కాలా కోసం హాలీడే ఇచ్చేశారు...

Chinthakindhi.Ramu | news18
Updated: June 6, 2019, 2:20 PM IST
కాలా కోసం హాలీడే ఇచ్చేశారు...
రజినీకాంత్ కాలా పోస్టర్
  • News18
  • Last Updated: June 6, 2019, 2:20 PM IST
  • Share this:
ఐటీ కంపెనీ అంటే పండగలొచ్చినా, పెళ్లిళ్లు అని చెప్పినా  అంత ఈజీగా ఉద్యోగులకు సెలవులివ్వరు. అలాంటిది ఓ సినిమా విడుదలవుతుందంటే హాలీడే ఇచ్చేస్తారా... మామూలుగా అయితే అంత సీన్ ఉండదు. కానీ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అంటే మాత్రం ఎంత పెద్ద కంపెనీ అయినా ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. అందుకే లీవ్ పెట్టి మానేస్తున్న ఉద్యోగుల బాధ చూడలేక, ఏకంగా ‘కాలా’ విడుదల రోజున కంపెనీకే సెలవు ప్రకటించిందీ ఐటీ కంపెనీ.

తలైవా రజినీకాంత్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎవ్వరికీ సాధ్యంకాని ఫాలోయింగ్ ఆయన సొంతం. రజినీ సినిమా విడుదలవుతుంటే వారం రోజుల ముందు నుంచే ఆ ప్రభావం గట్టిగా ఉంటుంది. ఆయనొచ్చాక థియేటర్లోకి రావడానికి మిగిలిన హీరోలు కూడా భయపడతారు. గతంలోనూ ‘కబాలి’, ‘శివాజీ’ సినిమాల విడుదలప్పుడు థియేటర్ల నెలకొన్న సందడి అంతా ఇంతా కాదు. ఎవరిని కదిలించినా ఆయన సినిమా గురించే చర్చ జరిగింది.

ఇప్పుడు రజినీకాంత్ ‘కాలా’ సినిమాతో బాక్సాఫీస్ బరిలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ‘కబాలి’ సినిమాని తెరకెక్కించిన పా.రంజిత్ ఈ సినిమాకి దర్శకుడు. బాలీవుడ్ నటుడు నానా పటేకర్ ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తుండడం విశేషం. ‘కాలా’ విడుదలవుతుందంటే ఆ ప్రభావం తమిళనాడులో ఎక్కువ ఉంటుందని అనుకుంటాం. కానీ ఆశ్చర్యంగా కేరళలో ఓ ఐటీ కంపెనీ ‘కాలా’ సినిమా విడుదలవుతున్న జూన్ 7న ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. ‘టెలియాస్ టెక్నాలజీస్ ప్రై. లిమిటెడ్’ అనే ఐటీ కంపెనీ సినిమా చూసేందుకు ఉద్యోగులకు సెలవివ్వడం వార్తల్లో నిలిచింది.

తెలుగులోనూ రజినీకి ఫ్యాలోయింగ్ విపరీతంగా ఉంది. ఈ వారం ‘కాలా’ విడుదలవుతున్న సందర్భంగా ఒక్క తెలుగు సినిమా కూడా విడుదల కావడం లేదు. తమిళనాడులో కూడా చాలామంది ఉద్యోగులు సినిమా చూసేందుకు సెలవు కావాలని పై అధికారులకు విన్నపాలు పెట్టారట. అయితే కర్ణాటక రాష్ట్రంలో మాత్రం ‘కాలా’ మీద నిషేధం విధించారు. కావేరి జలాల వివాదమే ఈ నిషేధానికి కారణం. రజినీ సినిమాలకి భారతదేశంతో పాటు మలేషియా, ఇండోనేషియా, జపాన్ వంటి దేశాల్లో కూడా క్రేజ్ ఉంటుంది. మరి స్లమ్ డాన్ ‘కరికాలుడు’ పాత్రలో కనిపించబోతున్న రజినీ ‘కాలా’ సినిమాతో ఎన్ని కోట్లు కొల్లగొడుతాడో చూడాలి.
Published by: Ramu Chinthakindhi
First published: June 5, 2018, 3:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading