అరుణ్ జైట్లీ ప్రస్థానం..విద్యార్థి నేత నుంచి కేంద్రమంత్రి వరకు..

Arun jaitley health passes away: జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలోనే  నోట్ల రద్దు, జీఎస్టీ  వంటి సంచలన నిర్ణయాలు తీసుకుంది మోదీ ప్రభుత్వం.

news18-telugu
Updated: August 24, 2019, 12:41 PM IST
అరుణ్ జైట్లీ ప్రస్థానం..విద్యార్థి నేత నుంచి కేంద్రమంత్రి వరకు..
అరుణ్ జైైట్లీ
  • Share this:
బీజేపీ మరో కీలక నేతను కోల్పోయింది. కేంద్రమాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న జైట్లీ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో ఆ పార్టీ శ్రేణులు శోకసంద్రంలో మునిగాయి. జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలోనే  నోట్ల రద్దు, జీఎస్టీ  వంటి సంచలన నిర్ణయాలు తీసుకుంది మోదీ ప్రభుత్వం. 2000 నుంచి ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.  కేంద్రంలో ఆర్థిక, రక్షణ, కార్పొరేట్ వ్యవహారాలు, వాణిజ్యం-పరిశ్రమలు, న్యాయ శాఖ మంత్రిగా పనిచేశారు. సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్‌గానూ సేవలందించారు.

అరుణ్ జైట్లీ 1952 నవంబరు 28న న్యూఢిల్లీలో జన్మించారు. జైట్లీకి భార్య సంగీత, కుమారుడు రోహన్, కూతురు సొనాలి  ఉన్నారు.  అరుణ్ జైట్లీ ఢిల్లీ యూనివర్సిటీలో ఏబీవీపీ విద్యార్థి నేతగా పనిచేశారు. 1974లో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రాజ్ నారాయణ్, జయప్రకాశ్ నారాయణ్ చేపట్టిన అవినీతి వ్యతిరేకగా ఉద్యమంలో విద్యార్థి సంఘం నాయకుడిగా కీలక భూమిక పోషించారు జైట్లీ. అత్యవసర పరిస్థితి కాలంలో 19 నెలలు జైలుకు వెళ్ళారు. జైలు నుంచి విడుదలయ్యాక జనసంఘ్ పార్టీ లో చేరారు.  1987 నుంచి పలురాష్ట్రాల హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్ చేశారు. 1990లో ఢిల్లీ హైకోర్టు సీనియర్ అడ్వకేట్‌గా నియమితులయ్యారు. వీపీ సింగ్ హయాంలో అడిషనల్ సాలిసిటర్ జనరల్‌గానూ సేవలందించారు జైట్లీ.

1991 నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గంలో సభ్యుడిగా ఉన్నారు అరుణ్ జైట్లీ. 1999 లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించారు.  1999లో వాజ్‌పేయీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ బాధ్యతలు చేపట్టారు. 2000లో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలను ఆయన నిర్వర్తించారు. 2002లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2003లో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రగానూ పనిచేశారు జైట్లీ. 2004 ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవడంతో ఆయన తిరిగి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టారు. 2009 రాజ్యసభలో విపక్ష నేతగా ఎంపికయ్యారు జైట్లీ.  2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రక్షణ, ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు.

1980 నుంచి బీజేపీలో ఉన్న అరుణ్ జైట్లీ ఒకే ఒక్కసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేశారు. 2014లో అమృత్‌సర్ లోక్‌సభ నియోజవర్గంలో పోటీచేసిన ఆయన అమరీందర్ సింగ్ చేతిలో ఓడిపోయారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా 2019 లోక్‌సభ ఎన్నికల విజయం తర్వాత కేంద్రం మంత్రివర్గానికి ఆయన దూరంగా ఉన్నారు. తనకు ఎలాంటి మంత్రి పదవి కేటాయించవద్దని ప్రధాని మోదీని ఆయన కోరారు. జైట్లీ మృతితో బీజేపీ శ్రేణులు శోకసంద్రంలో మునిగాయి. ఈ నెలలోనే సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ వంటి కీలక నేతలను కోల్పోవడం పార్టీకి తీరని లోటు అంటూ కంటతడి పెడుతున్నారు.

First published: August 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు