిమిత్తం చీఫ్ రెవెన్యూ ఆఫీస్ (CRO) జయ యాదవ్‌కు అప్పగించినట్లు తెలిపారు. విచారణ కోసం యాదవ్ కల్నల్‌గంజ్ చేరుకోనున్నారు.
అయితే సదరు తహసిల్దార్ ఈ ఫిర్యాదు గురించి స్పందించారు. "ఈ కంప్లైంట్ చూసి నేను షాక్ అయ్యా. ఇది ఫోర్జరీ చేశారు. అసలు అలాంటి ఫిర్యాదు నా వద్దకు రానే లేదు. ఆ ఫిర్యాదుపై కనిపించే ముద్ర నకిలీది. సంపూర్ణ సమాధాన్ దివస్‌లో వచ్చిన ఫిర్యాదులు సంబంధిత విభాగాలకు నామినేట్ చేస్తాం. ఈ ఫిర్యాదులు ఏ ఇతర కార్యాలయాలకు పంపించం. ఇదంతా ఎవరో కావాలనే పుట్టించారు. దీనిపై విచారణ జరుగుతోంది" అని చాలా సింపుల్ గా సమాధానం ఇచ్చారు. చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ ఎంక్వయిరీ చేసి ఏం రిపోర్ట్ ఇస్తారో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rain alert, Shocking complaint, Uttar pradesh, Yogi adityanath