Cow: ఆవుల పెంపకంతో ఎన్నెన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..? కాస్త ఆలోచిస్తే కాసుల పంటే..

ప్రతీకాత్మక చిత్రం

తక్కువ ధరలో, దేశీయంగా ఆవుపేడ నుంచి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ఇంధనాన్ని సృష్టించవచ్చని RKA వెల్లడించింది. ఆవుల సాయంతో అనేక వ్యాపార అవకాశాలు సృష్టించుకోవచ్చని ఆ సంస్థ తెలిపింది.

  • News18
  • Last Updated :
  • Share this:
పెరుగుతున్న గ్యాస్, పెట్రోలు ధరలు ప్రజలకు భారంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆవుపేడతో ఇంధన సమస్యలకు పరిష్కారం చూపించవచ్చని రాష్ట్రీయ కామధేను ఆయోగ్ (RKA) సంస్థ చెబుతోంది. దీన్ని నేషనల్ కౌ మిషన్ అని కూడా పిలుస్తున్నారు. తక్కువ ధరలో, దేశీయంగా ఆవుపేడ నుంచి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ఇంధనాన్ని సృష్టించవచ్చని RKA వెల్లడించింది. ఆవుల సాయంతో అనేక వ్యాపార అవకాశాలు సృష్టించుకోవచ్చని ఆ సంస్థ తెలిపింది. వాహనాలు నడపడానికి ఆవు పేడతో వచ్చే CNG వాడటం, ఎద్దుల వీర్యంతో సెమెన్ బ్యాంకుల ఏర్పాటు, ఆవుల టూరిజం వంటి బిజినెస్ ఐడియాలతో RKA ముందుకు వస్తోంది. అనేక వెబినార్లలో ఇలాంటి వ్యాపార మార్గాల గురించి చర్చించినట్లు సంస్థ వెబ్‌సైట్లో తెలిపింది. పాతకాలంనాటి జ్ఞానానికి కొత్తతరం సాంకేతికతను జోడించి ఆవుల పెంపకంతో వ్యాపారాలను ప్రారంభించవచ్చని ఆ సంస్థ పేర్కొంది.

ఆవుపేడతో ఎన్నోరకాల వ్యాపారాలు చేయవచ్చని RKA చెబుతోంది. "భారత్‌లో బయోగ్యాస్‌ను చాలాకాలం నుంచి ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. వీటిని సిలిండర్లలో నింపి వంట చేయడానికి ఉపయోగించవచ్చు. ఆవు పేడ నుంచి వచ్చే శక్తిని రవాణా కోసం కూడా ఉపయోగించవచ్చు. బయోగ్యాస్‌ను పెద్దమొత్తంలో ఉత్పత్తి చేసి CNG పంపులను ఏర్పాటు చేసుకోవచ్చు" అని నేషనల్ కౌ కమిషన్ వెబ్‌సైట్ పేర్కొంది.

పెట్రోల్ కి ప్రత్యామ్నాయంగా పెట్రోల్ ధరలు లీటరుకు రూ.90 వరకు పెరిగాయి. డీజిల్ ధర కూడా భారీగా పెరుగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు లీటరు రూ.100కు చేరుకున్నాయి. ఒకవైపు కరోనా కారణంగా ఆదాయ మార్గాలు దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఇంధనం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వీటిపై కేంద్రం విధిస్తున్న ట్యాక్స్‌ పెరుగుతోందని రాజకీయ పక్షాలు ఆరోపిస్తున్నాయి. ధరలు తగ్గించాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. అయినా సరే.. ఇప్పట్లో పెట్రోలు ధరలు తగ్గే అవకాశాలు లేవని కేంద్రం చెబుతోంది.

ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపై RKA దృష్టి సారించింది. కమిషన్ తాజాగా జాతీయ స్థాయిలో ‘cow science exam’ కూడా నిర్వహించింది. కేంద్ర పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఈ విభాగం పనిచేస్తుంది. ఎద్దుల వీర్యంతో ఏర్పాటు చేసే బ్యాంకుల వంటి వ్యాపార మార్గాలను కూడా ఈ కమిషన్ ప్రతిపాదిస్తోంది.

ఎద్దుల వీర్యంతో సెమన్ బ్యాంకులు ఆరోగ్యకరమైన, మంచి నాణ్యత కలిగిన కొన్ని జాతుల ఎద్దులకు, ఆవులకు డిమాండ్ ఎల్లప్పుడూ ఉంటుంది. పాలు ఎక్కువగా ఇచ్చే జాతులకు రైతులు ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇలాంటి జాతుల ఎద్దుల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు. అందువల్ల వీటి వీర్యంతో సెమన్ బ్యాంకులు ఏర్పాటు చేసి అవసరమైనప్పుడు ఆవులకు ఫలదీకరణం చేయవచ్చు. ఎద్దుల వీర్యంతో కేవలం పెయ్య దూడలే పుట్టేలా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. ఇవన్నీ వ్యాపార మార్గాలేనని RKA చెబుతోంది.

టూరిజం కూడా.. కొత్తగా cow tourism అంశాన్ని కూడా వ్యాపారంగా మార్చుకోవచ్చని నేషనల్ కౌ మిషన్ తెలిపింది. కొన్ని దేశాల్లో ఆరోగ్య ప్రయోజనాల కోసం ఆవును కౌగిలించుకుంటారని కూడా ఆ సంస్థ చెబుతోంది. ఇలాంటి ఆలోచనలను వ్యాపార మార్గాలుగా మార్చుకుంటే 'cow tourism' అనే భావన ఊపందుకుంటుందని RKA వెబ్‌సైట్లో పేర్కొంది. "ఆవుల పెంపకంతో ఆర్థిక, ఆరోగ్య, పర్యావరణ ప్రయోజనాలు ఉన్నాయి. రాజస్థాన్‌లో కేవలం ఆవుపేడతో నిర్మించిన అతిథి గృహాలు ఉన్నాయి. ఇక్కడ కేవలం ఆర్గానిక్ ఫుడ్స్ మాత్రమే వడ్డిస్తారు. ఇలాంటివన్నీ విదేశీయులను ఆకర్షిస్తున్నాయి. వారు ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు గడిపిన తరువాత తిరిగి పునరుజ్జీవం పొందినట్టుగా భావిస్తున్నారు. ఇలాంటి సృజనాత్మక వ్యాపార ఆలోచనలను అందిపుచ్చుకోవాలి" అని వెబ్‌సైట్లో పేర్కొంది.

ఆవుపేడతో ఆదాయ మార్గాలు గత కొన్ని సంవత్సరాలుగా భారత్‌లో పశుసంపద వృద్ధి చెందుతోందని గణాంకాలు చెబుతున్నాయి. 2012తో పోలిస్తే ప్రస్తుతం 1.6 మిలియన్లు పశువులు ఎక్కువగా ఉండటం విశేషం. ఆవు పేడతో కాగితాన్ని తయారు చేయవచ్చని RKA తెలిపింది. పంచగవ్యతో ఔషధాల తయారీకి, వ్యవసాయ రంగంలో ఎరువులుగా ఉపయోగించడానికి కూడా దీన్ని వాడవచ్చని పేర్కొంది. కానీ ఇలాంటి అభిప్రాయాలు వ్యాపారాలుగా మారే అవకాశాలు తక్కువని నిపుణులు చెబుతున్నారు. వ్యాపార మార్గాల గురించి ఆలోచించడానికి ముందే మార్కెట్ రిసెర్చ్ చేయాలని భావిస్తున్నారు. ఇవేవీ లేకుండా వ్యాపారాలు మొదలుపెడితే ఫలితం ఉండదని తెలిపారు.
Published by:Srinivas Munigala
First published: