Cocktail: ఇండియాలో యాంటీబాడీ కాక్‌టెయిల్‌.. ధర రూ.59 వేలు.. ఎలా పనిచేస్తుంది?

ఇండియాలో యాంటీబాడీ కాక్‌టెయిల్‌ (image credit - reuters)

Antibody Cocktail: కాక్‌టెయిల్ కరోనాను తగ్గిస్తుందంటే నమ్మగలమా... అది రొటీన్ కాక్‌టెయిల్ కాదు... యాంటీబాడీ కాక్‌టెయిల్... దాని ప్రత్యేకత ఏంటో... ధర ఎంతో, ఎక్కడ లభిస్తుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

  • Share this:
    Antibody Cocktail: ఇండియాలో కరోనా అంతు చూసేందుకు వ్యాక్సిన్లు, రకరకాల మందులు వస్తున్నాయి. ఇక ఆయుర్వేదాలు ఇతరత్రా ఎలాగూ ఉంటున్నాయి. తాజాగా... కరోనాను తరిమికొట్టేందుకే అంటూ... కొత్త యాంటీబాడీ కాక్‌టెయిల్ ఇండియన్ మార్కెట్‌లోకి వచ్చింది. ఇది కరోనా సోకిన వారిలో ఇమ్యూనిటీని పెంచుతుంది. అలాగే వ్యాధి మరింత పెరగకుండా చేస్తుంది. ఆల్రెడీ దీన్ని అమెరికా, యూరప్ దేశాల్లో వాడుతున్నారు. ఇప్పుడు ఇండియాలోకీ వచ్చేసింది. న్యూయార్క్‌లో రెజెనెరన్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ దీన్ని తయారుచేసింది. ఇండియాలో దీన్ని ఎమర్జెన్సీగా వాడేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అనుమతి ఇచ్చింది. ఈ యాంటీబాడీ కాక్‌టెయిల్ ఒక డోసులో 600 మిల్లీగ్రాముల కాసిరివిమాబ్, 600 మిల్లీగ్రాముల ఇమ్‌డెవిమాబ్ మందులు ఉంటాయి. మొత్తం 1200 మిల్లీగ్రాములు ఉంటుంది.

    దీన్ని 12 ఏళ్లు దాటిన వారు, 40 కేజీల కంటే ఎక్కువ బరువు ఉన్నవారు మాత్రమే వాడాలి. అలాగే ఇది వాడే సమయానికి బాడీలో ఆక్సిజన్ లెవెల్ 90 శాతం కంటే ఎక్కువగా ఉండాలి. దీన్ని రోచే ఫార్మా కంపెనీ, సిప్లా ఫార్మా కంపెనీ కలిసి తయారుచేస్తున్నాయి. ఒక డోసును రూ.59,750గా ఫిక్స్ చేసింది. దీనిని చర్మం కింద ఉండే కండరంలోకి లేదా నరాలకు ఎక్కించవచ్చు. 2 నుంచి 8 డిగ్రీల టెంపరేచర్‌లో ఉంచవచ్చు. కాబట్టి మామూలు ఫ్రిజ్‌లలో దాచవచ్చు. గుండె, మూత్రపిండాల వ్యాధులు, డయాబెటిస్ వంటివి ఉన్నవారు దీన్ని వాడితే మంచి ఫలితాలు కనిపిస్తాయని చెబుతున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కరోనా సోకినప్పుడు దీన్నే తీసుకున్నారు. దీన్ని వాడిన వారిలో 70 శాతం మంది 4 రోజుల్లో కరోనా నుంచి కోలుకున్నారని రోచే కంపెనీ తెలిపింది.


    తొలి బ్యాచ్‌లో లక్ష ప్యాక్‌లను ఇండియన్ మార్కెట్‌లో రిలీజ్ చేశారు. వీటి ద్వారా 2 లక్షల మంది పేషెంట్లను రికవరీ చేయవచ్చు. జూన్‌ మధ్యలో రెండో బ్యాచ్‌ ప్యాక్‌లను వదులుతారు. ఒక్కో ప్యాక్‌ను ఇద్దరు కరోనా పేషెంట్లకు ఇవ్వొచ్చని రోచే, సిప్లా తెలిపాయి. ఈ యాంటీబాడీ కాక్‌టెయిల్ వల్ల ఉన్న అదనపు ప్రయోజనం ఏంటంటే... కరోనా వచ్చిన వారు... ఇది వాడటం ద్వారా... ఆస్పత్రికి వెళ్లే అవసరం తగ్గిపోతుందని కంపెనీలు చెబుతున్నాయి. ‘‘ఇది అన్ని ముఖ్యమైన ఆసుపత్రులు, కరోనా ట్రీట్‌మెంట్ సెంటర్లలో ఈ కాక్‌టెయిల్ అందుబాటులో ఉంటుంది’’ అని రోచ్‌ ఇండియా CEO వి సిమ్సన్‌ ఇమ్మాన్యూయెల్‌ తెలిపారు.

    ఇది కూడా చదవండి: Horoscope 25-5-2021: నేటి రాశి ఫలాలు... ఈ రాశుల వారికి కాస్తంత శ్రమ తప్పదు

    మామూలు కాక్‌టెయిల్‌ కాదా:
    ఇది పబ్బుల్లో లభించే కాక్‌టెయిల్ టైపు కాదు. పేరు అలా పెట్టారంతే. ఇందులో వాడే కాసిరివిమాబ్‌, ఇమ్డివిమాబ్‌ రెండు మందులూ... కరోనాతో పోరాడగలవు. కరోనా ఎక్కువగా ఉన్న, మధ్యస్థాయిలో ఉన్న పేషెంట్లకు దీన్ని వాడవచ్చని తెలిపారు. ఇది తాగాక... శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుందట. ఈ మందులు కరోనాతో యాంటీబాడీల్లా పనిచేస్తాయని అంటున్నారు. ముఖ్యంగా కరోనా చుట్టూ ఉండే కొవ్వు లాంటి ముళ్లను ఈ యాంటీబాడీలు నాశనం చేస్తాయని చెబుతున్నారు. ఈ ప్రోటీన్ ముళ్లు ఉండటం వల్లే కరోనా వైరస్... కణాలకు అతుక్కుంటోంది. ఈ ప్రోటీనే లేకపోతే... అతుక్కోలేదు. అతుక్కోలేకపోతే... కరోనా బతకలేదు. ఒకవేళ కరోనా రూపాంతరం చెంది... మరో వేరియంట్‌గా మారినప్పటికీ... దాన్ని కూడా ఇవి అడ్డుకోగలవని చెబుతున్నారు.
    Published by:Krishna Kumar N
    First published: