ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam)లో రోజుకో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. ఇప్పటికే ఈ కేసులో భాగంగా సీబీఐ, ఈడీ స్పీడ్ పెంచింది. ఈ క్రమంలో కొన్నిరోజుల కిందట బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును, గౌతమ్ మల్హోత్రాను, చారియట్ మీడియా అధినేత రాజేష్ జోషీ (Rajesh Joshi)ని అరెస్ట్ చేశారు. అంతేకాదు 2 రోజుల కింద ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను 8 గంటల పాటు విచారించిన సీబీఐ అనంతరం అరెస్ట్ చేశారు. అయితే సిసోడియా అరెస్ట్ అనంతరం తదుపరి అరెస్ట్ ఎవరనేది తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ క్రమంలో తాజాగా మరొకరిని ఈ కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.
ఈ కేసులో బ్రిండ్ కో సేల్స్ డైరెక్టర్ అమన్ దీప్ ధాల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. మనీ లాండరింగ్ కు సంబంధించి అమన్ ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. కాగా సీబీఐ FIRలో పేర్కొన్న వారిలో మన్ దీప్ ఒకరు. అభిషేక్ బోయిన పల్లి, విజయ్ నాయర్, మనోజ్ రాయ్, సమీర్ మహేంద్రు, అమన్ దీప్ లిక్కర్ పాలసీ తయారీలో చురుకుగా పాల్గొన్నట్టు అభియోగాలు ఉన్నాయి. ఈ మేరకు ఈడీ అమన్ దీప్ ను అరెస్ట్ చేసినట్టు సమాచారం.
ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) కేసులో ఇటీవల మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో భాగంగా ఈడీ రెండో ఛార్జ్ షీట్ లో కీలక వ్యక్తుల పేర్లు పేర్కొంది. ఏకంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (Delhi cm Kejriwal), వైసీపీ ఎంపీ మాగుంట పేర్లు ఛార్జ్ షీట్ లో ఈడీ పేర్కొంది. అలాగే అభిషేక్ బోయినపల్లి, అమిత్ అరోరా, సమీర్ మహేంద్రు, శరత్ చంద్రా, విజయ్ నాయర్, బినోయ్ బాబు సహా మొత్తం 17 మంది నిందితులపై ఈడీ అభియోగాలు మోపింది. ఢిల్లీ మద్యం కుంభకోణం నుంచి వచ్చిన డబ్బును ఆప్ గోవాలో ఎన్నికల ప్రచారానికి వాడారని ఈడీ పేర్కొంది.
ఇక సాక్ష్యాలు ధ్వంసం చేసిన వారి పేరులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. అలాగే విచారించిన జాబితాలో కవిత పేరును ఈడీ పేర్కొంది. ఇక ఈడీ (Enforcement Directorate) ఛార్జ్ షీట్ లో తన పేరును ప్రస్తావించడంపై కేజ్రీవాల్ (Delhi cm Kejriwal) సెటైర్లు వేశారు. అవినీతికి వ్యతిరేకంగా ఈడీ పని చేయడం లేదు. ప్రభుత్వాలను కూల్చడానికి ఈడీ (Enforcement Directorate) పని చేస్తుంది. ఈ ఛార్జ్ షీట్ మొత్తం ఒక కల్పితమని ఢిల్లీ సీఎం కొట్టిపడేశారు.
ఇక తాజా అరెస్టులతో కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. వీరి విచారణ అనంతరం మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉండనున్నట్లు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Arrested, Delhi liquor Scam