news18-telugu
Updated: November 21, 2020, 5:37 PM IST
అమిత్ షా నడక
ఉత్తరాదిన ఊపేస్తున్న కమలం.. దక్షిణాదిన మాత్రం ఇంకా వికసించలేదు. కర్నాటక తప్ప ఎక్కడా ప్రభావం చూపించడం లేదు. దేశమంతటా బీజేపీ ఉండాలనుకుంటున్న ఆ పార్టీ హైకమాండ్.. ఇక్కడ కూడా పట్టు సాధించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. ముఖ్యంగా వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న తమిళనాడుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే కేంద్రహోంమంత్రి అమిత్ షా శనివారం చెన్నైలో పర్యటిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. అమిత్ షాకు తమిళనాడు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మురుగన్, ఇతర నేతలు సాదర స్వాగతం పలికారు.
ఎయిర్‌పోర్టు నుంచి లీలా ప్యాలెస్‌కు వెళ్లే దారిలో కారు నుంచి బయలకు దిగారు అమిత్ షా. కొంత దూరం వరకు కాలి నడకన వెళ్లారు. తనను ఆహ్వానించేందుకు వచ్చిన పార్టీ కార్యకర్తలకు ఆయన అభివాదం చేశారు. రోడ్డుపై నడుస్తున్న అమిత్ షాను చూసి పార్టీ నేతలు, కార్యకర్తలు ఆశ్చర్యపోయారు. చెన్నై రోడ్డుపై నడుస్తున్న ఆ వీడియోను అమిత్ షా తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలని ఆయన పేర్కొన్నారు.
అనంతరం వర్చువల్ వేదికగా తెర్వాయ్కండిగై రిజర్వాయర్‌ను ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు అమిత్ షా.చెన్నె మెట్రో రెండో దశకు కూడా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంతో కలిసి దివంగత సీఎం జయలలిత చిత్రపటానికి నివాళి అర్పించారు కేంద్ర హోంమంత్రి.
వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండడం.. బీజేపీ-అన్నాడీఎంకే కలిసి పోటీ చేయబోతున్నాయన్న ఊహాగానాల నేపథ్యంలో... చెన్నైలో అమిత్ షా పర్యటన హాట్ టాపిక్‌గా మారింది. ఐతే అమిత్ షా పర్యటనకు రాజకీయలకు సంబంధం లేదని.. దీనిని ప్రభుత్వ కార్యక్రమంగానే చూస్తున్నామని అన్నాడీఎంకే నేతలు తెలిపారు.
మరోవైపు చెన్నైలో అమిత్ షా పర్యటనను డీఎంకే సహా పలు పార్టీలు, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. చెన్నై ఎయిర్‌పోర్టులో ఓ వ్యక్తి అమిత్ షాపై బ్యానర్ విసిరేశాడు. అప్రమత్తమైన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అటు సోషల్ మీడియాలో అమిత్ షా పర్యటనకు వ్యతిరేకంగా చాలా మంది ట్వీట్ల మోత మోగించారు. #GoBackAmitShah హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండింగ్ చేశారు.
Published by:
Shiva Kumar Addula
First published:
November 21, 2020, 5:28 PM IST