భద్రతా దళాల అవసరాల కోసం వివిధ రాష్ట్రాల్లో ఆర్మీ(Army) ఆధ్వర్యంలో ప్రత్యేకంగా భూములు ఉంటాయనే విషయం తెలిసిందే. ఇలాంటి ఆర్మీ భూములను తమకు అప్పగించాలని రాష్ట్రాలు అప్పుడప్పుడూ కేంద్రాన్ని కోరుతుంటాయి. సికింద్రాబాద్ పరిధిలోని కంటోన్మెంట్ ఏరియా భూముల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నోసార్లు రక్షణ శాఖకు లేఖలు రాసింది. ఈ భూములను(Lands) కొన్నిసార్లు ప్రత్యేక అవసరాల కోసం రాష్ట్రాలు(States) వాడుకుంటాయి. అయితే ఇలా ప్రభుత్వాలు కాకుండా చాలా రాష్ట్రాల్లో ప్రైవేటు వ్యక్తులు రక్షణ శాఖ(Defence) భూములను అక్రమంగా ఆక్రమించుకుంటున్నారని అధికారులు తెలిపారు. దేశంలో ఏకంగా 9500 ఎకరాలకు పైగా డిఫెన్స్ భూములు(Defence lands) ఆక్రమణలో ఉన్నాయని రక్షణ శాఖ తెలిపింది.
ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలు మొదటి మూడు స్థానాల్లో ఉండగా, ఆంధ్రప్రదేశ్ 107 ఎకరాల ఆక్రమణతో 17వ స్థానంలో, తెలంగాణ 60 ఎకరాల ఆక్రమణతో 20వ స్థానంలో ఉన్నాయి. పార్లమెంటులో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా రక్షణ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నివేదికలో వివిధ రాష్ట్రాల్లో ఆక్రమణకు గురైన రక్షణ శాఖ భూముల వివరాలు ఉన్నాయి.
ఆ మూడు రాష్ట్రాల్లో అత్యధికం
దేశంలో మొత్తం 9505 ఎకరాల రక్షణ భూమి ఆక్రమణకు గురైంది. అయితే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో కలిపి ఏకంగా 4572 ఎకరాలను ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో 1927 ఎకరాలు, మధ్యప్రదేశ్‌లో 1660 ఎకరాలు, మహారాష్ట్రలో 985 ఎకరాల ఆర్మీ భూమి ఆక్రమణకు గురైంది. నాలుగో స్థానంలో పశ్చిమ బెంగాల్ ఉంది. ఈ రాష్ట్రంలో 560 ఎకరాల ఆర్మీ భూమి ఆక్రమణలో ఉంది.
విడిపించడం కష్టమే..
ఆర్మీ భూములను ఆక్రమణదారులు అంత తేలిగ్గా వదలట్లేదని నివేదికలు చెబుతున్నాయి. గత ఐదేళ్లలో కేవలం 1000 ఎకరాల భూమిని మాత్రమే ఆక్రమణదారుల నుంచి ఆర్మీ అధికారులు విడిపించగలిగారు. గత ఐదేళ్లలో ఆక్రమణకు గురైన భూమిలో కొంత భాగాన్ని మాత్రమే సైన్యం విడిపించుకోగలిగింది. ఇందులో ఉత్తరప్రదేశ్‌లో 435 ఎకరాల భూమి ఆక్రమణల నుంచి విముక్తి పొందగా, మధ్యప్రదేశ్‌లో 43 ఎకరాలు, మహారాష్ట్రలో 36 ఎకరాల భూమిని మాత్రమే ఆక్రమణదారుల నుంచి వెనక్కి తీసుకోగలిగారు.
కంటోన్మెంట్ ప్రాంతం వెలుపల ఆక్రమణలు
ఆర్మీ కాపలాగా ఉన్నప్పుడు డిఫెన్స్ భూములు ఎలా ఆక్రమణకు గురవుతాయని చాలామంది ఆశ్చర్యపోవచ్చు. అయితే ఆర్మీ భూముల్లో జనావాసాలు ఉండవు. సాధారణంగా ఈ ల్యాండ్స్ క్యాంపింగ్ మైదానాలుగా ఉంటాయి. ఇవి కంటోన్మెంట్ ప్రాంతానికి బయట ఉంటాయి. చాలాచోట్ల వీటికి ఫెన్సింగ్ లేదా సరిహద్దు గోడలు లేవు. అందుకే ఇవి సులువుగా ఆక్రమణలకు గురవుతాయి.
ఆర్మీ భూమిని బిల్డర్లు, స్థానికులు కలిసి ఆక్రమించుకుంటున్నట్లు గత నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇలాంటి కేసుల్లో ఆర్మీ అధికారులకు సైతం ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముందు డిఫెన్స్ భూముల పక్కన ఉండే ల్యాండ్స్‌ను అక్రమార్కులు కొనుగోలు చేస్తున్నారు. ఆ తరువాత నెమ్మదిగా రక్షణ శాఖ భూములను కొద్దికొద్దిగా ఆక్రమించుకుంటున్నారు. ఆ తరువాత వారిని ఖాళీ చేయడం ఆర్మీ అధికారులకు కష్టతరంగా మారుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.