టెన్త్ క్లాస్ పరీక్షల్లో (10th Class Exams) ఒకరో ఇద్దరో విద్యార్థులు ఫెయిల్ అవడం చూస్తుంటాం. కొన్ని స్కూళ్లల్లో వారి సంఖ్య 10-20 వరకు ఉంటుంది. కానీ స్కూల్లో ఉన్న టెన్త్ క్లాస్ విద్యార్థులంతా ఫెయిల్ అయ్యారంటే నమ్ముతారా? ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. కానీ అసోం (Assam Schools)లో మాత్రం ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 34 స్కూళ్లలో ఇలాంటి ఫలితాలే వచ్చాయి. ఏ ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. ఈ క్రమంలోనే అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెన్త్ ఫలితాలు ఆశించిన విధంగా లేకపోవడంతో.... రాష్ట్రవ్యాప్తంగా 34 పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించింది.
భారత్ పై దాడిచేయడానికి 30 వేల సుపారీ.. బార్డర్ వద్ద పాక్ ఉగ్రవాది అరెస్టు
అసోం ప్రభుత్వం ఇప్పటికే గౌహతిలోని 16 ప్రభుత్వ రంగ పాఠశాలలను మూసివేసింది. ఇప్పుడు మరో 34 పాఠశాలలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ పాఠశాలలన్నింటిలో 2022 హైస్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ పరీక్షలో కనీసం ఒక్క విద్యార్థి కూడా ఉత్తీర్ణత సాధించలేదు. ఈ క్రమంలోనే ఆయా స్కూళ్లను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
'టైమ్స్ ఆఫ్ ఇండియా' నివేదిక ప్రకారం... కన్సాలిడేషన్ ప్రక్రియ కారణంగా అసోంలో ఇప్పటికే చాలా పాఠశాలలు మూసివేయబడ్డాయి. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడం, ఫలితాలు సరిగా సాధించని కారణంగా... రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 1,000కి పైగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను విద్యాశాఖ మూసివేసింది. విలీనం పేరుతో పలు విద్యాసంస్థలను పక్క పాఠశాలలతో ముడిపెట్టారని విద్యార్థులు, తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారు. కొన్ని పాఠశాలలను మారుమూల విద్యాసంస్థలతో అనుసంధానం చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. స్కూళ్ల విలీనంపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఐనప్పటికీ.. 30 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలల మూసివేతపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. జిల్లా, మండల స్థాయిలో 30 మందిలోపు విద్యార్థులున్న సంస్థల జాబితా పంపాలని విద్యాశాఖ ఇప్పటికే ఆదేశించింది.
అసోంలో స్కూళ్ల మూసివేతపై ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ స్పందించారు. పాఠశాలను మూసివేయడం పరిష్కారం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. మనం దేశవ్యాప్తంగా అనేక కొత్త పాఠశాలలను తెరవాల్సిన అవసరం ఉందని అన్నారు. పాఠశాలలను మూసివేసే బదులు వాటిని బాగు చేసి.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా తీర్చి దిద్దాలని సూచించారు. కాగా, ఢిల్లీ విద్యా విధానం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. అక్కడ ప్రభుత్వ స్కూళ్లలో కార్పొరేట్ స్కూళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా విద్యను బోధిస్తున్నారన్న పేరుంది. ఈ క్రమంలోనే అసోంలో స్కూళ్లను మూసివేయవద్దని కేజ్రీవాల్ సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.