Arvind Kejriwal Reacts To Exit Polls : గుజరాత్ లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఈ నెల 8వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి గుజరాత్లో(Gujarat) మొత్తం సీట్ల సంఖ్య 182 కాగా.. అధికారం దక్కించుకోవడానికి కావాల్సిన మెజార్టీ మార్క్ 92 సీట్లు. అంతా ఊహించినట్టుగానే మరోసారి గుజరాత్ ప్రజలు బీజేపీకే పట్టం కట్టినట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే ఈ ఎన్నికల్లో ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)కి..పెద్దగా ప్రభావం చూపలేకపోయిందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దాదాపు అన్ని సర్వేల ఫలితాల్లోనూ ఆప్ దక్కించుకునే సీట్ల సంఖ్య తక్కువగానే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా పోలైన ఓట్లలో 15 శాతం నుంచి 20 శాతం ఓట్లు ఆప్ అభ్యర్థులకే పడ్డాయని ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో వెల్లడైంది.
గుజరాత్ లో అధికార బీజేపీని సవాలు చేసేందుకు భారీ ప్రచారాన్ని చేపట్టిన ఆప్ కి ఘోరమైన ఫలితాలు వస్తాయని అంచనా వేసిన ఎగ్జిట్ పోల్స్‌పై అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు స్పందించారు. తొలిసారి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ దాదాపు 20 శాతం ఓట్లను దక్కించుకోవడంమంటే మాటలు కాదని, అదికూడా బీజేపీకి కంచుకోట వంటి రాష్ట్రంలో ఈ స్థాయిలో ఫలితాలు రాబట్టడం సాధారణ విషయం కాదని కేజ్రీవాల్ చెప్పారు. గుజరాత్ ప్రజల మనసులను తాము గెలుచుకున్నామనేందుకు ఈ అంచనాలే నిదర్శనమన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పార్టీకి సానుకూలంగానే భావిస్తున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. కౌంటింగ్ రోజు వరకు వేచి ఉండాలని..ఈ సర్వేలు తప్పని రుజువవుతుందని, వాస్తవానికి పార్టీ 100 సీట్లకు చేరువగా గెలుస్తుందని ఆప్ నేతలు పేర్కొన్నారు. ఇక, హిమాచల్ ప్రదేశ్ లో ఆమ్ ఆద్మీ ప్రభావం చూపించలేదని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు అంచనా వేశాయి.
కాగా, ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో ఆప్ స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ లోనూ తేలింది. మునిసిపల్ కార్పొరేషన్ల పునర్విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో 15 ఏళ్ల బీజేపీ పాలనకు ముగింపు పలికి, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో ఆప్ పెద్ద విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. దీనిపై స్పందించిన కేజ్రీవాల్..."నేను ఢిల్లీ ప్రజలను అభినందిస్తున్నాను. ఢిల్లీ ప్రజలు మరోసారి ఆప్‌పై విశ్వాసం ఉంచారని ఎగ్జిట్ పోల్స్ చూపించాయి. ఇది ఫలితం ఉంటుందని నేను ఆశిస్తున్నాను... మేము రేపటి వరకు వేచి ఉంటాము"అని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aravind Kejriwal, Gujarat