Targeted Killings In Kashmir : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గురువారం ఉదయం ఓ మేనేజర్‌ను పొట్టనబెట్టుకున్న ముష్కరులు.. కొన్ని గంటల వ్యవధిలోనే మరో ఘాతుకానికి తెగబడ్డారు. బుద్గాం జిల్లాలో బీహార్‌కు చెందిన వలస కార్మికులపై ఉగ్రవాదులు గురువారం రాత్రి కాల్పులు జరిపారు. ఇద్దరిపై కాల్పులు జరపగా, ఒకరు మృతి చెందారు. మరొక కార్మికుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరొకరు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. మృతుడిని దిల్ఖుష్ కుమార్(17)గా పోలీసులు గుర్తించారు. వలస కార్మికులిద్దరూ చడోరా గ్రామంలో నిర్వహిస్తున్న ఇటుక బట్టీల్లో పని చేస్తు జీవనోపాధి పొందుతున్నారు.
గురువారం ఉదయం కుల్గామ్ జిల్లాలో బ్యాంకులోకి చొరబడిన ఉగ్రవాదులు మేనేజర్ విజయ్ కుమార్‌ను కాల్చిచంపారు. విజయ్ ఇటీవలే ఈ బ్రాంచిలో విధుల్లో చేరారు. విజయ్ స్థలం రాజస్తాన్ లోని హనుమాన్‌నగర్‌గా కశ్మీర్ పోలీసులు గుర్తించారు. , విజయ్‌కుమార్ మరణవార్త తెలుసుకొని ఆయ న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తన కుమారుడు శాఖాపరమైన పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నాడని తండ్రి ఓంప్రకాశ్ తెలిపారు. బ్రాంచ్ మేనేజర్‌గా పదోన్నతి పొంది, ఇతర రాష్ట్రానికి వెళ్లాలని భావిస్తున్నాడని గద్గద స్వరంతో చెప్పారు. విజయ్‌కుమార్ హత్య నేపథ్యంలో గురువారం వందలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు శ్రీనగర్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. తమను తక్షణమే సొంత ప్రాంతాలకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.
ALSO Terror Attack: జమ్ములో బ్యాంక్ మేనేజర్ని కాల్చి చంపిన ముష్కరులు .. వీడియో ఇదిగో
కశ్మీర్లో మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు కాల్పులు జరపడం మూడు రోజుల్లో ఇది మూ డోసారి కావడం గమనార్హం. మే 1 నుంచి ఇప్పటి వరకు ఎనిమిది మందిని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. కశ్మీర్లో ఉగ్రవాదులు ఘాతుకాలకు పాల్పడుతున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఉన్నతాధికారులతో గురువారం భేటీ అయ్యారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, 'రా' చీఫ్ సామంత్ గోయల్ తదితరులతో సమావేశమయ్యారు. వాస్తవానికి షెడ్యూలు ప్రకారం శుక్రవారం జరగాల్సిన ఈ సమావేశం తాజా హత్యల నేపథ్యంలో ఒకరోజు ముందే నిర్వహించారు. నార్త్‌బ్లాకులోని హోం మంత్రి కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం గంటకు పైగా వీరి మధ్య కీలక చర్చలు జరిగాయి. సమావేశం వివరాలు బయటకు తెలియకపోయినా కశ్మీర్ పరిస్థితులపైనే మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఈ చర్చలు శుక్రవారం నాటి సమావేశంలోనూ కొనసాగనున్నాయి.
కశ్మీర్‌లోని పరిస్థితులపై విపక్షాలు..బీజేపీపై ఎదురుదాడికి దిగాయి. స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు వరుస సంఘటనల నేపథ్యంలో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.