రైలు ప్రమాదంపై స్థానికుల ఆగ్రహం..అమృత్‌సర్‌లో చెలరేగిన హింస

రైలు ప్రమాద ఘటనపై పోలీసులు సెక్షన్ 304, 304A, 338 కింద కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐతే ఎఫ్ఐఆర్ కాపీలో ఏ ఒక్కరి పేరు పేర్కొనలేదు. మరోవైపు రావణ దహనం కార్యక్రమం నిర్వహించిన కౌన్సిలర్ విజయ్ మందన్, ఆయన కుమారుడు సౌరభ్ మందన్ పరారీలో ఉన్నారు.

news18-telugu
Updated: October 21, 2018, 3:15 PM IST
రైలు ప్రమాదంపై స్థానికుల ఆగ్రహం..అమృత్‌సర్‌లో చెలరేగిన హింస
రైల్వే ట్రాక్‌పై ఆందోళనకారులను చెదరగొడుతున్న పోలీసులు
  • Share this:
రైలు ప్రమాద ఘటన తర్వాత అమృత్‌సర్ పట్టణం నివురుగప్పిన నిప్పులా మారింది. జిల్లా అధికార యంత్రాంగం, రైల్వేశాఖకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనలకు దిగారు. దసరా రోజు రైలు ప్రమాదం జరిగిన స్థలంలో నిరసన తెలిపారు. రైలు పట్టాలపై బైఠాయించి రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. ప్రమాదం తర్వాత కొందరి ఆచూకీ కనిపించడం లేదని..వారి వివరాలు తెలపడంతో పాటు మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఐతే పంజాబ్ పోలీసులతో పాటు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు రంగంలోకి దిగి ఆందోళనకారులను చెదరగొట్టాయి.

బలవంతంగా అక్కడి నుంచి తరలించడంతో ఆందోళనకారులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రతా దళాలను టార్గెట్ చేసి రాళ్ల వర్షం కురిపించారు. దాంతో పోలీసులు సైతం తమ లాఠీలకు పనిచెప్పారు. నిరసనకారులపై లాఠీచార్జ్ చేసి రైల్వే ట్రాక్ నుంచి తరిమేశారు. మరోవైపు దసరా రోజు రావణ దహనం కార్యక్రమం ఏర్పాటు చేసిన స్థానిక కౌన్సిలర్ విజయ్ మందన్, ఆయన కుమారుడు సౌరభ్ మందన్ ఇళ్లపైనా ఆందోళనకారులు దాడి చేశారు. రాళ్లు విసరడంతో కిటీకీలు ధ్వంసమయ్యాయి.రైలు ప్రమాద ఘటనపై పోలీసులు సెక్షన్ 304, 304A, 338 కింద కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐతే ఎఫ్ఐఆర్ కాపీలో ఏ ఒక్కరి పేరు పేర్కొనలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి నిందితులను గుర్తించేపనిలో ఉన్నారు పోలీసులు. మరోవైపు రావణ దహనం కార్యక్రమం నిర్వహించిన కౌన్సిలర్ విజయ్ మందన్, ఆయన కుమారుడు సౌరభ్ మందన్ పరారీలో ఉన్నారు.

నిర్వాహకుల నిర్లక్ష్యం:రైలు ప్రమాద ఘటనలో నిర్వాహకుల నిర్లక్ష్యం స్పష్టంగా తెలుస్తోంది. కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా హాాజరైన నవజోత్ కౌర్ సిద్దును ఉద్దేశించి ఈవెంట్ ఆర్గనైజర్ చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్‌గా మారింది.
మేడం..ఇక్కడ చూడండి. వీళ్లు రైలు పట్టాలపై ఏ మాత్రం భయం లేకుండా నిల్చున్నారు. మీ కోసం 5వేల మంది పట్టాలపై నిలబడి ఉన్నారు. అక్కడి నుంచి 500 రైళ్లు వెళ్లినా పట్టించుకోరు. అక్కడి నుంచి కదలరు.
ఈవెంట్ ఆర్గనైజర్
అక్కడ ప్రమాదం జరిగే అవకాశముందనే విషయం నిర్వాహకులకు ముందే తెలుసని ఈ వ్యాఖ్యలను బట్టి స్పష్టంగా తెలుస్తోంది. కానీ వారిని అక్కడి నుంచి పంపించకుండా తీవ్ర నిర్లక్ష్యం వహించారు.
First published: October 21, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు