AP CM JAGAN AND ODISHA CM NAVEEN PATNAIK TO DISCUSS INTER STATE WATER DISPUTES ON NOV 9TH WHAT ABOUT KOTIA VILLAGES ISSUE
jagan -naveen patnaik meet : కోటియా గ్రామాల వివాదం తేలేనా? -9న ఒడిశాకు ఏపీ సీఎం -ఇదీ అజెండా
9న ఒడిశాకు ఏపీ సీఎం
వైఎస్ జగన్ ఏపీకి సీఎం అయిన తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ తో పలు దఫాలు చర్చలు జరిపినప్పటికీ అవన్నీ విఫలమయ్యాయి. ఇప్పుడు జగన్ తొలిసారిగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్నారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై సీఎంలు మాట్లాడుకుంటారు. మరి సరిహద్దులో వివాదాస్పద కోటియా గ్రామాలపైనా సీఎంలు తేల్చుతారా?
పదవీ కాలం ఇంకా రెండున్నరేళ్లే మిగిలి ఉండటంతో పెండింగ్ ప్రాజెక్టులపై ఫోకస్ పెంచారు ఏపీ సీఎం వైఎస్ జగన్. పోరుగు రాష్ట్రాలతో జల వివాదాలను పరిష్కరించుకునే ప్రయత్నంలో భాగంగా ఆయన ఈనెల 9న ఒడిశాకు వెళ్లనున్నారు. భువనేశ్వర్ వేదికగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో ఏపీ సీఎం జగన్ సమావేశమవుతారు. ఏపీ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఒడిశాకు వెళుతోన్న జగన్.. పట్నాయక్ తో ఏం మాట్లాడబోతున్నారో ఇప్పటికే అజెండా ఖరారైంది. అయితే, రెండు రాష్ట్రాల మధ్య ఐదు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న కొటియా గ్రామాల వివాదంపై ఇద్దరు సీఎంలు మాట్లాడుకుంటారా? లేదా? అనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సరిహద్దుల్లో తరచూ చోటుచేసుకుంటోన్న ఉద్రిక్తతలకు సీఎంలు పరిష్కార మార్గాలు వెతుకుతారా? ఏపీలో కలుస్తామంటోన్న కోటియా గ్రామస్తుల ఆశ నెరవేరేలా జగన్ ప్రయత్నాలు చేస్తారా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి..
ఏపీ-ఒడిశా చర్చల్లో ఇదే అజెండా
జగన్, పట్నాయక్ భేటీలో జల వివాదాలకు సంబంధించిన అంశాలే ప్రధానంగా ఉంటాయని అధికారవర్గాలు తెలిపాయి. పోలవరం ప్రాజెక్టు, జంఝావతి రిజర్వాయర్, నేరడి బ్యారేజీ లాంటి ప్రాజెక్టులపై ఒడిశా సర్కారు లేవనెత్తిన అనుమానాలను నివృత్తి చేసేలా జగన్ పర్యటన ఉంటుందని, సీఎం వెంట జలవనరుల శాఖకు చెందిన అధికారులు కూడా ఒడిశా వెళతారని ఏపీ ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఏపీ ప్రాజెక్టుల వల్ల ఒడిశాకు ఎలాంటి ముప్పు వాటిల్లబోదని, సరిహద్దులో నిర్మించే ప్రాజెక్టులను రెండు రాష్ట్రాలు కలిసి వాడుకునేలా జగన్ చర్చిస్తారని తెలుస్తోంది. జల వివాదాలపై తానే వస్తానంటూ ఏసీ సీఎం జగన్ గత ఏప్రిల్ లో రాసిన లేఖకు సానుకూల స్పందనగా నవీన్ పట్నాయక్ ఆహ్వానం పంపడంతో ఈనెల 9న భువనేశ్వర్ లో వీరి భేటీకి రంగం సిద్దమైంది. అయితే,
కోటియా గ్రామాలపై మాట్లాడుతారా?
జగన్ సీఎం అయిన తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ తో పలు దఫాలు చర్చలు జరిపినప్పటికీ అవన్నీ విఫలమై, ఏపీ, తెలంగాణ ప్రాజెక్టుల నిర్వహణ చివరికి కేంద్రం చేతుల్లోకి వెళ్లింది. నీటి పంచాయితీ నేపథ్యంలో తొలిసారి ఒడిశా వెళుతోన్న జగన్ ఎంతటి సక్సెస్ సాధిస్తారనేది చర్చనీయాంశమైంది. జల వివాదాల సంగతి అలా ఉంచితే, ఏపీ, ఒడిశా మధ్య గడిచిన ఆరు దశాబ్దాలుగా రగులుతోన్న కొటియా గ్రామాల వివాదానికి సీఎంలు ముగింపు పలుకుతారా? అసలీ అంశం చర్చకు వస్తుందా? అని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే కోటియా గ్రామాల ప్రజలు.. తాము ఏపీలోనే కొనసాగుతామంటూ ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి, వాటిని విజయనగరం జిల్లా కలెక్టర్ కు సమర్పించడం, సదరు తీర్మానాలను ప్రభుత్వంలోని పెద్దలకు పంపుతానని కలెక్టర్ చెప్పడం తెలిసిందే. మరి కోటియా గ్రామాల ప్రజల ఆశలకు అనుగుణంగా వాటిని ఏపీలోనే ఉంచేందుకు జగన్.. పట్నాయక్ తో మాట్లాడుతారా? లేదా? అనేది ఉత్కంఠ రేపుతున్నది.
ఎక్కడున్నాయీ కోటియా గ్రామాలు?
ఏపీలోని విజయనగరం - ఒడిశాలోని కోరాపుట్ జిల్లాల మధ్య ఉండే కొటియా పంచాయతీలోని 21 గ్రామాల్ని కొటియా గ్రామాలుగా పిలుస్తారు. విజయనగరం నుంచి 60 కిలోమీటర్ల మేర కొండ ప్రాంతాల్లో ప్రయాణిస్తే కొటియా ప్రాంతాలకు చేరుకోవచ్చు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అవతరించినప్పుడు కొటియా గ్రామాల్లో సర్వే జరగకపోవడం, వాటిని ఏ ప్రాంతాల్లోనూ కలపకపోవడంతో అవి తమ పరిధిలోనివేనంటూ ఇరు రాష్ట్రాలూ వాదిస్తున్నాయి. ఈ వివాదం 1968లోనే సుప్రీంకోర్టును చేరగా, వ్యవహారం తేలాల్సింది కోర్టులో కాదని, పార్లమెంట్లోనే అని అత్యున్నత న్యాస్థానం 2006లో పేర్కొంది. విలువైన ఖనిజ సంపదకు నిలయమైన ఆ ప్రాంతాన్ని వదులుకునేందుకు రెండు రాష్ట్రాలూ సిద్ధంగా లేవు.
ఏపీ-ఒడిశా సరిహద్దు వివాదాలు
విజయనగరం -కోరాపూట్ జిల్లాల మధ్య కోటియా గ్రామాల వివాదం కొనసాగుతుండగా, ఆంధ్ర -ఒడిశా సరిహద్దులోనే శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కౌశల్యాపురం పోలింగ్ స్టేషన్ వద్ద రెండు రాష్ట్రాల మధ్య వివాదం రాజుకుంది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో.. జిల్లాలోని కౌశల్యాపురం ప్రాథమిక పాఠశాలలో పరిషత్ ఎన్నికల పోలింగ్ కోసం ఆంధ్రా అధికారులు ఏర్పాట్లు చేయగా, ఒడిశా అధికారులు అక్కడికి వచ్చి.. భూభాగానికి సంబంధించిన వివాదం కోర్టులో ఉన్నందున ఎన్నికలు నిర్వహించొద్దంటూ అడ్డుకున్నారు. దీనిపై సీతంపేట ఐటీడీఏ పీవో జోక్యం చేసుకుని ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. జగన్-పట్నాయక్ భేటీలో సరిహద్దు వివాదాలు చర్చకు వస్తాయా, లేదా అనేది ఉత్కంఠగా మారింది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.