COVID-19: కరోనా బాధితులపై విరుచుకుపడుతున్న మరో వ్యాధి.. పెరుగుతున్న బాధితులు..

ప్రతీకాత్మక చిత్రం

కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నాక కూడా బాధితులను సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇంతకాలం బ్లాక్ ఫంగస్​ భయాలు రోగులను ఆందోళనకు గురిచేస్తే.. తాజాగా వైరస్ నుంచి బయటపడ్డాక మరో వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువవుతోందన్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

  • Share this:
కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నాక కూడా బాధితులను సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇంతకాలం బ్లాక్ ఫంగస్​ భయాలు రోగులను ఆందోళనకు గురిచేస్తే.. తాజాగా వైరస్ నుంచి బయటపడ్డాక మరో వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువవుతోందన్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా నుంచి కోలుకున్న రోగులకు ట్యూబర్​కులోసిస్(టీబీ/క్షయ) వస్తున్న కేసులు పెరుగుతున్నాయని వైద్యులు తాజాగా చెబుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్​ ఉన్న వారితో పాటు చికిత్స సమయంలో స్టెరాయిడ్లు ఎక్కువగా తీసుకున్న వారికి ఈ ప్రమాదం అధికంగా ఉన్నట్టు చెబుతున్నారు.  కరోనా నుంచి కోలుకున్నాక టీబీతో ఆసుపత్రితో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోందని ఢిల్లీలోని మూల్​చంద్​ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. చివరి నాలుగు నుంచి ఆరు వారాల్లో దాదాపు 10 మంది వరకు టీబీ చికిత్స కోసం వచ్చారని ప్రకటించింది. ‘ఈ టీబీ రోగులందరూ కరోనా చికిత్స సమయంలో స్టెరాయిడ్లు తీసుకున్నవారే.

అందులో చాలా మందికి డయాబెటిస్ ఉంది. అలాగే ఆరు మంది 40 సంవత్సరాల వయసు లోపువారే’ అని ఆసుపత్రి పల్మనాలజిస్ట్​ విభాగం వెల్లడించింది. అయితే కరోనా నుంచి కోలుకున్న తర్వాత టీబీ వచ్చేందుకు వివిధ అంశాలు కారణమయ్యే అవకాశం ఉందని ఓ సీనియర్ డాక్టర్ వెల్లడించారు. రోగ నిరోధక శక్తిపై ప్రభావం పడడంతో పాటు మరిన్ని విషయాలపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. “కరోనా నుంచి కోలుకున్న వారిలో టీబీ వచ్చే అవకాశం పెరగడానికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా రోగనిరోధక శక్తిపై ప్రబావం పడడం, ఊపిరితిత్తులపై ఒత్తిడి పడడం, కొవిడ్ తగ్గేందుకు స్టెరాయిడ్స్ వినియోగించడం, షుగర్​ లెవెల్స్ నియంత్రణ లేకపోవడం లాంటివి కారణాలు కావొచ్చు. అందుకే కరోనా నుంచి కోలుకున్న వెంటనే టీబీ విషయంపై దృష్టి సారించాలి.

పరీక్షలు చేయించుకోవడం, త్వరగా చికిత్స తీసుకోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి” అని ఆ వైద్యుడు సూచించారు. జ్వరం, దగ్గు, బరువు తగ్గడం, రాత్రుళ్లు చెమటలు పట్టడం లాంటి కరోనా పోలిన లక్షణాలు ఉన్నా టీబీ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు. “రెండు వారాలకు పైగా స్వల్ప జ్వరమైనా కొనసాగడం, హఠాత్తుగా బరువు తగ్గుతుండడం, ఆకలి సరిగా కాకపోవడం, ఎక్కువ కాలం దగ్గు ఉండడం, డయేరియా కొనసాగడం లాంటి లక్షణాలు ఉంటే తప్పకుండా టెస్టులు చేయించుకోవాలి. సరైన వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స చేయించుకోవాలి” అని ఒక వైద్య నిపుణుడు సూచించారు. అలాగే కరోనా నుంచి కోలుకున్న వారు టీబీ పరీక్షలు చేయించుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సైతం మార్గదర్శకాల్లో చెప్పింది.
Published by:Veera Babu
First published: