AP CM Jagan: ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎం జగన్.. కేంద్రమంత్రులతో వరుస భేటీలు.. షెడ్యూల్.. అజెండా ఇదే...

అమిత్ షాను కలవనున్న వైఎస్ జగన్

ఏపీ సీఎం జగన్ ఢిల్లీకి చేరుకున్నారు.. కాసేపట్లో వరుసగా కేంద్రమంత్రులను కలవనున్నారు. అలాగే రాత్రి తొమ్మిది గంటలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ ఫిక్స్ అయ్యింది. దీంతో వీరిద్దరి భేటీ రాజకీయంగా సర్వత్రా ఆసక్తి పెంచుతోంది..

 • Share this:
  ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరి ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ చేరిన సీఎం జగన్‌ వెంట ఎంపీలు విజయ సాయిరెడ్డి, మోపిదేవి వెంకట రమణ స్వాగతం పలికారు. సీఎం జగన్‌ వెంట ఎంపీలు మిథున్‌ రెడ్డి, అవినాష్‌ రెడ్డి, బాలశౌరి, సజ్జల రామకృష్ణా రెడ్డి ఉ‍న్నారు. హోంమంత్రి అమిత్‌ షా, జల వనరుల శాఖమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్, రైల్వే శాఖ మంత్రి గోయల్‌ సహా పలువురు కేంద్ర మంత్రులను సీఎం జగన్‌ కలుసుకుంటారు. పోలవరం ప్రాజెక్ట్‌ పనులు సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చిస్తారు. వరుస భేటీల్లో భాగంగా మొదట ఆయన మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం అవుతారు. ఆ తరువాత విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై సంబంధిత శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఏడు గంటలకు భేటి కానున్నారు. అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో 9 గంటలకు కీలక భేటీ కానున్నారు. పోలవరం నిధులు, విభజన హామీలు, వ్యాక్సినేషన్, ఇతర పెండింగ్ అంశాలపై అమిత్ షాతో సీఎం చర్చించే అవకాశం ఉంది. అలాగే రేపు ఉదయం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో సీఎం జగన్ సమావేశం కానున్నారు. తిరిగి శుక్రవారం మధ్యాహ్నం తాడేపల్లికి చేరుకోనున్నారు సీఎం జగన్.

  ఈ రెండు రోజుల ఢిల్లీ పర్యనట మొత్తం సీఎం బిజీ బిజీగా గడపనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని ముఖ్యమంత్రి అధికార నివాసం 1-జన్‌పథ్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత వరుసగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు... ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నా.. రాత్రి వరకు అమిత్ షా కోసం వెయిట్ చేయక తప్పడం లేదు. ఆ లోపు మిగిలిన కేంద్ర మంత్రులతో సీఎం జగన్ వరుస భేటీ అవుతారు. కరోనా దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆర్థిక సాయం చేయాల‌ని జ‌గ‌న్ కోరుతున్న నేప‌థ్యంలో తాజా పర్యటన ప్రాధాన్యం సంత‌రించుకుంది.
  వాస్తవానికి ఆయన సోమవారమే ఢిల్లీకి వెళ్లాల్సింది. కానీ... కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు సమయం కుదరకపోవడంతో వాయిదా పడింది. ఇవాళ రాత్రికి అమిత్‌షాతోపాటు పలువురు కేంద్ర మంత్రులను జగన్‌ కలిస్తారు.

  జగన్ పర్యటన ఉద్దేశం ఏదైనా.. తన బెయిలు రద్దు పిటిషన్‌పై ఈనెల 14న తదుపరి విచారణ జరగనుండటం... ఎంపీ రఘురామరాజు అరెస్టు- సీఐడీ కస్టడీలో గాయాలపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో సీఎం ఢిల్లీ పర్యటనకు, అక్కడ అమిత్‌షాతో జరగనున్న సమావేశానికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, ఏపీలో కరోనా పరిస్థితులు, వ్యాక్సిన్ పై వివిధ రాష్ట్రాలకు ప్రభుత్వం సాయంపై చర్చ అని చెబుతున్నా.. ఢిల్లీ వర్గాల్లో మాత్రం వేరే చర్చ నడుస్తోంది.

  మొదట సోమవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌తోనూ సమావేశం కావాలని జగన్‌ ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈసారి రాజ్‌నాథ్‌ అపాయింట్‌మెంట్‌ కోరలేదని తెలిసింది. కాసేపట్లో పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ లను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించనున్నారు. ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించిన అంశాలపై వారికి వినతిపత్రాలు సమర్పించినట్టు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు తుది అంచనాలను ఖరారు చేయడంతోపాటు నిధులు విడుదల చేయాలని మరోసారి జలశక్తి మంత్రి షెకావత్‌ను కోరే అవకాశం ఉంది..

  ఇతర మంత్రులతో భేటీలు ముగిసిన తర్వాత... రాత్రి 9 గంటలకు అమిత్‌షాతో సమావేశమవుతారని సమాచారం. ఈ భేటీ తరువాత రాత్రి జగన్‌ ఢిల్లీలోనే బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణమవుతారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే జగన్‌ ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారీ ప్రధానితో భేటీ కాకపోయినా.. హోం మంత్రి అమిత్‌షాను తప్పకుండా కలుస్తున్నారు. ఆయన అపాయింట్‌మెంట్‌ దొరకకపోతే.. ఇతర మంత్రులను కలవకుండా తిరిగి వచ్చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు, కడప స్టీల్‌ ప్లాంటు, దుగరాజపట్నం పోర్టు, వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ తదితర అంశాలపై మంత్రులకు వినతిపత్రాలు సమర్పించారంటూ సీఎం కార్యాలయం వాట్సప్‌ సందేశాలను పంపిస్తోంది. కానీ సీఎం జగన్ మాత్రం వాటిపై మాట్లాడిన సందర్భం లేదు.. ఈ సారైనా ఆయన క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి..
  Published by:Nagesh Paina
  First published: