హైదరాబాద్ ఎంపీ, ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్‌పై ఉత్తరప్రదేశ్ లో కాల్పులు జరిగిన ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం రాజ్యసభలో వివరణాత్మక సమాధానం ఇచ్చారు. ఘటనపై ప్రభుత్వాలు స్పందించిన తీరు, కేసు దర్యాప్తు, ఒవైసీ భద్రతకు సంబంధించిన అంశాలపై షా సభలో ప్రకటన చేశారు.
ఎంఐఎం చీఫ్ ఒవైసీ గత గురువారం యూపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మీరట్ నుంచి ఢిల్లీ వస్తుండగా చిజారసీ టోల్ ప్లాజా వద్ద కాల్పులు జరిగాయని, ఒవైసీ కాన్వాయ్ లోని కారుకు మూడు బుల్లెట్లు తగిలాయని, ఈ ఘటనలో ఒవైసీ సురక్షితంగా బయటపడగా, ప్రాథమిక ఆధారాలు, ప్రత్యక్ష సాక్షుల ధృవీకరణతో ఇద్దరు నిందితులపై IPC సెక్షన్ 307 కింద ఎఫ్ఐఆర్ నమోదైందని, తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు.
ఒవైసీ కాన్వాయ్ పైకి కాల్పుల ఘటనలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి నివేదిక తీసుకున్నామని, నిజానికి ఒవైసీ తన పర్యటన సమాచారాన్ని హపూర్ జిల్లా పోలీస్ అధికారులకు అందించలేదని అమిత్ షా రాజ్యసభకు తెలిపారు. గతంలో కేంద్ర భద్రతా సంస్థల నుంచి వచ్చిన ఇన్‌పుట్స్ ఆధారంగా, ఒవైసీకి భద్రత కల్పించాలని కేంద్రం ఆదేశించిందని, అయితే, సెక్యూరిటీ పొందేందుకు ఆయన సుతారమూ ఇష్టపడకపోవటంతో, అసద్ భద్రత విషయంలో ఇటు ఢిల్లీ పోలీసులు, అటు తెలంగాణ పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమవుతూ వచ్చాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అయితే,
‘అసదుద్దీన్ ఒవైసీ ప్రాణాలకు ముప్పు ఉందనే భద్రతా సంస్థల అంచనాలు తాజా ఘటనతో మరోసారి నిరూపితం అయ్యాయి. అందుకే ఒవైసీకి బుల్లెట్ ప్రూఫ్ వాహనంతోపాటు జెడ్ కేటగిరీ భద్రత కల్పించేందుకు కేంద్రం సంకల్పించింది. కానీ మౌఖిక సమాచారం ప్రకారం, ఇప్పుడు కూడా సెక్యూరిటీ పొందడానికి ఆయన నిరాకరించారు. ఈ సందర్భంగా సభ తరఫున నేను ఆయనను మరోసారి అభ్యర్థిస్తున్నాను.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జెడ్ ప్లస్ సెక్యూరిటీని అంగీకరించాలని ఒవైసీని కోరుతున్నాను’అని అమిత్ షా అన్నారు. ఒవైసీ లోక్ సభ సభ్యుడు కాగా, ఆయనపై దాడి ఘటనకు సమాధానాన్ని కేంద్రం రాజ్యసభలో ఇచ్చింది. అమిత్ షా అభ్యర్థనపై ఒవైసీ స్పందించాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amit Shah, Asaduddin Owaisi, Assembly Election 2022, Parliament