Bird Flu: పెరుగుతున్న బర్డ్ ఫ్లూ వ్యాధి భయాలు.. చికెన్, గుడ్లు తినకూడదా? నిపుణులేమంటున్నారు..?

ప్రతీకాత్మక చిత్రం

Bird Flu: ప్రస్తుతం బర్డ్ ఫ్లూ వల్ల పక్షులు చనిపోతున్నాయని తెలిసినప్పటి నుంచి గుడ్లు, చికెన్‌ తీసుకోవాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఈ వ్యాధికి కారణమవుతున్న H5N8 వైరస్ స్ట్రెయిన్ మనుషులకు ప్రమాదకరంగా మారే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని ఆరాతీసేవారి సంఖ్య పెరుగుతోంది.

  • News18
  • Last Updated :
  • Share this:
ఒకవైపు ప్రజలు కరోనా మహమ్మారితో భయపడుతుంటే... మరోవైపు కొత్తగా బర్డ్‌ ఫ్లూ (Bird flu) విజృంభిస్తోంది. కరోనా వైరస్‌ బారిన పడకుండా కాపాడుకోవడానికి రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే ఆహారం తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో గత కొన్ని నెలలుగా గుడ్లు, చికెన్, మాంసం వినియోగం బాగా పెరిగింది. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ వల్ల పక్షులు చనిపోతున్నాయని తెలిసినప్పటి నుంచి గుడ్లు, చికెన్‌ తీసుకోవాలంటే ప్రజలు భయపడుతున్నారు. బర్డ్‌ ఫ్లూకు కారణమవుతున్న H5N8 వైరస్ స్ట్రెయిన్ మనుషులకు ప్రమాదకరంగా మారే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని ఆరాతీసేవారి సంఖ్య పెరుగుతోంది. దీని వ్యాప్తిని అరికట్టడానికి కేరళలో కోళ్లు, బాతులను చంపాలని ప్రభుత్వం ఆదేశించింది.

కాగా ఈ వైరస్‌ వ్యాప్తి గురించి పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు కూడా ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో కోడి మాంసం, గుడ్ల వినియోగంపై రాష్ట్రాలు మార్గదర్శకాలను రూపొందించాయి. ఈ విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం గతంలో కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది.

ప్రమాదం లేదంటున్న WHO
గుడ్లు, చికెన్‌, ఇతర పౌల్ట్రీ ఉత్పత్తులను సరిగ్గా ఉడికించి తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO), ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గతంలో వెల్లడించాయి. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను వివిధ దేశాల నేషనల్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ విభాగాలకు తెలియజేశాయి. కానీ ప్రస్తుతం కొన్ని రాష్ట్రల్లో బర్డ్ ఫ్లూ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇలాంటి వైరస్ సోకిన పక్షుల మాంసాన్ని, గుడ్లను మాత్రం తీసుకోకూడదు. కానీ వైరస్ ప్రమాదం లేని, ఇప్పటి వరకు బర్డ్ ఫ్లూ బయటపడని పౌల్ట్రీ ఉత్పత్తులను ఎప్పటిలాగే తీసుకోవచ్చు. వీటివల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదు. కోళ్లు, బాతులు, టర్కీ కోడి, గిన్నెకోడి.. వంటి పక్షుల మాంసాన్ని కనీసం 70 డిగ్రీల సెల్సియస్, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఉడికిస్తే వైరస్‌, ఇతర సూక్ష్మ క్రిములు నశిస్తాయి. అందువల్ల బర్డ్‌ ఫ్లూ బయటపడ్డ ప్రాంతాల్లోని ప్రజలు ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద పౌల్ట్రీ ఉత్పత్తులను ఉడికించి తీసుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

జాగ్రత్తలు తీసుకోవాలి...
బర్డ్ ఫ్లూ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో, ఈ వైరస్ బయటపడ్డ ప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. వ్యాధిని గుర్తించిన పౌల్ట్రీ పరిశ్రమల నుంచి ఉత్పత్తులను ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. పచ్చి గుడ్లను, సరిగా ఉడికించని మాంసాన్ని తినకూడదు. మాంసాన్ని కట్ చేయడానికి, కూరగాయలు కోయడానికి వేర్వేరు చాపింగ్ బోర్డులను, కత్తులను, ప్లేట్లను, పాత్రలను వాడాలి. లేదంటే పచ్చి మాంసంలో ఉండే బాక్టీరియా, వైరస్‌లు ఇతర పదార్థాలకు వ్యాపించే అవకాశం ఉంది. వండిన, తినడానికి సిద్ధంగా ఉన్న పదార్థాల నుంచి మాంసాన్ని దూరంగా ఉంచాలి. మాంసాన్ని ముట్టుకున్న తరువాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. చికెన్, ఇతర పౌల్ట్రీ ఉత్పత్తులు, మాంసాన్ని తప్పకుండా 70 డిగ్రీలు, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉడికించాలి.
Published by:Srinivas Munigala
First published: