భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా కాన్వాయ్‌పై పశ్చిమ బెంగాల్లో జరిగిన దాడిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఖండించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి కూడా 12 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. 2021లో పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ క్రమంలో బీజేపీని ఎన్నికల కోసం సన్నద్ధం చేసేందుకు జేపీ నడ్డా బెంగాల్లో పర్యటిస్తున్నారు. బెంగాల్ రాజధాని కోల్‌కతాకు 50 కిలోమీటర్ల దూరంలో జేపీ నడ్డా ప్రయాణిస్తున్న వాహన కాన్వాయ్ మీద దాడి జరిగింది. బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ దాడి చేశారని బీజేపీ ఆరోపించింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న డైమండ్ హార్బర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలను కలిసేందుకు వెళ్తున్న సమయంలో జేపీ నడ్డా కాన్వాయ్ మీద దాడి జరిగింది. ఈ దాడిలో బీజేపీ నేత ముకుల్ రాయ్‌కు గాయాలు అయ్యాయి. రాళ్లతో దాడి చేయడంతో కారు అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి.
‘ఈ రోజు బెంగాల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మీద జరిగిన దాడి ఆక్షేపణీయం. దీన్ని ఎంత ఖండించినా తక్కువే. కేంద్ర ప్రభుత్వం దీన్ని సీరియస్‌గా తీసుకుంది. బెంగాల్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడికి రాష్ట్రంలోని శాంతిప్రియులు సమాధానం చెప్పాలి.’ అని అమిత్ షా ట్వీట్ చేశారు.
జేపీ నడ్డా ప్రయాణిస్తున్నకారు బుల్లెట్ ప్రూఫ్ కావడంతో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. మరో కారులో ఉన్న బీజేపీ నేత కైలాష్ విజయవర్గీయ గాయపడ్డారు . ‘దుర్గా మాత దయ వల్లే నేను మీటింగ్ ప్రదేశానికి రాగలిగాను.’ అని జేపీ నడ్డా అన్నారు. నడ్డా కాన్వాయ్ మీద జరిగిన దాడిని నిరసిస్తూ బీజేపీ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది.
జేపీ నడ్డా కాన్వాయ్‌పై దాడి బీజేపీ ఆడిన డ్రామా అని, వాళ్లే తమ మీద తాము దాడి చేసుకుని తమ మీద నింద వేస్తున్నారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. దీనిపై బెంగాల్ ప్రభుత్వం విచారణ జరుపుతుందని అన్నారు. ఇది కేవలం ఉద్దేశపూర్వకంగా చేసిందా, లేక దీని వెనుక ఏదైనా పెద్ద కుట్ర ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తామన్నారు. జేపీ నడ్డా పర్యటనలో భద్రత కల్పించాల్సిందిగా బీజేపీ తమను అడగలేదని మమతా బెనర్జీ చెప్పారు. మరోవైపు ‘ప్రజలకు బీజేపీ వాళ్లు నచ్చకపోతే మేమేం చేస్తాం.’ అని మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ అన్నారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:December 10, 2020, 18:35 IST