కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ సంస్కరణ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా తాను నిరాహార దీక్ష నిర్ణయంపై సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే వెనక్కి తగ్గారు. తాను నిరాహార దీక్ష ప్రణాళికను రద్దు చేసుకుంటున్నట్టు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో అన్నాహజారే ఈ ప్రకటన చేశారు. కేంద్రం వ్యవసాయ సంస్కరణల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతు పలికిన అన్నా హజారే.. ఈనెల 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ లేఖ రాశారు. రైతులకు మద్దతుగా జనవరి చివరికి తన ‘జీవితంలో ఆఖరి నిరాహార దీక్ష’ చేస్తానని ప్రకటించారు. చట్టాల రూపకల్పనలో ప్రజలను భాగస్వాములను చేయాలని ఆయన అన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలు ప్రజాస్వామ్య విలువలకు లోబడి లేవని విమర్శించారు.
డిసెంబరు 14న కేంద్ర వ్యవసాయమంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు కూడా అన్నా హజారే లేఖరాశారు. ఎంఎస్ స్వామినాథన్ కమిటీ ప్రతిపాదనలను అమలు చేయాలని.. అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ కమిషన్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని ఇవ్వాలని అందులో డిమాండ్ చేశారు. లేదంటే తాను నిరహార దీక్ష చేస్తానని స్పష్టం చేశారు. రైతుల సమస్యలపై ఇప్పటికీ ఐదు సార్లు కేంద్రానికి లేఖ రాశానని.. కానీ ఎలాంటి స్పందన లేదని అన్నా హాజరే పేర్కొన్నారు.
Anna Hazare has decided not to protest from tomorrow over various demands related to farmers:Anna Hazare's Office
MoS Agriculture Kailash Choudhary along with LoP Devendra Fadnavis met Hazare at his hometown Ralegansiddhi today to convince him to not start protest.#Maharashtra pic.twitter.com/jnKemiBbIw
— ANI (@ANI) January 29, 2021
జనవరి 30 నుంచి అన్నాహజారే నిరాహార దీక్షకు దిగుతున్నట్టు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి కైలాష్ చౌదరి కలసి వెళ్లి అన్నాహజారేతో చర్చలు జరిపారు. నిరాహార దీక్షకు వెళ్లకుండా బుజ్జగించారు. ఆయన డిమాండ్ చేసినట్టు వ్యవసాయ శాఖ అధికారులు, నీతి ఆయోగ్‌తో పాటు అన్నా హజారే సూచించిన కొందరు సభ్యులతో ఓ కమిటీ వేయడానికి ఫడ్నవీస్, కేంద్ర మంత్రి కైలాష్ చౌదరి హామీ ఇవ్వడంతో అన్నా హజారే తన నిరాహార దీక్షను రద్దు చేసుకున్నారు. అన్నా హజారే చేసిన డిమాండ్లను ఆ కమిటీ పరిశీలించి ఆరు నెలల్లో అమలు చేసేందుకు అంగీకరించినట్టు అన్నాహజారే కార్యాలయం ప్రకటించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.